Monday, May 23, 2011

ఎస్ ఆర్ సీ బొమ్మలాట కాదు..

తెలంగాణా చిచ్చుని రగిల్చి ఇప్పటికే రాష్ట్రాన్ని అధో గతి పాల్జేసిన కేంద్రం తాజాగా సార్వత్రిక ఎన్నికల వరకు కాల యాపన చేయటానికి వీలుగా రెండో ఎస్.ఆర్.సీ అస్త్రాన్ని బైటకి తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణా విషయమై ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్న జగన్, చంద్ర బాబు లాంటి వారిని మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టటానికి కాంగ్రేసు కి ఉన్న ఈ అవకాశం జార విడుచుకోదు.  తమ స్వార్ధ పూరిత రాజకీయాల కోసం తెలుగు వారిని చదరంగంలో పావుల్లా వాడుకోవటం, తెలుగు రాష్ట్రాన్ని ఎల్ల వేళలా వంచించటం కాంగ్రెసుకి వెన్నతో పెట్టిన విద్య.  ఇప్పుడు ఎస్.ఆర్.సీ పేరుతొ ఆడ బోయే నాటకం కూడా అదే.  అయితే ఎప్పుడో 1955లోనే ఫజల్ అలీ నేతృత్వంలో ఏర్పడిన మొదటి ఎస్సార్సీ ఇక్కడి పరిస్థితుల్ని కూలంకషంగా అధ్యయనం చేసి తద్వారా ఇచ్చిన నివేదిక ఆధారంగానే విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయ్యింది.  ప్రత్యెక తెలంగాణా, ప్రత్యెక హైదరాబాదు వాదనలు ఎంత డొల్లవో కమిషన్ ఆనాడే కుండ బద్దలు కొట్టింది. ఆ వివరాలన్నీ కమిటీ రిపోర్టు 369 నుండి 389 వరకు గల పేరాలలో వివరంగా చర్చించడం జరిగింది.
http://en.wikipedia.org/wiki/Para_369_to_389_of_SRC

పోనీ అర్ధ శతాబ్దం తరువాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందనుకున్నా..తాజాగా కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ కమిటీ కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటమే అత్యుత్తమ పరిష్కారమంటూ తేల్చి చెప్పింది.  అంతే కాదు. ఝార్ఖండ్, చత్తీస్ గడ్ వంటి చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల మావోయిష్టుల వంటి తీవ్రవాద దళాల చర్యలు పెచ్చుమీరటంతో పాటు రాజకీయ అనిశ్చితి కూడా సంభవమేనని సవివరంగా నివేదించింది. ఇప్పటికైనా కేంద్రం తెలుగు వారి భవిష్యత్తుతో, వారి అభివృద్ధితో ఆటలాడుకోవటం మానాలి.  చేతనైతే సరైన పాలకుణ్ణి పెట్టుకొని సమైక్య రాష్ట్రం అభివృధికి తోడ్పడాలి. లేదా తమ వల్ల కాదనుకుంటే రాష్ట్రపతి పాలన విధించి అభివృది నిరోధకంగా మారిన వేర్పాటు వాదాన్ని తుదముట్టించాలి. లేని పక్షంలో తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు వాడి ఆగ్రహ జ్వాలకి కాంగ్రేసు పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో తుడిచి పెట్టుకు పోవటం ఖాయం. 

Sunday, April 17, 2011

వెర్రి కుదిరింది..రోకలి తలకి చుట్టండి..

ప్రత్యెక రాష్ట్రం వస్తుందన్న ఆశ నానాటికీ సన్నగిల్లుతుండటంతో దైవం మీద భారం వేస్తూ శత చండీ యాగం చేసాడు తెలబాన్ దొర!  తప్పు లేదు. ఇష్ట కామ్య సిద్ది కొరకు దైవ సహాయాన్ని అర్ధించడంలో అధిక్షేపించాల్సిన అవసరమే లేదు. 
అయితే ఆకులో అన్నీ వడ్డించి అంచులో ..... రాసినట్లు యాగం చివరలో పిట్టల దొర చేసిన వ్యాఖ్యలు మన్నించ దగ్గవి కాదు. 
ఆంధ్ర బ్రాహ్మణులది ఆర్భాటమట! తెలంగాణా అర్చకులే నిష్ఠ గల వారట!

నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు ప్రతి చిన్న విషయాన్నీ ప్రాంతీయ వాద రంగుటద్దాలలోంచే చూస్తూ విద్వేషాలు రగిలించే ఇటువంటి ప్రకటనలు చేయటం క్షంతవ్యం కానే కాదు.   ప్రాంతీయ వాద పైత్యం బాగా ముదిరి పోయిన దొరకి సరైన వైద్యం చేయటానికి తెలంగాణా ప్రాంతానికి చెందిన మంచి వైద్యుడు ఎవరైనా వున్నారేమో తెలబాన్ శ్రేణులు వెదికి వుంచుకుంటే మంచిది.
 (షరా: ఆ వైద్యుడు కూడా ఆంధ్ర ప్రాంతంలో జన్మించి వుండకూడదు / విద్యాభ్యాసం చేసి వుండకూడదు. )

Thursday, April 14, 2011

కళ్ళు తెరిచిన ప్రభుత్వం!

ఇన్నాళ్ళకి రాష్ట్రంలో ప్రభుత్వం నేనున్నాను అంటూ అస్తిత్వం చూపింది.. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ప్రభుత్వమంటే లెక్కే లేనట్లు ఇష్టానుసారం చెల రేగుతున్న వేర్పాటు వాద శక్తులకి ముకు తాడు వేసే దిశగా జీవో 177  విడుదల చేసింది. ఈ  జీవో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికీ వర్తిస్తుంది. అయినా కూడా దీని పై తెలబాన్ నాయకులు, తెలంగాణా ప్రాంత ఉద్యోగులు గుమ్మడి కాయ దొంగ బుజాలు తడుముకున్నట్లు రచ్చ చేస్తున్నారు.  అసలు ప్రభుత్వోద్యోగులందరికీ కాండక్టు రూల్సు, డిసిప్లినరీ రూల్సు అనేకం వుంటాయి. అవన్నీ సక్రమంగా అమలు జరిపితే  ఇలాంటి జీవో ఇవ్వాల్సిన అవసరమే వుండదు. అయినా కూడా ఇన్నాళ్ళు సహనం వహించిన ప్రభుత్వం ఇప్పటికైనా కొరడా ఝుళిపించడం అభినందనీయం.  రాజకీయ నాయకులు ఉద్యమాలు, ఆందోళనలు చేసారంటే అది వారి వ్యాపకం కాబట్టి ఆక్షేపించాల్సిన పని లేదు. అయితే తాము చేస్తున్న ఉద్యోగాలతో ఏ  మాత్రం సంబంధం లేని ఆందోళనల కోసం విధులు ఎగ్గోట్టేసి తేరగా ప్రజల సొమ్ము భోం చేద్దామనుకొనే ఉద్యోగుల పట్ల ఇటువంటి చర్య సముచితమే. తెలబాన్  దొర  వెంటనే స్పందిస్తూ ఈ జీవో ఇవ్వడానికి తెలంగాణా మంత్రుల ఆమోదం ఉందా అంటూ రంధ్రాన్వేషణ  మొదలు పెట్టేసాడు! అంతే కాదు! తెలంగాణా మంత్రులంతా రాజీనామా చేయాలని హుకుం జారీ చేసేసాడు! నిజమే...తెలంగాణా మంత్రులే కాదు..తెలంగాణా ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులు కూడా (కోదండ రాం తో సహా) తమ తమ కొలువులకి రాజీనామాలు ఇచ్చేసి ఉద్యమంలో పాలు పంచుకుంటే ఎవరికీ ఏ విధమైన అభ్యంతరాలు ఉండబోవు. ప్రభుత్వానికి కూడా ఇలా కర్ర పట్టుకోవాల్సిన పని కూడా వుండదు.

Wednesday, April 13, 2011

శభాష్ దీదీ!

బెంగాల్ విభజనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని మమతా బెనర్జీ కుండ బద్దలు కొట్టారు. గోర్ఖాలాండ్ ఏర్పాటుకి తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకమని దీదీ స్పష్టం చేసారు.  ఎన్నికల ముంగిట్లో....అందులో ప్రతి పక్షంలో ఉంటూ కూడా విధాన నిర్ణయం ధైర్యంగా ప్రకటించటం అభినందించాల్సిన విషయం.

ఈ మాత్రం చేవ, తెగువ మన వాళ్లకి వుంటే తెలంగాణా సమస్య కోతి పుండు బ్రహ్మ రాక్షసిలా తయారయి వుండేది కాదు.  అంతే కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి కావలసినది ఏమిటో శ్రీ కృష్ణ కమిటీ అరటి పండు వలిచి ఇచ్చినట్లు విశదీకరించాక కూడా ఒక విధాన నిర్ణయం తీసుకోకుండా మీన మేషాలు లెక్కిస్తున్న మన రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకి..ఎంత సేపూ స్వంత ఎజెండాలని అమలు చేసుకుంటూ పబ్బం గడుపుకోవడమే తప్ప సమస్య పరిష్కారానికి చిత్త శుద్ధి  చూపడం తెలియదన్నది స్పష్టమై పోయింది.

Sunday, April 3, 2011

అతిశయోక్తికైనా హద్దు వుండాలి!

పెట్టుబడులకి అత్యంత అనువైన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అంటూ ప్రభుత్వం ఈ రోజు పత్రికల్లో విడుదల చేసిన ప్రకటన చూస్తె నవ్వాలో ఏడవాలో తెలీదు. ఓ పక్క తెలబాన్ల దెబ్బకి ఇప్పటికే ఉన్న వ్యాపార వాణిజ్య వర్గాలన్నీ దుకాణాలు కట్టేసుకోవడమో లేదా గుజరాత్ కి తరలి వెళ్లి పోవటమో చేస్తున్నాయి.  ఇక కొత్తగా రాష్ట్రం కేసి తొంగి చూసే ధైర్యం ఏ వ్యాపార వేత్త కి లేనే లేదు. రాష్ట్రం లో ఆస్థిరతకి కారణమైన తెలబాన్ సమస్యని పరిష్కరించకుండా ప్రభుత్వం ఎన్ని మసి పూసి మారేడు కాయ చేసే ప్రకటనలు చేసినా ఏ వాణిజ్య వేత్త నమ్మే పరిస్థితి లేదు. కేవలం తెలబాన్ సమస్య పరిష్కారం కోసమే ఏర్పరచిన శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన అత్యుత్తమ ఆరో పరిష్కార మార్గం అమలు విషయమై శ్రద్ధ చూపి ఆ తరువాత ఇటువంటి ప్రకటనలు ఇస్తే అర్ధవంతంగా వుంటుంది. ప్రభుత్వానికి నిజంగా చిత్త శుధ్ధి వుంటే తక్షణం వేర్పాటువాదాన్ని కూకటి వేళ్ళతో పెకలించే దిశగా చర్యలు తీసుకొని, రాష్ట్రం లో ప్రశాంత పరిస్థితులు నెలకొలిపే ప్రయత్నం చేయాలి.

Friday, March 18, 2011

ఆంధ్రావనికి ద్రోహం చేస్తున్న జగన్...

మాట  తప్పని, మడమ తిప్పని వంశానికి చెందిన వాడినని చెప్పుకొనే జగన్ మాట తప్పుతున్నట్లే కనిపిస్తోంది. శాంతి స్వరూపుడైన బుద్ధుని విగ్రహాలని నాశనం చేసిన తాలిబాన్ల లాగ తెలుగు జాతి ఘన చరిత్రకి సంకేతాలైన టాంక్ బండ్ మీది విగ్రహాలని ద్వంసం చేసిన తెలబాన్లని జగన్ కించిత్తు విమర్శించక పోవటం ఆశ్చర్యకరం. కాంగ్రెస్ పార్టీలో వున్నప్పుడు పార్లమెంటు సాక్షిగా రాష్ట్ర విభజనకి తాను వ్యతిరేకమని స్పష్టం చేసిన జగన్ ఇప్పుడు సొంత పార్టీ పెట్టాక తన విధానం ప్రకటించక పోవటం శోచనీయం.
( పైన వీడియో చూడండి)  భాగస్వామ్య పక్షాల అంగీకారం తీసుకోకుండా తొందరపాటుతో డిసెంబర్ 9 ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే అవకాశాన్ని పార్టీనుండి బయటకి వచ్చాక జగన్ ఎందుకు సద్వినియోగం చేసుకోవట్లేదు? ఎటూ తేల్చకుండా నాన బెట్టబట్టే తెలంగాణా సమస్య ఈ రోజు కోతి పుండు బ్రహ్మ రాక్షసి అన్నట్లు తయారయింది. ఈ సంగతి తెలిసి కూడా సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రం తగలబడి పోతున్నా నిమ్మకి నీరెత్తినట్లున్న కాంగ్రెస్, టీడీపీ ల కి పోటీగా తాను కూడా వ్యూహాత్మక మౌనం పాటించటం నేరమే. వైఎస్ పధకాలన్నీ అమలు చేస్తానని డబ్బా కొడుతున్న జగన్, తండ్రి విశ్వసించిన సమైక్య వాదాన్ని ఎందుకు పాటిన్చట్లేదు? రాజ శేఖర రెడ్డి తరచుగా వాడిన పదం "విశ్వసనీయత". కేవలం పదవి కోసమే రాజకీయాలు చేసి ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన నాడు జగన్ రాజకీయ భవిష్యత్తు అంధకారమే అవక తప్పదు.

Saturday, March 12, 2011

పిచ్చి ముదిరిన కోదండ రాం!

అసలు పోలీస్ పర్మిషన్ లేకుండా మిలియన్ మార్చ్ వంటి కార్యక్రమాన్ని నిర్వహించడమే పెద్ద తప్పు. తాము అనుమతించని కార్యక్రమాన్ని నిర్వహించి- తెలుగు జాతి పరువు పోయేలా జరిగిన విధ్వంస కాండకి నేరుగా బాధ్యత వహించాల్సిన కోదండ రాంని తక్షణం శిక్షించాల్సిన పోలీసులు మీన మేషాలు ఎందుకు లెక్క పెడుతున్నారో తెలీదు.అందునా ఆ కార్యక్రమంలో జరిగిన విధ్వంసానికి బాధ్యత వహించటం కానీ,లేదా పశ్చాత్తాపం వ్యక్తం చేయక పోవటం ముదిరిన ఆయన అహంకారానికి నిదర్శనం. మొక్కుబడిగా మీడియాకి క్షమాపణ చెప్పేస్తే చేసిన పాపం ప్రక్షాళన అవదు. తన మీద చర్య తీసుకోక పోవటం అలుసుగా తీసుకొనే ఈ రోజు ఆయన మళ్ళీ పైత్యాన్ని వెళ్ళ గక్కారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ చచ్చి పోయిందనీ,త్వరలో కర్మ కాండలు నిర్వహిస్తామనీ సెలవిచ్చారు. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలనుండి వసూలైన పన్నులనుండి జీతం తీసుకుంటూ ఆంద్ర ప్రదేశ్ శాసన సభ పైనే ఇటువంటి దురహంకార వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం సహించకూడదు. ప్రభుత్వం ఇప్పుడు ఆయన పై చర్య తీసుకోవడానికి రెండు అవకాశాలున్నాయి.
ఒకటి- ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు, చర్యలు చేస్తున్నందుకు కఠినంగా శిక్షించడం...
అంత చేవ, తెగువ లేక పొతే...
రెండు- కోదండ రాంని ఎర్ర గడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చి, పిచ్చి వాడి మాటలకి విలువ లేదని ప్రకటించడం..

Thursday, March 10, 2011

తెలబాన్లను క్షమించకూడదు..

ఉద్యమం కాదు అది వున్మాదమే!
వేర్పాటు వాదం కాదు అది తీవ్ర వాదమే..
తెలబాన్ అక్రుత్యాలకి అంతు లేదా?
అరాచకత్వానికి అంతం ఎప్పుడు?
వేర్పాటు వాదులకి బుద్ది చెప్పాలి!
వెర్రి తలలు వేస్తున్న వేర్పాటు వాదం..
హద్దు మీరుతున్న తెలంగాణా ఉద్యమం..

ఇవన్నీ నేను ఇంతకు ముందు రాసిన టపాల  టైటిల్స్.. అన్నీకూడా అక్షర సత్యాలని ఈ రోజు తెలబాన్ గుంపులు నిరూపించాయి. తెలుగు వారి చరిత్రకి ప్రతిబింబాలైన మహనీయుల విగ్రహాలని అత్యంత దుర్మార్గంగా ద్వంసం చేయడమన్నది తెలబాన్ల పైత్యానికి పరాకాష్ట!   అమర జీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ద్వంసం చేసిన రోజే ప్రభుత్వం మేలుకొని వుంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదు. పైగా విగ్రహాలు పొతే మళ్ళీ వస్తాయి అంటూ పిల్ల తెలబాన్ నాయకుడు చేసిన వ్యాఖ్య క్షంతవ్యం కానే కాదు. నాశనమైనవి వట్టి విగ్రహాలే కాదు.. మొత్తం తెలుగు జాతి పరువు ప్రతిష్టలు కూడా నేడు హుస్సేన్ సాగర్ జలాల్లో కలిసి పోయాయి. రాజధాని నడి బొడ్డున ఇంత అరాచకం జరిగాక ప్రభుత్వం ఇంకా చేతులు ముడుచుకొని కూర్చోవటానికి వీల్లేదు. ముల్లుని ముల్లుతోనే తీయాలి. అరాచకత్వానికి ఆయుధంతోనే సమాధానం చెప్పాలి. మరో ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించి పైత్యం ప్రకోపించిన వేర్పాటు వాదాన్ని కూకటి వేళ్ళతో పెకలించాలి.

Tuesday, March 8, 2011

బెల్టు తీసిన పోలీస్-తోక ముడిచిన కోదండ రాం!

హైదరాబాదుని దిగ్బందిస్తాం..
ప్రపంచ చరిత్రలో ఇటువంటి ఆందోళన జరగలేదు., జరగ బోదు...
పోలీస్ పర్మిషన్ తీసుకొం..
ఉద్యమం చూసి ప్రభుత్వం ఇంటర్ పరీక్ష వాయిదా వెయ్యాలి...
కేంద్రాన్ని గడ గడలాడిస్తాం...
ఇలా ఒకటా రెండా? ఎన్నెన్ని ప్రేలాపనలు! ప్రభుత్వమంటే లెక్కే లేనట్లు..తన కను సన్నల్లో పరీక్షలు జరగాలన్నట్లు..కోదండ రాం హుంకరించారు.  కానీ చివరికి ఏం జరిగింది? పిల్లల పరిక్షల విషయమై వెల్లువెత్తిన ప్రజాగ్రహంతో పాటు ఆంక్షల కొరడా ఝుళిపించిన పోలీస్ దెబ్బకి కోదండ రాం తోక ముడవక తప్పలేదు. మిలియన్ మార్చి సమయాన్ని మూడు గంటలకు, స్థలాన్ని టాంకు బండుకి పరిమితం చేసుకోవాల్సి వచ్చింది.  ఇప్పటికైనా వాపుని చూసి బలుపనుకొని భ్రమ పడే వేర్పాటు (తీవ్ర) వాద గుంపులకి ఈ పరిణామం కనువిప్పు కావాలి.

Sunday, March 6, 2011

తెలంగాణా ఉద్యమం వెనుక ఉన్న అసలు కద!

(నా బ్లాగులో ముందరి టపాలో LBSతాడేపల్లి గారి కామెంట్ యదా తధంగా )


తెలంగాణ ఉద్యమం అనేది తెలుగుదేశం పార్టీని డౌన్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ నుంచీ తెఱ వెనక ఉండి డబ్బులిచ్చి మఱీ కృత్రిమంగా నడిపిస్తున్న వ్యూహాత్మక ఉద్యమమని తెలంగాణ అమాయకులకు తెలియదు. తెలియక, అదేదో తమవాళ్ళ ప్రతిభ, సృజనాత్మకత, పౌరుషం అనుకుని ఇంకా ఎక్కువెక్కువ లొల్లి చేస్తే భయపడి రాష్ట్రం ఇచ్చేస్తారనుకొని తెలంగాణకి అక్షరాలా నిప్పెట్టేస్తున్నారు. కేసీయార్ గర్జనలన్నీ నిజమనుకుంటున్నారు. మిహతా రాష్ట్రమంతా ఆనందంగా గడిపేస్తూండగా తెలంగాణ ఒక్కటీ ఒక తప్పుడు మిథ్యా ఉద్యమం పేరుతో నిలువునా తగలబడిపోతోంది. అందఱూ కలిసి దీన్ని ఎలాగైనా ఆపాలి !


తెలంగాణ సోదరులారా !

మీరు వట్ఠి అమాయకులు

కాంగ్రెస్ రాజకీయం తెలియని పిచ్చోళ్ళు

ఉద్యమం రేపెట్టింది వాళ్ళు

తాము వెనకుండి కేసీయార్ ని ముందుకు తోసింది వాళ్ళు

కేసీయార్ కి తెలంగాణ భవన్ ఇచ్చింది వాళ్ళు

అతన్ని గెలిపించింది వాళ్ళు

ఎవళ్ళు ? బాబూ ! ఇంకెవళ్ళు మన కాంగ్రేసోళ్ళు

కేసీయార్ కి డబ్బులు దొబ్బబెట్టింది వాళ్ళు

అతని చేత నిరాహారదీక్ష చేయించింది వాళ్ళు

విరమింపజేసింది వాళ్ళు

ఉద్యమం చేయించింది వాళ్ళు

ఎవళ్ళు ? బాబూ ! ఇంకెవళ్ళు మన కాంగ్రేసోళ్ళు

సహాయనిరాకరణ చేయించింది వాళ్ళు

నిరాకరణ విరమణ చేయించింది వాళ్ళు

మిలియన్ మార్చ్ చేయిస్తున్నది వాళ్ళు

ఇస్తామన్నది వాళ్ళు, వెనక్కు తీసుకున్నది వాళ్ళు

ఎవళ్ళు ? బాబూ ! ఇంకెవళ్ళు మన కాంగ్రేసోళ్ళు

ఇహనైనా కళ్ళు తెఱవండి ! విషయాలు గ్రహించండి !

రాని రాష్ట్రం కోసం అన్నదమ్ముల్లాంటి

ఆంధ్రావాళ్ళతో అనవసరంగా గొడవపడకండి !

ఢిల్లీ కాంగ్రెస్ కుటిల రాజకీయాలకు

కరాళంగా బలికాకండి !

ఇతరులని బలి చేయకండి !



మీరు సమైక్యవాదుల్ని అమ్మనా బూతులు తిట్టినా ఫర్వాలేదు గానీ మీ నిజాన్ని గ్రహించి మీ యీ ప్రవర్తనకు సిగ్గుపడే రోజు తప్పకుండా వస్తుంది. చాలా తొందఱగానే రాబోతోంది.

( LBSతాడేపల్లి గారికి కృతజ్ఞతలు )