(పక్కన ఉన్న చిత్రం ఆగష్టు,2012 నాటిది)
సీల్డ్ కవర్ ముఖ్యమంత్రిగా వచ్చి అధిష్టానం ముందు చేతులు కట్టుకున్న కిరణ్ కుమార్ రెడ్డి గురించి నేను గతంలో ఒక టపా  వేయటం జరిగింది.  అధిష్టానం ముందు చేతులు కట్టుకున్న అదే కిరణ్ కుమార్ రెడ్డి నేడు ఎందుకు తిరగబడ్డారు? ఎందుకంటే తలుపులు మూసి కొడితే పిల్లి అయినా తిరగబడుతుందని తెలిసిందే ! అసలు తెలంగాణా తేనె తుట్టెని కదిపిన 2009 డిసెంబర్ 9 నాడు కేంద్ర హొమ్ మంత్రి ప్రకటనలో ఏం ఉంది? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకి ప్రక్రియని ఆంద్ర ప్రదేశ్ శాసన సభ తీర్మానం ద్వారా  ప్రారంభింప చేస్తామని  సాక్షాత్తు కేంద్ర హొమ్ మంత్రి ఆనాడు ప్రకటించారు.  అంటే రాష్ట్ర విభజన ప్రక్రియ అన్నది రాష్ట్రం లోనే ప్రారంభం కావాలన్న విషయం కేంద్రానికి తెలుసు.   కానీ ఇప్పుడెం జరిగింది? రాష్ట్రంలో ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వం ఉందన్న స్పృహే లేకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో మెజారిటీ ప్రజల అభిప్రాయానికి విలువ లేకుండా సర్వాధికారాలు కేంద్రం చేతులోకి తీసుకొని - రాజ్యాంగం లోని  ఆర్టికిల్ 3 లో రాసి వుంది కదా అన్న అహంకారంతో కేంద్రం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటానికి పూనుకుంది. లక్ష్యాలు, ఆర్ధిక పత్రం వంటివి ఏమీ లేకుండా తప్పుల తడకలతో కూడిన చిత్తు కాగితాల వంటి బిల్లు (?) ని రాష్ట్ర శాసన సభ మొహాన కొట్టి అభిప్రాయం చెప్పమంది.  అదే ఆర్టికిల్ 3 లో రాసి వుంది కాబట్టి రాష్ట్రానికి పంపారు కానీ లేని పక్షంలో ఈ పాటికి కేంద్రమే రాష్ట్ర ప్రమేయం లేకుండా అడ్డగోలు విభజన పూర్తి చేసి పారేసి ఉండేది! అసలు బిల్లా లేక ముసాయిదా బిల్లా అన్నది స్పష్టత లేకుండా ఏదో ఒకటి రాష్ట్రానికి పంపేసి అభిప్రాయం చెప్పమంటే ఎలా కుదురుతుంది?  ఈ విషయాన్నే ముఖ్యమంత్రి సూటిగా ప్రశ్నించారు.   ముఖ్యమంత్రి ప్రశ్నకి స్పందించాల్సిన కేంద్ర హొమ్  శాఖ ఏమీ మాట్లాడక పోయినా కేంద్ర మంత్రి జై రామ్ రమేష్ మాత్రం బుజాలు తడుముకున్నారు.  ముఖ్య మంత్రి నోటీసు పై అసహనం వెళ్లగక్కారు!  అసలీ జై రామ్ రమేష్ ఎవరు?  ఆయన స్వంత రాష్ట్రమైన కర్ణాటకలో ఠికానా లేకపోతె పాముకి పాలు పోసినట్లు రెండు సార్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్య సభకి పంపితే నేడు కేంద్ర మంత్రి హోదా వెలగబెడుతున్నారు.  పాలు తాగి రొమ్ము గుద్దిన రీతిగా తనను ఎన్నుకున్న రాష్ట్రాన్నే ముక్కలు చేయటానికి అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.  మంత్రుల కూటమిలో ఉండి  తప్పుల తడకల బిల్లు తయారీలో ఆయనదే ముఖ్యమైన పాత్ర!  అందుకే ముఖ్యమంత్రి నోటీసు పై కేంద్ర హొమ్ శాఖ కి బదులుగా ఆయనే  బదులిస్తున్నారు.  నకిలీ నోట్ల లాగా నకిలీ బిల్లులు వుండవు అంటూ జైరామ్ రమేష్  చేసిన ప్రకటన వ్యక్తిగత హోదాలో చేసారా లేదా కేంద్రం తరపున చేసారా అన్న ముఖ్యమంత్రి ప్రశ్నకి కూడా సమాధానం లేదు! పైగా ప్రతి వారు రాజ్యాంగ నిపుణులు అవుతున్నారని దుగ్దని వెలిబుచ్చుతున్నారు.  రాష్ట్రపతి పంపిన బిల్లు అంటూ రోజుకి వంద సార్లు నొక్కి వక్కాణించే వేర్పాటు వాదులు కూడా గమనించాల్సిన విషయం ఒకటే!  అన్ని వివరాలతో కూడిన - పార్లమెంటులో ప్రవేశ పెట్టబోయే  సమగ్రమైన బిల్లునె రాష్ట్ర శాసన సభ అభిప్రాయానికి పంపాలి తప్ప లక్ష్య నిర్వచనం లేకుండా,  శాసనాధికారాల బదలాయింపు వివరాలు లేకుండా, ద్రవ్య వ్యవహారాల మోమోరాండం లేకుండా  కొన్ని చిత్తు కాగితాలు పంపి దానినే బిల్లు అనుకోమంటే  ఎలా కుదురుతుంది?  ఆ చిత్తు కాగితాలని చించి వేసిన, తగల పెట్టిన కొంత మంది శాసన సభ్యుల చర్య సరైనదే!    




