Friday, December 27, 2013

ఆంక్షలు లేక పొతే అంతే సంగతులు !

దేశంలోని మిగతా 28 రాష్ట్రాల మాదిరి తెలంగాణా  కూడా అంక్షలు లేని విధంగా ఏర్పరచాలని డిమాండ్ చేస్తున్న తెలబాన్ నాయకునికి దేశంలో మిగతా రాష్ట్రాలు ఏకాభిప్రాయం తో ఏర్పడ్డాయని,  సంప్రదాయానుసారం  విభజనకి పూర్వపు శాసన సభ తీర్మానం ద్వారానే ఆయా కొత్త రాష్ట్రాల ఏర్పాటుకి నాంది జరిగిందని తెలియదా? కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలే కొత్త రాజదానులని ఏర్పాటు చేసుకున్నాయి కానీ ఉమ్మడిగా అభివృద్ది చెందిన రాజధానిని కైంకర్యం చేస్తూ అవశిష్ట ప్రాంతానికి మొండి చెయ్యి చూపించే విధంగా ఇంతకూ ముందు ఏ రాష్ట్రమైనా ఏర్పడిందా?   కానీ తెలంగాణా విషయంలో ఏం జరుగుతోంది ?  2009 డిసెంబర్ 9 ప్రకటనలో కేంద్ర హొమ్ మంత్రి తెలంగాణా ఏర్పాటుకై ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించగా, ఈనాడు   విభజన వాదులు కేంద్రంతో కుమ్మక్కు అయిన ఫలితంగా మొదటి ప్రక్రియనుండే  తొండి ఆట మొదలు పెట్టారు.    ఒక రాష్ట్ర  విభజన వంటి ప్రాముఖ్యమైన విషయం కేంద్ర కేబినెట్ సమావేశం ఎజెండా లో వుండదు..నోట్ తయారు అవుతున్న విషయం సాక్షాత్తు కేంద్ర హొమ్ మంత్రికి మధ్యాహ్నానికి తెలియదు...  కానీ సాయంత్రానికల్లా  టేబుల్ పాయింటు గా ప్రత్యక్షమై ఆమోదమై పోతుంది!   అలాగే మంత్రుల కూటమి! ఒక తెలుగు రాష్ట్రాన్ని విభజించే ప్రక్రియలో ఒక్క తెలుగు మంత్రి కూడా ఉండడు.. మంత్రుల కూటమి కూడా హస్తిన వదలి రాదు.. కానీ చిత్తం వచ్చినట్లు నివేదిక తయారు చేయటంలో మాత్రం వారు సిద్ధ హస్తులు.  రెండు నెలలు కూర్చుని వారు వండి వార్చిన నివేదిక తో బిల్లు సిద్ధమయ్యాక కూడా మళ్ళీ అదే తంతు!  టేబుల్ పాయింటు గా కేబినేట్ సమావేశం లో బిల్లు ప్రవేశ పెట్టి -  సీమాంధ్ర మంత్రులు బిల్లు పరిశీలించటానికి సమయం అడిగినా నిరాకరించి బలవంతపు ఆమోదం జరిగిన సంగతి తెలిసిందే!  ఇక రాష్ట్రపతి నుండి తిరిగి వచ్చిన బిల్లుని  ప్రత్యెక దూత ద్వారా ప్రత్యెక యుద్ధ విమానంలో హైదరాబాదు కి పంపటం కొస మెరుపు!  ఈ అవకరాలన్నీ ఒక ఎత్తు ఐతే, తెలబాన్ల అరాచకాలు మరో ఎత్తు! ప్రత్యెక రాష్ట్ర ప్రస్తావనే లేని రోజుల్లోనే వారు చేసిన అరాచకాలకి లెక్కే లెదు.  
 సమైక్య రాష్ట్రంలో తెలంగాణా రాష్ట్రం పేరిట ఫలకాలు ఏర్పాటు చేయటం, వాహనాలకి టీజీ స్టిక్కర్లు అంటించటం, జాగో భాగో అనటం, తరిమి కోడతామనటం, పండక్కి వెళ్ళిన సీమాంధ్రులని తిరిగి రానివ్వమనటం, ఆస్తులు లాక్కుంటామనటం, సీమాంధ్రుల భూములు పంచేస్తామనటం ఇలా ఒకటా రెండా... అంతు లేని కధ ఆ అరాచకం!  అదంతా గతం!  ఇప్పుడు కేంద్రం ప్రత్యెక రాష్ట్రానికి సై  అనగానే తెలబాన్ నాయకుడు జూలు విదిల్చాడు.
 సాక్షాత్తు ముఖ్య మంత్రినే టిఫిన్ సెంటర్ పెట్టుకోమన్నాడు. తమకి కప్పం కడుతూ బతకమన్నాడు..ఉద్యోగులకి ఆప్షన్లు లేవన్నాడు..సీమాంధ్రకి వెళ్లి పోవాల్సిందే అన్నాడు.. నాయకుడు అలా వుంటే అనుచర గణం  ఇంకెలా వుంటుంది? 

 డిసెంబర్ 31తరువాత సీమాంధ్రులని వెళ్ళ గోట్టాలంటూ రబ్బరు స్టాంపులు వేసి మరీ ప్రచారం చేస్తున్నారు!  ఇన్ని అవకారాలు, అరాచకాలు ఉన్న పరిస్థితిలో - దొంగ చేతికే తాళం ఇచ్చినట్లు - సీమాంధ్రకి, సీమాంధ్ర ప్రజలకి తగిన ప్రత్యామ్నాయాలు, రక్షణలు  చూపకుండా - హడావిడిగా రాష్ట్ర విభజన సాధ్యమా?  ఎట్టి పరిస్థితిలో కానే కాదు!!      

Monday, December 23, 2013

తిక్క కుదిరింది !


బ్రాహ్మణులని అపహాస్యం చేస్తూ మోహన్ బాబు తీసిన "దేనికైనా రెడీ" చిత్రం  గురించి గతంలో నేను వేసిన టపా ఇక్కడ  చదవండి.  హద్దు పద్దు లేని అహంకారంతో బ్రాహ్మణులని అపహాస్యం చేస్తూ చిత్రం  నిర్మించిన మోహన్ బాబు తన పాపానికి ప్రాయశ్చిత్తం ఇప్పుడే అనుభవించబొతున్నాడు.  భారత ప్రభుత్వం కట్ట బెట్టిన పద్మశ్రీ పురస్కారాన్ని వారం రోజుల్లోగా వెనక్కి ఇచ్చేయాలని న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మోహన్ బాబు వంటి అహంకారులకి చెంపపెట్టు వంటిది.  దుష్టజన సాంగత్యం చెరుపే చేస్తుందన్న రీతిగా మోహన్ బాబుతో కలిసి నటించిన పాపానికి  బ్రహ్మానందం కూడా తన పద్మశ్రీ  పురస్కారాన్ని కోల్పోవలసి రావటం ఆయన దురదృష్టమే !   

Tuesday, December 17, 2013

అంతా రాజ్యాంగ బద్దంగా జరిగితే - అంత తొందర ఎందుకు ?

కాబినెట్ నోట్ ప్రవేశ పెట్టిన దగ్గరనుంచి తెలంగాణా  బిల్లు ని కాబినెట్ ఆమోదించే సమయం దాకా  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన వ్యవహారంలో కేంద్రం తొండి ఆటే ఆడింది.  ఒక రాష్ట్ర విభజన వంటి ప్రాముఖ్యత గల విషయాన్ని టేబుల్ పాయింటుగా ప్రవేశ పెట్టి కాబినెట్ నోట్ ని హడావిడిగా ఆమోదం తెలపటంతోనే  కుట్ర పూరిత వ్యవహారం బహిర్గతమయ్యింది.  ఆ తరువాత బిల్లుని కాబినెట్ ఆమోదించే సమయంలో కూడా అంతే !    ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఒక్కరుకూడా లేని  మంత్రుల కూటమి రెండు నెలల సమయం వెచ్చించి తయారు చేసిన  బిల్లు పరిశీలించటానికి రెండు రోజుల సమయమైనా ఇవ్వమని సీమాంధ్రకి చెందిన కేంద్ర మంత్రి అభ్యర్ధించినా,  తిరస్కరించి   బలవంతపు ఆమోదం జరిపారు.  ఇక ఇప్పుడు రాష్ట్ర శాసన సభ వంతు ! హస్తినలో కూచుని తయారు చేసిన బిల్లు రాష్ట్ర భవిష్యత్తు పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న విషయం చర్చించటానికి రాష్ట్రపతి విజ్ఞతతో 6 వారాల సమయం ఇస్తే దానికీ అభ్యంతరమే! ప్రజా ప్రతినిదులనుండి తెలంగాణా మేధావుల వరకు అందరూ త్వర త్వరగా కేంద్రానికి తిప్పి  పంపమనే వారే!  2000 సంవత్సరంలో పూర్తి  ఏకాభిప్రాయంతో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయా  శాసన సభలకి కనీసం 40 రోజుల గడువుని ఇచ్చారు. ఇప్పుడు కేవలం ఒక్క ప్రాంత ప్రయోజనాలకి కొమ్ము కాస్తూ పక్షపాత ధోరణి తో ప్రతిపాదించిన విభజన బిల్లు చర్చించటానికి 6 వారాల సమయం ఎంత మాత్రం చాలదు.     అంతే  కాదు.. గతంలో నిండు శాసన సభలో గవర్నర్
ప్రసంగ పాఠాలని చించి ఆయన మొహానే విసిరి కొట్టిన వారు నేడు రాష్ట్రపతి పంపిన బిల్లు పవిత్రమైనదంటూ చిలక పలుకులు పలుకుతున్నారు.   రాష్ట్ర శాసన సభ అభిప్రాయంతో పనే లేకుండా పార్లమెంటులో బిల్లు పెట్టేస్తామని బీరాలు పలికిన వారు ఈ రోజు శాసన సభలో విస్తృత  చర్చకి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు?   సీమాంధ్రుల అభిప్రాయాలకి ఏ మాత్రం విలువనివ్వకుండా వారికి సమస్యలు చెప్పుకొనే అవకాశమే ఇవ్వకుండా నిరంకుశంగా తయారు చేసిన బిల్లు ని చీల్చి చెండాడే అవకాశం ఒక్క శాసన సభలోనే ఉంది. ఇప్పటికే తమ అధిష్టానానికి లోబడి సీమాంధ్ర ప్రజలని  వంచించిన ప్రజా ప్రతినిధులు ప్రస్తుత బిల్లులో   సీమాంధ్రుల ప్రయోజనాలకి భంగం వాటిల్లే ప్రతి క్లాజుకి తగిన సవరణలు ప్రతిపాదించకుండా బిల్లుని యధాతధంగా కేంద్రానికి తిప్పి పంపితే వారు ప్రజా ద్రోహులే కాదు జాతి ద్రోహులు కూడా అవుతారు... 

Monday, December 9, 2013

రాష్ట్ర విభజన తో కాంగ్రెస్ చేస్తున్నది జాతి ద్రోహమే కాదు, దేశ ద్రోహం !

తెలుగు జాతికి ఈ రోజు విద్రోహ దినం!  పచ్చగా వున్న తెలుగు వారిని కేవలం తన రాజకీయ అవసరాల కోసం ముక్కలుగా చేయ తలపెట్టిన కాంగ్రెస్ అధినేత్రి జన్మదినం మన తెలుగు జాతికి దుర్దినం.. కేంద్రంలో రెండు సార్లు అధికారం చేపట్టటానికి అవసరమైన ప్రాతినిధ్యమిచ్చి గౌరవించిన తెలుగు వారి నెత్తినే భస్మాసుర హస్తం పెట్టిన కాంగ్రెస్  కి చివరి రోజులు దాపురించాయని తాజాగా జరిగిన  ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.  అసలు  రాష్ట్ర విభజన వంటి ప్రాముఖ్యత గల విషయాన్ని అధికారం కొద్ది రోజుల్లో ముగిసి పోతుందనగా చేపట్టటమే సరి ఐన పధ్ధతి కాదు.   అందునా ఆంధ్ర ప్రదేశ్ ని  విభజిస్తే దాని దుష్పరిణామాలు   కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే  గాక దేశం మొత్తం ఉంటాయని ప్రభుత్వమే నియమించిన శ్రీ కృష్ణ కమిటీ,  ఐబీ వంటి సంస్థలు కూడా హెచ్చరించిన నేపధ్యంలో తాను పట్టిన కుందెటికి మూడే కాళ్ళన్న రీతిగా మొండిగా కాంగ్రెస్ పార్టీ ముందుకి సాగటం అర్ధ రహితం.  ఆర్టికిల్ 3 ని దుర్వినియోగం చేస్తూ - రాష్ట్ర శాసన సభ అభిప్రాయానికి స్థానం లేకుండా విభజన ప్రక్రియని కొన సాగించటం తెలుగు  జాతికి చేస్తున్న ద్రోహం అయితే -  జిహాదీ తీవ్ర వాదం, నక్సల్ తీవ్ర వాదం పెచ్చరిల్లుతాయని  ప్రభుత్వ సంస్థలే హెచ్చరించినా కూడా దేశ సమగ్రతని పణంగా పెట్టి మరీ ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించాలని మొండికేయటం ఖచ్చితంగా దేశ ద్రోహమే !  కేవలం ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాలే తప్ప మరే విధమైన ప్రయోజనాలు ఒనకూడని విభజన బిల్లుని రాష్ట్రపతి తన వివేచన ఉపయోగించి  తిప్పి పంపాలి.  అంతే
కాదు, దేశంలో ప్రస్తుతం నిద్రాణంగా వున్న గోర్ఖలాండ్, బోడోలాండ్, విదర్భ వంటి వేర్పాటు ఉద్యమాలు కూడా పునరుజ్జీవితమై అనేక సమస్యలకి మూల కారణం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది.   కొత్త రాష్ట్రాల ఏర్పాటు వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ పై పెను భారం పడటమే గాక శాంతి భద్రతలకి కూడా భంగం వాటిల్లనున్న పరిస్థితుల్లో కేంద్రం ఏక పక్షంగా, నిరంకుశంగా ప్రతిపాదిస్తున్నఆంధ్ర ప్రదేశ్  విభజన బిల్లుని తిరస్కరించటం ప్రధమ పౌరునిగా రాష్ట్రపతి కర్తవ్యం. 

Monday, December 2, 2013

సర్వ అనర్ధాలకు కారణభూతమయ్యే విభజన మనకొద్దు !




శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన రహస్య నోట్ గురించి వార్తా పత్రికల్లో వచ్చిన కధనాలు గమనిస్తే రాష్ట్ర విభజన అన్నది ఎంత అనర్ధ దాయకమో తేట తెల్లమై పోతుంది.  తెలంగాణా అన్నది విఫల రాష్ట్రంగా మిగిలి పోతుందని విష్పష్టంగా కమిటీ ప్రకటించింది.  అంతే కాదు.. ప్రస్తుతానికి అదుపులో ఉన్న నక్సల్ సమస్య - అలాగే మనం మరచి పోయిన మత  కలహాలు వంటి విపత్తులు కూడా సంభవించే అవకాశం  వుందని తేల్చింది.  దేశానికే ప్రమాదకరమైన జిహాదీ తీవ్ర వాదం కూడా పెచ్చరిల్లే అవకాశం వుందని తేల్చి చెప్పింది.  ఇది 2010 నాడు శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన వివరణ !  ఇప్పుడు తాజాగా ఐబీ అధిపతి ఇబ్రహీం కూడా ప్రత్యెక రాష్ట్రం ఇస్తే అది కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే గాక దేశ  వ్యాప్తంగా భద్రతా సంస్థలకి కొత్త సవాళ్లు ఎదురౌతాయని కేంద్ర హొమ్ మంత్రితో అధికారిక సమావేశం లో ప్రకటించారు. ఇంక ఈ మధ్యనే కేంద్ర హొమ్ శాఖ తరపున రాష్ట్రానికి వచ్చిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఏ నివేదిక సమర్పించిందో బహిర్గత పరచక పోయినా దాదాపు ఇటువంటి పరిణామాలనే సూచించినట్లు వార్తా కధనాలు తెలియజెప్తున్నాయి.     స్వయంగా ప్రభుత్వమే నియమించిన శ్రీ కృష్ణ  కమిటీ - అలాగే సాక్షాత్తు ప్రభుత్వ సంస్థ అయిన ఐబీ వంటి సంస్థలు  విభజన వలన  ఏర్పడే దుష్పరిణామాలని  ఏకరువు పెట్టినా కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం రాజకీయ సమీకరణాలని దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన కోసం మొండి గా ముందుకి సాగటం మూర్ఖత్వం. ఓ పక్క ఉత్తర ప్రదేశ్ శాసన సభ తన రాష్ట్రాన్ని 4 ముక్కలుగా విభజించమని కేంద్రానికి తీర్మానం పంపినా దాన్ని పక్కన పెట్టి - మన  రాష్ట్రంలో  70 శాతం మంది ప్రజలు విభజనకి వ్యతిరేకం అయినా కూడా, మన  రాష్ట్ర శాసన సభ అంగీకారంతో ప్రమేయం లేదు అన్న రీతిగా నిరంకుశంగా సాగుతున్న విభజన ప్రక్రియ  రాజ్యాంగం లోని ఆర్టికిల్ 3 దుర్వినియోగం చెయ్యటమే అవుతుంది.  అంతే గాక విభజన వల్ల రాష్ట్రం లోపల - బయట కూడా భద్రతా పరమైన సవాళ్లు ఎదురు అవుతాయని సమాచారమున్నా కూడా కేంద్రం వెనుకడుగు వేయక పోవటం దేశ సమగ్రత పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్త శుద్ది నే శంకించే పరిస్థితి తెస్తోంది.  కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర / దేశ సమగ్రతలని పణం గా పెట్టి కాంగ్రెస్ తీసుకు రానున్న విభజన బిల్లు ని ప్రతిపక్షాలన్నీ తిప్పి కొట్టాలి.  అలాగే రాష్ట్రపతి కూడా తన వివేచన ఉపయోగించి సర్వారిష్ట కారకమైన విభజన బిల్లు అనుమతించకుండా  విజ్ఞత చూపించాలి.   కాని పక్షంలో మన రాష్ట్రాన్ని, దేశాన్ని ఆ భగవంతుడే కాపాడాలి....