సమాఖ్య స్పూర్తికి పూర్తి విరుద్ధంగా ఉందంటూ మత హింస నిరోధక బిల్లుని అడ్డుకోవటంలో విపక్షాలు విజయం సాధించాయి. ఈ బిల్లు పై జరిగిన చర్చ సందర్భంగా అధికార, విపక్షాలకి చెందిన, ప్రముఖ న్యాయవాదులు కూడా అయిన అరుణ్ జైట్లీ, కపిల్ సిబాల్ ల వ్యాఖ్యలు గమనించతగ్గవి. ఈ బిల్లు ఆమోదించటం తరువాత, ముందు అసలు బిల్లుని ప్రవేశ పెట్టి చర్చించే అధికారం కూడా పార్లమెంటుకు లేదని అన్ని పార్టీలు ఆక్షేపించాయి. అంతే కాదు, ఈ బిల్లు పూర్తిగా పార్లమెంటు చట్ట పరిధి వెలుపలి అంశమని, ప్రభుత్వ పాలనా పరిధిలోకి రాదనీ అరుణ్ జైట్లీ కుండ బద్దలు కొట్టారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతితోనే శాంతి భద్రతల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని కపిల్ సిబాల్ మభ్యపెట్టాలని చూసినా కూడా సమాఖ్య స్పూర్తిని దెబ్బ తీస్తుందంటూ విపక్షాలన్నీ నిర్ద్వందంగా తిరస్కరించాయి. తప్పని సరి పరిస్థితుల్లో బిల్లు పక్కన బెట్టినట్లు రాజ్య సభ అధ్యక్షుడు ప్రకటించారు.
మరి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు సంగతి ఏమిటి?
అడుగడుగునా సమాఖ్య స్పూర్తికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాల అధికారాలని పూర్తిగా కేంద్రం చేతిలోకి తీసుకోవాలన్న దురుద్దేశ్యం తో తయారైన తెలంగాణా బిల్లుకి చట్ట బధ్ధతె ఉండదు. 2009 డిసెంబరు 9 ప్రకటనలో రాష్ట్ర విభజనకై ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో తీర్మానం ద్వారా ప్రక్రియ ప్రారంభిస్తామని స్వయంగా కేంద్ర హొమ్ మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ జరిగింది ఏమిటి? 2013 జూలై 30 తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఒకటి వున్నది అన్న స్పృహ అనేదే లేకుండా ఏకపక్షంగా, పూర్తి నిరంకుశ ధోరణి లో తయారు అయిన తెలంగాణా బిల్లు సమాఖ్య స్పూర్తికి విరుద్ధం కాదా? ఇంక శాంతి భద్రతలు మొదలుకొని వివాదాల పరిష్కారం వరకు ఈ బిల్లులో ఉన్న అన్ని అంశాలు రాష్ట్ర ప్రభుత్వ అధికారాలని కేంద్రం చేతిలోకి తీసుకొనే విధంగా వున్నవే! అసలు ఆర్టికిల్ 3 అనేది రాజ్యాంగంలో ఎందుకు ఉంది? దేశంలో ఏదైనా రాష్ట్రం విడి పోదలుచుకున్నా లేదా కొన్ని ప్రాంతాలు విలీనం అవుదామనుకున్నా వాటంతట అవి చేయలేవు కాబట్టి ఆయా రాష్ట్రాల శాసన సభల్లో విస్తృత చర్చల అనంతరం తీర్మానం చేసి కేంద్రానికి పంపితే - అప్పుడు కేంద్రం తనకి ఆర్టికిల్ 3 కింద ఉన్న అధికారంతో ఆయా రాష్ట్రాల అభీష్టాన్ని నెరవేర్చటం సమాఖ్య స్పూర్తి! ఆర్టికిల్ 3 కింద తయారు అయిన బిల్లు తమ శాసన సభల యొక్క తీర్మానానికి అనుకూలంగా వున్నదా లేదా అని సరి చూసుకోవటానికే విభజన/విలీనం జరిపే ముందు ఆయా శాసన సభల అభిప్రాయాలకి పంపాలని ఆర్టికిల్ 3 నిర్దేశిస్తోంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఈ విధంగానే తమ రాష్ట్రాన్ని 4 రాష్ట్రాలుగా విభజించాలంటూ తీర్మానం చేసి పంపింది. శాసన సభ తీర్మానం జరిగిన ఉత్తర ప్రదేశ్ ని పక్కన పెట్టి ఎటువంటి తీర్మానం పంపని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఉన్న పళంగా తన చిత్తం వచ్చినట్లు ముక్కలు చేయాలని తల పోయటం కేంద్ర దురహంకారం! పైగా రాష్ట్ర శాసన సభకి పంపిన బిల్లు లో ఉద్దేశ్యాలు, ఆర్ధిక పత్రాలు వంటి ముఖ్యమైన వివరాలేమీ లేకుండా చిత్తు కాగితాల వంటి బిల్లు పంపటం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అంతే గాక విభజనకై పంపిన బిల్లుని ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ తిరస్కరించినా కూడా కేంద్రం విభజనకి మొండిగా అడుగులు వేయటం ప్రజాస్వామ్య విరుద్ధం. విభజనకి మొగ్గు చూపిన ఉత్తర ప్రదేశ్ విన్నపాన్ని తుంగలో తొక్కి స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రే వ్యతిరేకిస్తున్న అడ్డగోలు విభజన బిల్లు పార్లమెంటుకి పంపే ముందు రాష్ట్రపతి విజ్ఞత పాటించాలి. మత హింస నిరోధక బిల్లు కన్నా ఇంకా ఎక్కువగా పార్లమెంటు చట్ట పరిధిలో లేని అంశాలతో కూడిన, రాష్ట్ర ప్రభుత్వాలని డమ్మీలు గా మారుస్తూ కేంద్ర పెత్తనాన్ని రుద్దటానికి నిర్దేశించిన తెలంగాణా బిల్లు ని రాష్ట్రపతి తిరస్కరించాలి.