Thursday, February 6, 2014

సమాఖ్య స్పూర్తి ఎక్కడ?


సమాఖ్య స్పూర్తికి పూర్తి విరుద్ధంగా ఉందంటూ మత హింస నిరోధక బిల్లుని అడ్డుకోవటంలో విపక్షాలు విజయం సాధించాయి.  ఈ బిల్లు పై జరిగిన చర్చ సందర్భంగా అధికార, విపక్షాలకి చెందిన, ప్రముఖ న్యాయవాదులు కూడా అయిన అరుణ్ జైట్లీ, కపిల్ సిబాల్ ల వ్యాఖ్యలు గమనించతగ్గవి.   ఈ బిల్లు ఆమోదించటం తరువాత, ముందు అసలు బిల్లుని ప్రవేశ పెట్టి చర్చించే అధికారం కూడా పార్లమెంటుకు లేదని అన్ని పార్టీలు ఆక్షేపించాయి. అంతే కాదు,  ఈ బిల్లు పూర్తిగా పార్లమెంటు చట్ట పరిధి వెలుపలి అంశమని, ప్రభుత్వ పాలనా పరిధిలోకి రాదనీ అరుణ్ జైట్లీ  కుండ బద్దలు కొట్టారు.  అయితే, రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతితోనే  శాంతి భద్రతల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని కపిల్ సిబాల్ మభ్యపెట్టాలని చూసినా కూడా సమాఖ్య స్పూర్తిని దెబ్బ తీస్తుందంటూ విపక్షాలన్నీ నిర్ద్వందంగా తిరస్కరించాయి.  తప్పని సరి పరిస్థితుల్లో బిల్లు పక్కన బెట్టినట్లు రాజ్య సభ అధ్యక్షుడు ప్రకటించారు.  

మరి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు సంగతి ఏమిటి?

అడుగడుగునా సమాఖ్య స్పూర్తికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాల అధికారాలని పూర్తిగా కేంద్రం చేతిలోకి తీసుకోవాలన్న దురుద్దేశ్యం తో తయారైన తెలంగాణా బిల్లుకి చట్ట బధ్ధతె ఉండదు.  2009 డిసెంబరు 9 ప్రకటనలో రాష్ట్ర విభజనకై ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో తీర్మానం ద్వారా ప్రక్రియ ప్రారంభిస్తామని స్వయంగా కేంద్ర హొమ్ మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.  కానీ జరిగింది ఏమిటి?  2013 జూలై 30 తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఒకటి వున్నది అన్న స్పృహ అనేదే లేకుండా ఏకపక్షంగా, పూర్తి  నిరంకుశ ధోరణి లో తయారు అయిన తెలంగాణా బిల్లు సమాఖ్య స్పూర్తికి విరుద్ధం కాదా? ఇంక శాంతి భద్రతలు మొదలుకొని వివాదాల పరిష్కారం వరకు ఈ బిల్లులో ఉన్న అన్ని అంశాలు రాష్ట్ర ప్రభుత్వ అధికారాలని కేంద్రం చేతిలోకి తీసుకొనే విధంగా వున్నవే! అసలు ఆర్టికిల్ 3 అనేది రాజ్యాంగంలో ఎందుకు ఉంది?  దేశంలో ఏదైనా రాష్ట్రం విడి పోదలుచుకున్నా  లేదా కొన్ని ప్రాంతాలు విలీనం అవుదామనుకున్నా వాటంతట అవి చేయలేవు కాబట్టి ఆయా రాష్ట్రాల శాసన సభల్లో విస్తృత చర్చల అనంతరం తీర్మానం చేసి కేంద్రానికి పంపితే - అప్పుడు కేంద్రం తనకి ఆర్టికిల్ 3 కింద ఉన్న అధికారంతో ఆయా రాష్ట్రాల అభీష్టాన్ని నెరవేర్చటం సమాఖ్య స్పూర్తి!  ఆర్టికిల్ 3 కింద తయారు అయిన బిల్లు తమ శాసన సభల యొక్క తీర్మానానికి అనుకూలంగా వున్నదా లేదా అని సరి చూసుకోవటానికే   విభజన/విలీనం జరిపే ముందు ఆయా శాసన సభల అభిప్రాయాలకి పంపాలని ఆర్టికిల్ 3 నిర్దేశిస్తోంది.  ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఈ విధంగానే తమ రాష్ట్రాన్ని 4 రాష్ట్రాలుగా విభజించాలంటూ తీర్మానం చేసి పంపింది.  శాసన సభ తీర్మానం జరిగిన ఉత్తర ప్రదేశ్ ని పక్కన పెట్టి ఎటువంటి తీర్మానం పంపని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఉన్న  పళంగా తన చిత్తం వచ్చినట్లు ముక్కలు చేయాలని  తల పోయటం కేంద్ర దురహంకారం! పైగా రాష్ట్ర శాసన సభకి పంపిన బిల్లు లో ఉద్దేశ్యాలు, ఆర్ధిక పత్రాలు వంటి ముఖ్యమైన వివరాలేమీ లేకుండా చిత్తు  కాగితాల వంటి బిల్లు పంపటం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అంతే గాక  విభజనకై  పంపిన బిల్లుని ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ తిరస్కరించినా కూడా కేంద్రం విభజనకి మొండిగా అడుగులు వేయటం ప్రజాస్వామ్య విరుద్ధం. విభజనకి మొగ్గు చూపిన ఉత్తర ప్రదేశ్ విన్నపాన్ని తుంగలో తొక్కి స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రే వ్యతిరేకిస్తున్న అడ్డగోలు విభజన బిల్లు పార్లమెంటుకి పంపే ముందు రాష్ట్రపతి విజ్ఞత పాటించాలి.  మత హింస నిరోధక బిల్లు కన్నా ఇంకా ఎక్కువగా పార్లమెంటు చట్ట పరిధిలో లేని అంశాలతో కూడిన, రాష్ట్ర ప్రభుత్వాలని డమ్మీలు గా మారుస్తూ కేంద్ర పెత్తనాన్ని రుద్దటానికి నిర్దేశించిన తెలంగాణా బిల్లు ని రాష్ట్రపతి తిరస్కరించాలి.     

Wednesday, January 29, 2014

నకిలీ బిల్లు పంపితే నకిలీ రాష్ట్రమే ఇవ్వాలి!

(పక్కన ఉన్న చిత్రం ఆగష్టు,2012 నాటిది)
సీల్డ్ కవర్ ముఖ్యమంత్రిగా వచ్చి అధిష్టానం ముందు చేతులు కట్టుకున్న కిరణ్ కుమార్ రెడ్డి గురించి నేను గతంలో ఒక టపా  వేయటం జరిగింది.  అధిష్టానం ముందు చేతులు కట్టుకున్న అదే కిరణ్ కుమార్ రెడ్డి నేడు ఎందుకు తిరగబడ్డారు? ఎందుకంటే తలుపులు మూసి కొడితే పిల్లి అయినా తిరగబడుతుందని తెలిసిందే ! అసలు తెలంగాణా తేనె తుట్టెని కదిపిన 2009 డిసెంబర్ 9 నాడు కేంద్ర హొమ్ మంత్రి ప్రకటనలో ఏం ఉంది? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకి ప్రక్రియని ఆంద్ర ప్రదేశ్ శాసన సభ తీర్మానం ద్వారా  ప్రారంభింప చేస్తామని  సాక్షాత్తు కేంద్ర హొమ్ మంత్రి ఆనాడు ప్రకటించారు.  అంటే రాష్ట్ర విభజన ప్రక్రియ అన్నది రాష్ట్రం లోనే ప్రారంభం కావాలన్న విషయం కేంద్రానికి తెలుసు.   కానీ ఇప్పుడెం జరిగింది? రాష్ట్రంలో ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వం ఉందన్న స్పృహే లేకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో మెజారిటీ ప్రజల అభిప్రాయానికి విలువ లేకుండా సర్వాధికారాలు కేంద్రం చేతులోకి తీసుకొని - రాజ్యాంగం లోని  ఆర్టికిల్ 3 లో రాసి వుంది కదా అన్న అహంకారంతో కేంద్రం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటానికి పూనుకుంది. లక్ష్యాలు, ఆర్ధిక పత్రం వంటివి ఏమీ లేకుండా తప్పుల తడకలతో కూడిన చిత్తు కాగితాల వంటి బిల్లు (?) ని రాష్ట్ర శాసన సభ మొహాన కొట్టి అభిప్రాయం చెప్పమంది.  అదే ఆర్టికిల్ 3 లో రాసి వుంది కాబట్టి రాష్ట్రానికి పంపారు కానీ లేని పక్షంలో ఈ పాటికి కేంద్రమే రాష్ట్ర ప్రమేయం లేకుండా అడ్డగోలు విభజన పూర్తి చేసి పారేసి ఉండేది! అసలు బిల్లా లేక ముసాయిదా బిల్లా అన్నది స్పష్టత లేకుండా ఏదో ఒకటి రాష్ట్రానికి పంపేసి అభిప్రాయం చెప్పమంటే ఎలా కుదురుతుంది?  ఈ విషయాన్నే ముఖ్యమంత్రి సూటిగా ప్రశ్నించారు.   ముఖ్యమంత్రి ప్రశ్నకి స్పందించాల్సిన కేంద్ర హొమ్  శాఖ ఏమీ మాట్లాడక పోయినా కేంద్ర మంత్రి జై రామ్ రమేష్ మాత్రం బుజాలు తడుముకున్నారు.  ముఖ్య మంత్రి నోటీసు పై అసహనం వెళ్లగక్కారు!  అసలీ జై రామ్ రమేష్ ఎవరు?  ఆయన స్వంత రాష్ట్రమైన కర్ణాటకలో ఠికానా లేకపోతె పాముకి పాలు పోసినట్లు రెండు సార్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్య సభకి పంపితే నేడు కేంద్ర మంత్రి హోదా వెలగబెడుతున్నారు.  పాలు తాగి రొమ్ము గుద్దిన రీతిగా తనను ఎన్నుకున్న రాష్ట్రాన్నే ముక్కలు చేయటానికి అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.  మంత్రుల కూటమిలో ఉండి  తప్పుల తడకల బిల్లు తయారీలో ఆయనదే ముఖ్యమైన పాత్ర!  అందుకే ముఖ్యమంత్రి నోటీసు పై కేంద్ర హొమ్ శాఖ కి బదులుగా ఆయనే  బదులిస్తున్నారు.  నకిలీ నోట్ల లాగా నకిలీ బిల్లులు వుండవు అంటూ జైరామ్ రమేష్  చేసిన ప్రకటన వ్యక్తిగత హోదాలో చేసారా లేదా కేంద్రం తరపున చేసారా అన్న ముఖ్యమంత్రి ప్రశ్నకి కూడా సమాధానం లేదు! పైగా ప్రతి వారు రాజ్యాంగ నిపుణులు అవుతున్నారని దుగ్దని వెలిబుచ్చుతున్నారు.  రాష్ట్రపతి పంపిన బిల్లు అంటూ రోజుకి వంద సార్లు నొక్కి వక్కాణించే వేర్పాటు వాదులు కూడా గమనించాల్సిన విషయం ఒకటే!  అన్ని వివరాలతో కూడిన - పార్లమెంటులో ప్రవేశ పెట్టబోయే  సమగ్రమైన బిల్లునె రాష్ట్ర శాసన సభ అభిప్రాయానికి పంపాలి తప్ప లక్ష్య నిర్వచనం లేకుండా,  శాసనాధికారాల బదలాయింపు వివరాలు లేకుండా, ద్రవ్య వ్యవహారాల మోమోరాండం లేకుండా  కొన్ని చిత్తు కాగితాలు పంపి దానినే బిల్లు అనుకోమంటే  ఎలా కుదురుతుంది?  ఆ చిత్తు కాగితాలని చించి వేసిన, తగల పెట్టిన కొంత మంది శాసన సభ్యుల చర్య సరైనదే!    

Sunday, January 26, 2014

కేంద్ర హొమ్ శాఖ ద్వంద్వ ప్రమాణాలు !

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో ఆర్టికిల్ 371 (D) విషయమై అటార్నీ జనరల్ సలహాని కేంద్రం కోరిన విషయం తెలిసిందే.  ఈ విషయంలో అటార్నీ జనరల్ అభిప్రాయం ఏమిటి అన్నది ప్రజానీకానికి  వెల్లడించకుండా కేంద్రం హడావిడిగా బిల్లు తయారు చేసేసి రాష్ట్ర శాసన సభకి పంపేసింది.  ఇదే విషయంలో సమాచార హక్కు చట్టం కింద కేంద్ర హొమ్ శాఖని 2013 డిసెంబర్ 7 వ తేదిన నేను అడిగిన ప్రశ్నలు  ఇవి:   

1.Whether any report has been submitted by the Attorney General of India to the Group of Ministers (GoM) constituted for bifurcation of Andhra Pradesh regarding dealing with status of Article 371 (D) of Constitution of India for bifurcation of the Andhra Pradesh .. 

2.If submitted, what is the report submitted by the Attorney General in this regard and whether GoM has incorporated the suggestion given by the Attorney General in their report ..

49 రోజుల తరువాత నిన్ననే అందిన, కేంద్ర హొమ్ శాఖ తాపీగా ఇచ్చిన సమాధానం ఇది ! 

I am directed to refer to your RTI appiication No....dated 07.12.2013 (received by the undersigned on 10.12.2013) . 

Point no. 1 & 2 : No information is available with the CPIO. 

If you are not satisfied with the reply, you may make an appeal to the First Appellate Authority viz., Shri S. Suresh Kumar, J.S.(CS), Ministry of Home Affairs, NDCC II Bldg., Jaisingh Road, New Delhi. 


అయితే నిన్ననే శాసన సభలో ముఖ్య మంత్రి ప్రసంగిస్తూ ఇదే సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితె - అది privileged information, ఇవ్వటం కుదరదు అని కేంద్రం బదులిచ్చినట్లు సభా ముఖంగా తెలియజెసారు. అంటే ఏదో ఒక విధమైన సమాచారం వారి వద్ద ఉన్నట్లే కదా ! ఒక సామాన్య పౌరుడిగా నేను అడిగితె ఏ విధమైన సమాచారం లేదని బదులిచ్చిన కేంద్ర హొమ్ శాఖ ముఖ్య మంత్రికి వేరే విధంగా సమాధానం చెప్తోందని తేట తెల్లమై పోతోంది. అసలు రాష్ట్ర విభజనకి ఎటువంటి ప్రాతిపదిక లేదని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో విభజనకి సంబంధించిన సమస్త సమాచారం ప్రజలకి తెలియజెప్పి కేంద్రం ముందుకి సాగాలి. రాష్ట్ర విభజన విషయమై వున్న ఒక న్యాయపరమైన చిక్కుముడి విషయంలో ముఖ్యమంత్రికే సమాచారం ఇవ్వటానికి నిరాకరించటం రాష్ట్రాల అధికారాలని కేంద్రం కబ్జా చేయటమే అవుతుంది. అలాగే సామాన్య పౌరులకి సమాచారాన్ని తెలుసుకొనే హక్కుని నిరాకరించటమే అవుతుంది. 

(ఈ విషయంలో కేంద్ర హొమ్ శాఖ నుండి సమాధానం రాకముందే 30 రోజుల మొదటి గడువు ముగిసాక మొదటి అప్పీలు వేయటం జరిగింది. అప్పీలుకి సమాధానం వచ్చాక బ్లాగులో పొందుపరుస్తాను.)

Wednesday, January 22, 2014

హైదరాబాద్ సిర్ఫ్ హమారా!


"1956 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సమయంలో - విశాఖ పట్నంలో రెండు లారీలు ఎదురెదురుగా రాగలిగిన రోడ్లు లెవు..కర్నూలులో సౌకర్యాలు లెవు.. కాకినాడలో భవనాలు లెవు..విజయవాడ, రాజమండ్రి కూడా అంతే!  అందుకే రాజధానిగా హైదరాబాదుని నిర్ణయించారు."  

శాసన సభలో ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన ముసాయిదా బిల్లు పై చర్చ సందర్భంగా పిల్ల వేర్పాటువాద నాయకుడు వాక్రుచ్చిన పలుకులివి! 

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక హైదరాబాదు సంస్థానాన్ని భారత్ లో  విలీనానికి నిరాకరించి, మన దేశానికి వ్యతిరేకంగా ఐక్య రాజ్య సమితికి వెళ్ళిన ఘన చరిత్ర గలవారు నిజాములు! అటువంటి నిజాములని కేవలం  కొన్ని భవనాలని నిర్మించినందుకే  అభివృద్ది చేశారంటూ  వేర్పాటు వాదులు కీర్తిస్తున్నారు. ఆ భవనాల కోసమే ఆంధ్ర ప్రదేశ్ ని ఏర్పాటు చేసారంటూ చరిత్ర ని వక్రీకరిస్తున్నారు.   అలాగయితే ప్రస్తుతం భారత దేశం పరిపాలన సాగిస్తున్న పార్లమెంటు భవనం, రాష్ట్రపతి భవనం, సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ వంటి ఎన్నో భవనాలు బ్రిటిష్ వాడు కట్టి ఇచ్చాడు.  అందుకని వారిని కీర్తించి వారిని నెత్తిన పెట్టుకుంటామా ?    మొదటి ఎస్ఆర్సి సూచనల మేరకు ఒక భాషాప్రయుక్త రాష్ట్రంగా తెలుగు వారి కోసం  ఆంధ్ర ప్రదేశ్ రాష్టం ఏర్పడింది.  అంతే తప్ప నిజాము అభివృద్ది చేసిన హైదరాబాదు కోసం రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదు.  ఇది చరిత్ర !  ఆ తరువాత ఏం జరిగింది ?  రాష్ట్రంలోని 23 జిల్లాల ప్రజలు తమ రాజధాని అన్న అభిమానంతో 50 సంవత్సరాలకు పైగా అనుబంధం పెంచుకోవటమే గాక తమ ఆర్ధిక వనరులు సమీకరించి, రక్తం చెమట చిందించి, మేధస్సులు రంగరించి సర్వతోముఖంగా హైదరాబాదు నగరాన్ని అభివృద్ది చేసిన విషయం అక్షర సత్యం.   పరిశ్రమలైన, వ్యాపారాలైనా, విద్యా సంస్థలైనా, ఇతరత్రా అన్ని రంగాల్లోనూ ఇన్నేళ్ళలో రాష్ట్రంలో అభివృద్ది అంతా హైదరాబాదు చుట్టూ కేంద్రీకృతమై వున్నది అన్నది వాస్తవం.    అవుటర్ రింగు రోడ్డైనా, అన్ని హంగులతో వున్న అంతర్జాతీయ విమానాశ్రయమైన, ఇంకా మెట్రో రైల్ పదకమైనా ఆంధ్ర ప్రదేశ్ లో మరెక్కడా కాక ఇక్కడే ఎందుకు అమలు పరచారు? ఎందుకంటే ఈ వసతులన్నీ 23 జిల్లాల వారికీ పనికి వస్తాయని,ఉపయోగపడతాయని!  అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువకాలం సీమాంధ్రులే ముఖ్య మంత్రులుగా ఉన్నా, వారి ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురి అయినా,  రాజధాని అభివృద్ది మాత్రం  ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగింది.  రాష్ట్రంనుండి అయ్యే సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో 98 శాతం కేవలం హైదరాబాదు నగరం నుండే జరుగుతున్నాయని శ్రీకృష్ణ కమిటీ నివేదించటం దీనికి తార్కాణం.  ఇంత వరకు కూడా చరిత్రే!  కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది?  భారత దేశంలో ఇంతవరకు ఎప్పుడూ జరగని రీతిలో-  అభివృద్ది చెందిన రాజధానిని కబ్జా చేస్తూ రాష్ట్రంగా విడిపోవటానికి ఉద్యమాలు చేస్తే -  ఆ  వేర్పాటు వాదులతో కుమ్మక్కు అయి, ఆర్టికిల్ 3 ని దుర్వినియోగం చేస్తూ కేంద్రం రాష్ట్ర విభజనకి హడావిడిగా పరుగులు పెట్టటం జరుగుతోంది.   హైదరాబాదు నగరానికి సరైన ప్రత్యామ్నాయం చూపకుండా, కనీసం అవశిష్ట రాష్ట్రానికి  రాజధాని ఎక్కడ అన్నది కూడా నిర్ణయించకుండా - సీమాంధ్ర ప్రయోజనాలని పూర్తిగా విస్మరిస్తూ కేంద్రం వ్యవహరిస్తోంది.  కెవలం  భౌగోళికంగా తెలంగాణా ప్రాంతంలో ఉన్నంత మాత్రాన  ఉమ్మడిగా అభివృద్ది చెందిన  హైదరాబాదుని తెలంగాణాకి కట్టబెడతామంటే సీమాంధ్ర సహించదు.  హైదరాబాద్ సిర్ఫ్ హమారా!  హైదరాబాద్ మీది, మాది, మనందరిది.. మన తెలుగు వారందరిది..  

Wednesday, January 1, 2014

ఎందుకంత కాకి గోల ?

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే దేశంలో ఉన్న అనేక సంస్థానాలని భారత యూనియన్ లో కలిపే క్రమంలో,  మన దేశంలో కలవటానికి మొరాయిస్తున్న సంస్థానాలని దారికి తేవటానికి రాజ్యాంగంలో ఆర్టికిల్ 3 అన్నది ప్రవేశ పెట్టబడింది.   బలమైన ఆ అధికరణ ఆనాడు ఉండబట్టే సంస్థానాల విలీనం అన్న ప్రక్రియ సజావుగా జరిగింది. అయితే ఇప్పుడు మన రాజ్యాంగంలో ఆర్టికిల్ 3 ఎందుకు చేర్చారో, ఆ అధికరణ ఏ పరిస్థితిలో చేర్చవలసి వచ్చిందో అన్న చారిత్రిక ప్రాతిపదిక తో నిమిత్తం లేకుండా,  రాజ్యాంగంలో రాసి వుంది కదా అన్న ధీమాతో -  రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న  ప్రభుత్వమే అన్నది లేనట్లుగా కేంద్రమే సర్వాదికారాలని చేతిలోకి తీసుకొని తమ ఇష్టానుసారం విభజన ప్రతిపాదిస్తే రాష్ట్రం/రాష్ట్ర ప్రజలు ఆమోదించాలా ? పైగా శాసన సభ ఆమోదించినా లేక పోయినా కూడా తాము అనుకున్నట్లు విభజించి తీరుతాం అని కేంద్రం మొండికేస్తే ఇక ఫెడరల్ స్ఫూర్తి ఎక్కడ ఉన్నట్లు?  ఒక ప్రాంతంలో విభజన లేదా విలీనం వంటి చర్యలు తీసుకోవాలంటే ఆ ప్రాంతం/రాష్ట్ర శాసన సభ నుండి ప్రతిపాదన వస్తే అప్పుడు కేంద్రం ఆర్టికిల్ 3 కింద తనకి వున్న అధికారంతో విభజన/విలీనం ప్రక్రియని మొదలు పెట్టాలి. అంతే కాదు,  అటువంటి ప్రక్రియ మొదలు పెట్టే ముందు  ఆయా ప్రాంతాల సంపూర్ణ అంగీకారం ఉందా లేదా అన్న విషయం ద్రువీకరించుకొనే కేంద్రం అడుగు ముందుకు వెయ్యాలి.  కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలన్నీ ఆ పద్ధతిలోనే  ఏర్పడ్డాయి.  అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా  - రాష్ట్ర శాసన సభ ప్రమేయమే లేకుండా కేంద్ర నిరంకుశ నిర్ణయాన్ని రుద్దే రీతిన కొనసాగుతోంది.  విచిత్రం ఏమిటంటే విభజన వాదులకి ఈ తతంగం అంతా అప్రజాస్వామికం అని అస్సలు అనిపించదు. కానీ తన మంత్రివర్గంలోని మంత్రుల శాఖలను పునర్వ్యవస్థీకరించె అధికారం ముఖ్యమంత్రికి ఉన్నా కూడా, శ్రీధర్ బాబు శాఖను మార్చటం ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసేసినట్లు తెలంగాణా నాయకులు నానా యాగీ చేయటం  అర్ధ రహితం. ముఖ్య మంత్రి అధిష్టానాన్ని దిక్కరించటం అన్నది  వేర్పాటు వాదుల దృష్టిలో ఎంత పెద్ద నేరమో - ముఖ్యమంత్రి అభీష్టానికి విరుద్ధంగా శ్రీధర్ బాబు వ్యవహరించటం కూడా అంతే  పెద్ద నేరం! ముఖ్య మంత్రి గారు సరైన సమయంలో సరైన నిర్ణయమే తీసుకున్నారు! 

Friday, December 27, 2013

ఆంక్షలు లేక పొతే అంతే సంగతులు !

దేశంలోని మిగతా 28 రాష్ట్రాల మాదిరి తెలంగాణా  కూడా అంక్షలు లేని విధంగా ఏర్పరచాలని డిమాండ్ చేస్తున్న తెలబాన్ నాయకునికి దేశంలో మిగతా రాష్ట్రాలు ఏకాభిప్రాయం తో ఏర్పడ్డాయని,  సంప్రదాయానుసారం  విభజనకి పూర్వపు శాసన సభ తీర్మానం ద్వారానే ఆయా కొత్త రాష్ట్రాల ఏర్పాటుకి నాంది జరిగిందని తెలియదా? కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలే కొత్త రాజదానులని ఏర్పాటు చేసుకున్నాయి కానీ ఉమ్మడిగా అభివృద్ది చెందిన రాజధానిని కైంకర్యం చేస్తూ అవశిష్ట ప్రాంతానికి మొండి చెయ్యి చూపించే విధంగా ఇంతకూ ముందు ఏ రాష్ట్రమైనా ఏర్పడిందా?   కానీ తెలంగాణా విషయంలో ఏం జరుగుతోంది ?  2009 డిసెంబర్ 9 ప్రకటనలో కేంద్ర హొమ్ మంత్రి తెలంగాణా ఏర్పాటుకై ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించగా, ఈనాడు   విభజన వాదులు కేంద్రంతో కుమ్మక్కు అయిన ఫలితంగా మొదటి ప్రక్రియనుండే  తొండి ఆట మొదలు పెట్టారు.    ఒక రాష్ట్ర  విభజన వంటి ప్రాముఖ్యమైన విషయం కేంద్ర కేబినెట్ సమావేశం ఎజెండా లో వుండదు..నోట్ తయారు అవుతున్న విషయం సాక్షాత్తు కేంద్ర హొమ్ మంత్రికి మధ్యాహ్నానికి తెలియదు...  కానీ సాయంత్రానికల్లా  టేబుల్ పాయింటు గా ప్రత్యక్షమై ఆమోదమై పోతుంది!   అలాగే మంత్రుల కూటమి! ఒక తెలుగు రాష్ట్రాన్ని విభజించే ప్రక్రియలో ఒక్క తెలుగు మంత్రి కూడా ఉండడు.. మంత్రుల కూటమి కూడా హస్తిన వదలి రాదు.. కానీ చిత్తం వచ్చినట్లు నివేదిక తయారు చేయటంలో మాత్రం వారు సిద్ధ హస్తులు.  రెండు నెలలు కూర్చుని వారు వండి వార్చిన నివేదిక తో బిల్లు సిద్ధమయ్యాక కూడా మళ్ళీ అదే తంతు!  టేబుల్ పాయింటు గా కేబినేట్ సమావేశం లో బిల్లు ప్రవేశ పెట్టి -  సీమాంధ్ర మంత్రులు బిల్లు పరిశీలించటానికి సమయం అడిగినా నిరాకరించి బలవంతపు ఆమోదం జరిగిన సంగతి తెలిసిందే!  ఇక రాష్ట్రపతి నుండి తిరిగి వచ్చిన బిల్లుని  ప్రత్యెక దూత ద్వారా ప్రత్యెక యుద్ధ విమానంలో హైదరాబాదు కి పంపటం కొస మెరుపు!  ఈ అవకరాలన్నీ ఒక ఎత్తు ఐతే, తెలబాన్ల అరాచకాలు మరో ఎత్తు! ప్రత్యెక రాష్ట్ర ప్రస్తావనే లేని రోజుల్లోనే వారు చేసిన అరాచకాలకి లెక్కే లెదు.  
 సమైక్య రాష్ట్రంలో తెలంగాణా రాష్ట్రం పేరిట ఫలకాలు ఏర్పాటు చేయటం, వాహనాలకి టీజీ స్టిక్కర్లు అంటించటం, జాగో భాగో అనటం, తరిమి కోడతామనటం, పండక్కి వెళ్ళిన సీమాంధ్రులని తిరిగి రానివ్వమనటం, ఆస్తులు లాక్కుంటామనటం, సీమాంధ్రుల భూములు పంచేస్తామనటం ఇలా ఒకటా రెండా... అంతు లేని కధ ఆ అరాచకం!  అదంతా గతం!  ఇప్పుడు కేంద్రం ప్రత్యెక రాష్ట్రానికి సై  అనగానే తెలబాన్ నాయకుడు జూలు విదిల్చాడు.
 సాక్షాత్తు ముఖ్య మంత్రినే టిఫిన్ సెంటర్ పెట్టుకోమన్నాడు. తమకి కప్పం కడుతూ బతకమన్నాడు..ఉద్యోగులకి ఆప్షన్లు లేవన్నాడు..సీమాంధ్రకి వెళ్లి పోవాల్సిందే అన్నాడు.. నాయకుడు అలా వుంటే అనుచర గణం  ఇంకెలా వుంటుంది? 

 డిసెంబర్ 31తరువాత సీమాంధ్రులని వెళ్ళ గోట్టాలంటూ రబ్బరు స్టాంపులు వేసి మరీ ప్రచారం చేస్తున్నారు!  ఇన్ని అవకారాలు, అరాచకాలు ఉన్న పరిస్థితిలో - దొంగ చేతికే తాళం ఇచ్చినట్లు - సీమాంధ్రకి, సీమాంధ్ర ప్రజలకి తగిన ప్రత్యామ్నాయాలు, రక్షణలు  చూపకుండా - హడావిడిగా రాష్ట్ర విభజన సాధ్యమా?  ఎట్టి పరిస్థితిలో కానే కాదు!!      

Monday, December 23, 2013

తిక్క కుదిరింది !


బ్రాహ్మణులని అపహాస్యం చేస్తూ మోహన్ బాబు తీసిన "దేనికైనా రెడీ" చిత్రం  గురించి గతంలో నేను వేసిన టపా ఇక్కడ  చదవండి.  హద్దు పద్దు లేని అహంకారంతో బ్రాహ్మణులని అపహాస్యం చేస్తూ చిత్రం  నిర్మించిన మోహన్ బాబు తన పాపానికి ప్రాయశ్చిత్తం ఇప్పుడే అనుభవించబొతున్నాడు.  భారత ప్రభుత్వం కట్ట బెట్టిన పద్మశ్రీ పురస్కారాన్ని వారం రోజుల్లోగా వెనక్కి ఇచ్చేయాలని న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మోహన్ బాబు వంటి అహంకారులకి చెంపపెట్టు వంటిది.  దుష్టజన సాంగత్యం చెరుపే చేస్తుందన్న రీతిగా మోహన్ బాబుతో కలిసి నటించిన పాపానికి  బ్రహ్మానందం కూడా తన పద్మశ్రీ  పురస్కారాన్ని కోల్పోవలసి రావటం ఆయన దురదృష్టమే !   

Tuesday, December 17, 2013

అంతా రాజ్యాంగ బద్దంగా జరిగితే - అంత తొందర ఎందుకు ?

కాబినెట్ నోట్ ప్రవేశ పెట్టిన దగ్గరనుంచి తెలంగాణా  బిల్లు ని కాబినెట్ ఆమోదించే సమయం దాకా  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన వ్యవహారంలో కేంద్రం తొండి ఆటే ఆడింది.  ఒక రాష్ట్ర విభజన వంటి ప్రాముఖ్యత గల విషయాన్ని టేబుల్ పాయింటుగా ప్రవేశ పెట్టి కాబినెట్ నోట్ ని హడావిడిగా ఆమోదం తెలపటంతోనే  కుట్ర పూరిత వ్యవహారం బహిర్గతమయ్యింది.  ఆ తరువాత బిల్లుని కాబినెట్ ఆమోదించే సమయంలో కూడా అంతే !    ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఒక్కరుకూడా లేని  మంత్రుల కూటమి రెండు నెలల సమయం వెచ్చించి తయారు చేసిన  బిల్లు పరిశీలించటానికి రెండు రోజుల సమయమైనా ఇవ్వమని సీమాంధ్రకి చెందిన కేంద్ర మంత్రి అభ్యర్ధించినా,  తిరస్కరించి   బలవంతపు ఆమోదం జరిపారు.  ఇక ఇప్పుడు రాష్ట్ర శాసన సభ వంతు ! హస్తినలో కూచుని తయారు చేసిన బిల్లు రాష్ట్ర భవిష్యత్తు పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న విషయం చర్చించటానికి రాష్ట్రపతి విజ్ఞతతో 6 వారాల సమయం ఇస్తే దానికీ అభ్యంతరమే! ప్రజా ప్రతినిదులనుండి తెలంగాణా మేధావుల వరకు అందరూ త్వర త్వరగా కేంద్రానికి తిప్పి  పంపమనే వారే!  2000 సంవత్సరంలో పూర్తి  ఏకాభిప్రాయంతో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయా  శాసన సభలకి కనీసం 40 రోజుల గడువుని ఇచ్చారు. ఇప్పుడు కేవలం ఒక్క ప్రాంత ప్రయోజనాలకి కొమ్ము కాస్తూ పక్షపాత ధోరణి తో ప్రతిపాదించిన విభజన బిల్లు చర్చించటానికి 6 వారాల సమయం ఎంత మాత్రం చాలదు.     అంతే  కాదు.. గతంలో నిండు శాసన సభలో గవర్నర్
ప్రసంగ పాఠాలని చించి ఆయన మొహానే విసిరి కొట్టిన వారు నేడు రాష్ట్రపతి పంపిన బిల్లు పవిత్రమైనదంటూ చిలక పలుకులు పలుకుతున్నారు.   రాష్ట్ర శాసన సభ అభిప్రాయంతో పనే లేకుండా పార్లమెంటులో బిల్లు పెట్టేస్తామని బీరాలు పలికిన వారు ఈ రోజు శాసన సభలో విస్తృత  చర్చకి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు?   సీమాంధ్రుల అభిప్రాయాలకి ఏ మాత్రం విలువనివ్వకుండా వారికి సమస్యలు చెప్పుకొనే అవకాశమే ఇవ్వకుండా నిరంకుశంగా తయారు చేసిన బిల్లు ని చీల్చి చెండాడే అవకాశం ఒక్క శాసన సభలోనే ఉంది. ఇప్పటికే తమ అధిష్టానానికి లోబడి సీమాంధ్ర ప్రజలని  వంచించిన ప్రజా ప్రతినిధులు ప్రస్తుత బిల్లులో   సీమాంధ్రుల ప్రయోజనాలకి భంగం వాటిల్లే ప్రతి క్లాజుకి తగిన సవరణలు ప్రతిపాదించకుండా బిల్లుని యధాతధంగా కేంద్రానికి తిప్పి పంపితే వారు ప్రజా ద్రోహులే కాదు జాతి ద్రోహులు కూడా అవుతారు... 

Monday, December 9, 2013

రాష్ట్ర విభజన తో కాంగ్రెస్ చేస్తున్నది జాతి ద్రోహమే కాదు, దేశ ద్రోహం !

తెలుగు జాతికి ఈ రోజు విద్రోహ దినం!  పచ్చగా వున్న తెలుగు వారిని కేవలం తన రాజకీయ అవసరాల కోసం ముక్కలుగా చేయ తలపెట్టిన కాంగ్రెస్ అధినేత్రి జన్మదినం మన తెలుగు జాతికి దుర్దినం.. కేంద్రంలో రెండు సార్లు అధికారం చేపట్టటానికి అవసరమైన ప్రాతినిధ్యమిచ్చి గౌరవించిన తెలుగు వారి నెత్తినే భస్మాసుర హస్తం పెట్టిన కాంగ్రెస్  కి చివరి రోజులు దాపురించాయని తాజాగా జరిగిన  ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.  అసలు  రాష్ట్ర విభజన వంటి ప్రాముఖ్యత గల విషయాన్ని అధికారం కొద్ది రోజుల్లో ముగిసి పోతుందనగా చేపట్టటమే సరి ఐన పధ్ధతి కాదు.   అందునా ఆంధ్ర ప్రదేశ్ ని  విభజిస్తే దాని దుష్పరిణామాలు   కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే  గాక దేశం మొత్తం ఉంటాయని ప్రభుత్వమే నియమించిన శ్రీ కృష్ణ కమిటీ,  ఐబీ వంటి సంస్థలు కూడా హెచ్చరించిన నేపధ్యంలో తాను పట్టిన కుందెటికి మూడే కాళ్ళన్న రీతిగా మొండిగా కాంగ్రెస్ పార్టీ ముందుకి సాగటం అర్ధ రహితం.  ఆర్టికిల్ 3 ని దుర్వినియోగం చేస్తూ - రాష్ట్ర శాసన సభ అభిప్రాయానికి స్థానం లేకుండా విభజన ప్రక్రియని కొన సాగించటం తెలుగు  జాతికి చేస్తున్న ద్రోహం అయితే -  జిహాదీ తీవ్ర వాదం, నక్సల్ తీవ్ర వాదం పెచ్చరిల్లుతాయని  ప్రభుత్వ సంస్థలే హెచ్చరించినా కూడా దేశ సమగ్రతని పణంగా పెట్టి మరీ ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించాలని మొండికేయటం ఖచ్చితంగా దేశ ద్రోహమే !  కేవలం ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాలే తప్ప మరే విధమైన ప్రయోజనాలు ఒనకూడని విభజన బిల్లుని రాష్ట్రపతి తన వివేచన ఉపయోగించి  తిప్పి పంపాలి.  అంతే
కాదు, దేశంలో ప్రస్తుతం నిద్రాణంగా వున్న గోర్ఖలాండ్, బోడోలాండ్, విదర్భ వంటి వేర్పాటు ఉద్యమాలు కూడా పునరుజ్జీవితమై అనేక సమస్యలకి మూల కారణం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది.   కొత్త రాష్ట్రాల ఏర్పాటు వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ పై పెను భారం పడటమే గాక శాంతి భద్రతలకి కూడా భంగం వాటిల్లనున్న పరిస్థితుల్లో కేంద్రం ఏక పక్షంగా, నిరంకుశంగా ప్రతిపాదిస్తున్నఆంధ్ర ప్రదేశ్  విభజన బిల్లుని తిరస్కరించటం ప్రధమ పౌరునిగా రాష్ట్రపతి కర్తవ్యం. 

Monday, December 2, 2013

సర్వ అనర్ధాలకు కారణభూతమయ్యే విభజన మనకొద్దు !




శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన రహస్య నోట్ గురించి వార్తా పత్రికల్లో వచ్చిన కధనాలు గమనిస్తే రాష్ట్ర విభజన అన్నది ఎంత అనర్ధ దాయకమో తేట తెల్లమై పోతుంది.  తెలంగాణా అన్నది విఫల రాష్ట్రంగా మిగిలి పోతుందని విష్పష్టంగా కమిటీ ప్రకటించింది.  అంతే కాదు.. ప్రస్తుతానికి అదుపులో ఉన్న నక్సల్ సమస్య - అలాగే మనం మరచి పోయిన మత  కలహాలు వంటి విపత్తులు కూడా సంభవించే అవకాశం  వుందని తేల్చింది.  దేశానికే ప్రమాదకరమైన జిహాదీ తీవ్ర వాదం కూడా పెచ్చరిల్లే అవకాశం వుందని తేల్చి చెప్పింది.  ఇది 2010 నాడు శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన వివరణ !  ఇప్పుడు తాజాగా ఐబీ అధిపతి ఇబ్రహీం కూడా ప్రత్యెక రాష్ట్రం ఇస్తే అది కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే గాక దేశ  వ్యాప్తంగా భద్రతా సంస్థలకి కొత్త సవాళ్లు ఎదురౌతాయని కేంద్ర హొమ్ మంత్రితో అధికారిక సమావేశం లో ప్రకటించారు. ఇంక ఈ మధ్యనే కేంద్ర హొమ్ శాఖ తరపున రాష్ట్రానికి వచ్చిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఏ నివేదిక సమర్పించిందో బహిర్గత పరచక పోయినా దాదాపు ఇటువంటి పరిణామాలనే సూచించినట్లు వార్తా కధనాలు తెలియజెప్తున్నాయి.     స్వయంగా ప్రభుత్వమే నియమించిన శ్రీ కృష్ణ  కమిటీ - అలాగే సాక్షాత్తు ప్రభుత్వ సంస్థ అయిన ఐబీ వంటి సంస్థలు  విభజన వలన  ఏర్పడే దుష్పరిణామాలని  ఏకరువు పెట్టినా కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం రాజకీయ సమీకరణాలని దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన కోసం మొండి గా ముందుకి సాగటం మూర్ఖత్వం. ఓ పక్క ఉత్తర ప్రదేశ్ శాసన సభ తన రాష్ట్రాన్ని 4 ముక్కలుగా విభజించమని కేంద్రానికి తీర్మానం పంపినా దాన్ని పక్కన పెట్టి - మన  రాష్ట్రంలో  70 శాతం మంది ప్రజలు విభజనకి వ్యతిరేకం అయినా కూడా, మన  రాష్ట్ర శాసన సభ అంగీకారంతో ప్రమేయం లేదు అన్న రీతిగా నిరంకుశంగా సాగుతున్న విభజన ప్రక్రియ  రాజ్యాంగం లోని ఆర్టికిల్ 3 దుర్వినియోగం చెయ్యటమే అవుతుంది.  అంతే గాక విభజన వల్ల రాష్ట్రం లోపల - బయట కూడా భద్రతా పరమైన సవాళ్లు ఎదురు అవుతాయని సమాచారమున్నా కూడా కేంద్రం వెనుకడుగు వేయక పోవటం దేశ సమగ్రత పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్త శుద్ది నే శంకించే పరిస్థితి తెస్తోంది.  కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర / దేశ సమగ్రతలని పణం గా పెట్టి కాంగ్రెస్ తీసుకు రానున్న విభజన బిల్లు ని ప్రతిపక్షాలన్నీ తిప్పి కొట్టాలి.  అలాగే రాష్ట్రపతి కూడా తన వివేచన ఉపయోగించి సర్వారిష్ట కారకమైన విభజన బిల్లు అనుమతించకుండా  విజ్ఞత చూపించాలి.   కాని పక్షంలో మన రాష్ట్రాన్ని, దేశాన్ని ఆ భగవంతుడే కాపాడాలి....