నూతన సంవత్సరం మొదటి రోజున తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుందామని భక్త జనులందరూ తహ తహ లాడటం సహజమే.. అయితే ప్రతి సంవత్సరం వీఐపీ ల సేవతో తరిస్తూ సామాన్య భక్తులకి నరకం చూపించటమే ఆనవాయితీ గా పెట్టుకున్న టీ టీ డీ పాలక వర్గం ఈ నూతన సంవత్సర ప్రారంభాన కొద్దిగా ఆ పద్ధతిని మార్చటం హర్షణీయం. వీఐపీ పాసులు ఉన్న వారికి కూడా లఘు దర్శనం అమలు చేసి, వీఐపీ దర్శన ప్రహసనాన్ని గంటలోనే ముగించి, ఆ సమయాన్ని క్యూ లైన్ల లో ఉన్న భక్తులకి కేటాయించటం అభినందనీయం. అసలు భగవంతుని ముందు అందరూ సమానులే అన్న ప్రాధమిక సూత్రం విస్మరించి కొంత మందిని వీఐపీ లంటూ వర్గీకరణ చేయటమే అర్ధ రహితం. ఇంక నూతన సంవత్సరాది వంటి ముఖ్యమైన రోజుల్లో కూడా తమ ప్రాపకం వుపయోగించి, పాసు సంపాదించి, వేలాది ఇతర భక్తుల్ని ఇబ్బంది పెట్టి భగవంతుణ్ణి ముందుగా దర్శిస్తే వచ్చే పుణ్య మేమిటో ఆయా వీ ఐ పీ లకే తెలియాలి...పైగా వీఐపీ పాసు ఉన్న తమకి లఘు దర్శనం చేయించారని ఎంపీ రాయపాటి హుంకరించటం మూర్ఖత్వం. ఇటువంటి వారు కొద్ది రోజుల క్రితమే తిరుమల సందర్శించి వెళ్ళిన రిజర్వ్ బ్యాంకు గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారిని ఆదర్శంగా తీసుకోవాలి. అసలు తాను వస్తున్నట్లు సమాచారమే ఇవ్వకుండా నడక దారిలో కొండనెక్కిన దువ్వూరి ని ఆలయం వద్ద గుర్తు పట్టి, టీ టీ డీ యాజమాన్యం ప్రోటోకాల్ ప్రకారం ఆలయ మర్యాదలు చేయ బోయినా సున్నితంగా తిరస్కరించారాయన! ఆయన సంస్కారం ముందు రాయపాటి అధికారం ఏ పాటిది? ఒక మంచి కార్యానికి శ్రీకారం చుట్టిన టీటీడీ భవిష్యత్తులో కూడా రాజకీయుల, వీఐపీ ల తాకిడినుంచి భక్తులని, భగవంతుడినీ కూడా కాపాడే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
బాగా చెప్పారు. "God and death are big levelers" అన్నది ఎప్పటికి నిజమౌతుందో మరి?
ReplyDeleteఎంత కాలానికి ఓ మంచి చైర్మన్ ను, ఈఓను రప్పించుకోగలిగాడా ఆ శ్రీనివాసుడు అనుకుంటున్నా నేనయితే... ఆ బ్రహ్మోత్సవాల సమయంలో అయితే ఇద్దరూ అంతా తామై నడిపించిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. ఊరేగింపుల్లో వాళ్ళ ఆనంద నృత్యం చూస్తుంటే.. ఇలాంటి వారే స్వామి ఆలయాన్ని నడిపిస్తే బాగుంటుంది అనిపించింది
ReplyDelete