Friday, October 18, 2013

రాజీ డ్రామాలు ఇక ఆపండి !


యూపీఏ  లొసుగు బైట పడింది.  సీమాంధ్రకి  చెందిన 13 మంది పార్లమెంటు సభ్యుల రాజీనామాలని రెండు నెలలుగా నాన్చి  చివరికి వాటిని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ కార్యాలయం తెలియజేసింది. తిరస్కరణ కి కారణం ఏమైనా కానీ ఎంపీ ల సంఖ్య పైనే ప్రభుత్వ మనుగడ ఆధార పడి  వుందని ఖాయమై పోయింది. తమని ఎన్నుకొన్న ప్రజల పట్ల నిజమైన నిబద్ధత కలిగి వుంటే -  ఇప్పుడు వత్తిడి తెచ్చినట్లే రెండు నెలల క్రితమే సీమాంధ్ర ఎంపీ లు చేసి వుంటే  - రాష్ట్ర విభజన విషయం కాబినెట్ నోట్ వరకు వెళ్లేదే కాదు.  ఇప్పటికైనా మన ఘనమైన పార్లమెంటు సభ్యులకి జ్ఞానోదయం అయ్యిందా అంటే అదీ లెదు... అధిష్టానం తమని మోసం చేసింది .. అధిష్టానం తమకు గౌరవం అసలు ఇవ్వట్లెదు.. తమను అసలు సంప్రదించటమే లెదు.. రాజీనామాల ఆమోదానికి కోర్టుకి వెళతాం అంటూ కాల యాపన చేసే ప్రసంగాలే చెస్తున్నారు.  ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చే దాకా కాబినెట్ నోట్ పెట్టము అని హామీ ఇచ్చిన అధిష్టానం - మాట తప్పి దొంగ దారిలో నోట్ పెట్టిన నాడే నిలదీయాల్సిన వారు - నేటికి కూడా ఆ పని చెయ్యట్లెదు.  అంతే  గాక రాష్ట్ర విభజన పై వెనక్కి తగ్గేదే లేదని రోజుకో చోటా మోటా నాయకుడు  టీవీ ల ముందు చెలరేగి పోతున్నా రోషం రాని  వారు మన సీమాంధ్ర  పార్లమెంటు సభ్యులు !  తమని  గౌరవించని -  తమ అభిప్రాయాలకి విలువ ఇవ్వని - తమ లెక్కే లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్న పార్టీలో ఇంకా వారు కొనసాగటమెందుకో అర్ధం కాదు.   సీమాంధ్రకి చెందిన 20 మంది పార్లమెంటు సభ్యులు రాష్ట్రపతి వద్దకి వెళ్లి - తమ ప్రాంత ప్రయోజనాలకి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వం పై తమకి విశ్వాసం లేదని ఒక్క లేఖ ఇచ్చి వుంటే -- విభజన కై రాజ్యాంగ ప్రక్రియ ముందుకు సాగించే ధైర్యం కేంద్రం చేస్తుందా ?  ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.     టక్కు టమార విద్యలు ప్రదర్శించి ప్రజలని ఏమార్చుదామనుకున్న  వారికి 2014 ఎన్నికల్లో తగిన గుణ పాఠం చెప్పి తీరుతారు. 

Thursday, October 17, 2013

శభాష్ ఎన్జీఓస్ !

విరమణ కాదు విరామమే అంటూ సమ్మెకి స్వస్తి పలికారు ఏపీ ఎన్జీఓ లు ! తండ్రిలా చూడాల్సిన కేంద్రం ధృతరాష్ట్రుడు  కౌరవ పక్షపాతం వహించినట్లు సీమాంధ్ర నెత్తిన విభజన కత్తి పెట్టినప్పుడు -  తమ ప్రాంతపు ప్రజల ప్రయోజనాలు దారుణంగా దెబ్బ తినే పరిస్థితి వచ్చినప్పుడు -  సీమాంద్ర రాజకీయ నాయకులు ఏమి చేసారు ?  పాలు తాగి రొమ్ము గుద్దిన రీతిగా తమని అధికారానికి పంపిన ప్రజలనే వంచించి పదవీ లాలసతో అధిష్టానానికి వంత పాడారు. తమని ఎన్నుకొన్న ప్రజల కన్నా కొత్తగా రాష్ట్రం వస్తే వచ్చే పదవులు, కాంట్రాక్టులే మిన్న అని భావిస్తూ ప్రజల అభీష్టానికి తూట్లు పొడుస్తూ నమ్మక ద్రోహం చేసిన రాజకీయ నాయకులు సీమాంధ్రకి రిక్త హస్తం అందించిన పరిస్థితుల్లో ఉవ్వెత్తున ఎగసి పడింది సమైక్యాంధ్ర ఉద్యమం.. ఆ ఉద్యమ నావకి చుక్కానిలా నిలిచి ముందుకు సాగించింది ఎన్జీఓ లే అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.. ఆర్టికిల్ 371 (డి) ద్వారా కాపాడబడుచున్న ఉద్యోగుల ప్రయోజనాలకి విభజన ద్వారా విఘాతం కలుగుతుంటే కడుపు మండిన ఉద్యోగులు సమ్మెకి దిగారు...కానీ ఆరు నెలల్లో ముగిసి పోయే పదవిని, అధికార లాంచనాలని వదులుకోవటానికి రాజకీయ నాయకులు మాత్రం  సిద్ధ పడలేదు. వంచనకి గురి అయిన సీమాంధ్ర కి రాజకీయ పరంగా ఎటువంటి తోడ్పాటు అందని పరిస్థితుల్లో ఉద్యమ బాధ్యతని నెత్తిన వేసుకొని  రెండు నెలల పాటు తమ తమ కుటుంబాలని గాలికి వదలి, ఆర్ధికంగా కూడా నానా బాధలు పడుతూ,  అత్యంత నిబద్ధత తో రాష్ట్ర సమైక్యం కోసం ఉద్యోగులు సాగించిన సమరం సాటి లేనిది..   అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా సెప్టెంబర్ 7 వ తేదీన హైదరాబాదు లో వారు శాంతియుతంగా నిర్వహించిన సమైక్య సభ దేశ వ్యాప్త మన్ననలని  అందుకుంది.  వేర్పాటు వాదులు రక్తమోడేలా దాడులు చేసినా సంయమనం కోల్పోకుండా రాజధానిలో సమైక్య వాణి వినిపించే దమ్ము చూపారు.  సీమాంధ్రకి అన్యాయం జరుగుతోంది. అందులో ఎంత మాత్రం సందేహం లేదు. అయితే ఆ అన్యాయాన్ని ఎదుర్కొనే బాధ్యత కేవలం ఎన్జీఓ లే మోయటమన్నది సమంజసం కానే కాదు.. సమాజం లోని అన్ని వర్గాలు ముందుకి వచ్చి రాష్ట్ర సమైక్యాన్ని కాపాడుకోవలసిన అగత్యం ఇప్పుడు వుంది.  కేవలం కాబినెట్ నోట్ అయినంత మాత్రాన రాష్ట్రం విడిపోయినట్లు కానే కాదు.  ఇంకా జరగ వలసిన రాజ్యాంగ ప్రక్రియ చాలా చాలా వుంది. రాష్ట్రం విడి పోయినట్లే అంటూ రాజకీయ నాయకులు ఆడుతున్న మైండ్ గేమ్ ఉచ్చులో ప్రజలు   పడరాదు. అవసరమైతే మెరుపు సమ్మెకి దిగటానికి ఉద్యోగులు ఎలాగూ సిద్ధంగా వున్నారు. అంతిమ ఫలితం ఎలా వున్నా ఇప్పటి వరకు ఉద్యోగులు చూపిన మార్గ దర్శనానికి సీమాంధ్ర వారికి ఎప్పటికీ ఋణ పడి వుంటుంది.. వుద్యోగులారా అందుకోండి తెలుగు జాతి తరపున  శుభాభినందనలు..విజయోస్తు..

Wednesday, October 16, 2013

సమైక్యత నుంచి సమ న్యాయం - సమ న్యాయం నుంచి అన్యాయం !


కీలకమైన సమయంలో అచేతనంగా ఉండి పోతూ రాష్ట్ర విభజనకి పరోక్షంగా సహకరిస్తున్న సీమాంధ్ర మంత్రుల, ఎంపీ ల ప్రవర్తన నానాటికీ క్షంతవ్యం కాని రీతిన సాగుతోంది.  తమని ఎన్నుకొన్న ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ కూడా సమైక్యానికి కట్టుబడి ఉన్నామంటూ నమ్మ బలకాలని చూడటం విచిత్రం. మైనారిటీ లో ఉన్న ప్రభుత్వం లో సీమాంధ్ర ఎంపీ లు అందరూ మూకుమ్మడిగా రాష్ట్రపతిని కలిస్తే తెలంగాణా నోట్ వచ్చేదా ?  సీమాంధ్ర కి అన్యాయం జరుపుతూ విభజన ప్రతిపాదన చేసిన వెంటనే అధిష్టానాన్ని స్వచ్చందంగా నిల దీయాల్సింది పోయి 77 రోజులు గా ప్రజలు,ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రతిస్పందించక పోవటం తమని ఎన్నుకున్న వారికి ద్రోహం చెయ్యటమే ! అంటోనీ కమిటీ అంటూ మభ్య పెట్టి తమ సమస్యలు వినకుండానే కాబినెట్ ముందుకి తెలంగాణా నోట్ పెట్టినప్పుడైనా స్పందించారా అంటే అదీ లేదు... ఉవ్వెత్తున ఎగసిన ప్రజాగ్రహానికి జడిసి హస్తినలోను, హైదరాబాదులోనూ దాక్కున్నారే తప్ప అధిష్టానాన్ని నిలదీసిన పాపానికి పోలేదు. ఒక రాష్ట్ర విభజన వంటి ప్రాముఖ్యం గలిగిన అంశం అజెండాలో లేకుండా కేవలం టేబుల్ పాయింట్ గా పెట్టి తొండి చేసిన విధంగా కాబినెట్ ఆమోదించినప్పుడు ప్రజలు ఆగ్రహంతో స్పందించారు కానీ ఘనమైన సీమాంధ్ర నాయకులకి అది అన్యాయంగా,  అసమంజసంగా కనిపించలేదు.  ఆ కాబినెట్ సమావేశంలో పాల్గొన్న ఇద్దరు సీమాంధ్ర మంత్రులు  కనీసం డిసెంట్ నోట్ ఐన రాసారో  లేదో తెలియదు. ఇక తదుపరి తంతు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ !  విభజన అంశాలని నిర్ణయించ వలసిన మంత్రుల కూటమి లో వుంచుతామంటే రాజీనామా వెనక్కి తీసుకున్న పల్లం రాజు తన పేరు లేనప్పుడైనా పోరాడారా ?  తెలుగు రాష్ట్రాన్ని విభజించే ప్రక్రియలో ఒక్క తెలుగు మంత్రి కి కూడా స్థానం లేకుండా - కనీసం ఆ మంత్రుల కమిటీ రాష్ట్రానికి సైతం రాకుండా తన చిత్తం వచ్చినట్లు విభజన ప్రక్రియని కొనసాగిస్తుంటే అడిగే దమ్ము ఒక్క సీమాంధ్ర నాయకునికీ లేదా ? ఈ రోజు ప్రజల ముందుకి వచ్చి విభజన ప్రక్రియని అడ్డుకోలేక పోయామంటూ మొసలి కన్నీరు కారుస్తూ సీమాంధ్ర కి రావలసిన ప్యాకేజీ కై పోరాడతామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్న కేంద్ర మంత్రుల మాటలు నమ్మే స్థితిలో ఎవ్వరూ లేరు.  ఎప్పుడో 13 ఏళ్ల క్రితం ఏర్పాటైన రాష్ట్రాలకి ప్రకటించిన ప్యాకేజీలకే దిక్కు లేదు.. ఇప్పుడు సీమాంధ్ర కి ప్యాకేజీ అనటం ప్రజల చెవుల్లో క్యాబేజీ పువ్వులు పెట్టటమే...వారికి రావలసిన ప్యాకేజిలు వారికి వచ్చాయి  కనుక కనీసం ప్రజలని మభ్య పెట్టె కార్యక్రమాలకైనా వారు ముగింపు పలికితే మంచిది. 

Monday, October 14, 2013

సిగ్గు శరం లేని సీమాంధ్ర ఎంపీలు !

కేంద్రం ప్రతిపాదించిన అడ్డగోలు విభజన ప్రతిపాదనకి వ్యతిరేకంగా రెండు నెలలుగా జీతాలు కూడా లేకుండా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.  తమ స్వంత ఇంటి నుంచి గెంటి వేసిన విధంగా విభజన ప్రతిపాదించినా కూడా అధిష్టానానికి ఎదురు చెప్పే దమ్ము లేని మన సీమాంధ్ర ఎంపీలు - రెండు నెలల కాలంలో కూడా తమ రాజీనామాలని సైతం ఆమోదింప జేసుకోలేక  పోయారు.  హరికృష్ణ రెండు నిమిషాల్లో చేయగలిగిన పని రెండు నెలల సమయంలో కూడా చేయలేక పోయారు.  అయితే ప్రగల్భాలు పలకటంలో మాత్రం ఏ మాత్రం తక్కువ లేదు వారికి!   రాజీనామాల ఆమోదానికి స్పీకరు దే విచక్షణాదికారం !  అలాగే కొత్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో కూడా కేంద్రానిదే విచక్షణాదికారం ! కానీ ఆ అధికారాలని వారు దుర్వినియోగం చేస్తున్నప్పుడు అడ్డుకొనే మార్గమే తెలీదా మన ఎంపీ లకి ?


కేంద్రం లో యూ పీ ఏ ప్రభుత్వానిది బొటా బొటి మెజారిటీ..  ఒక్క పది మంది ఎంపీలు రాజీనామా చేసి బయటకి వచ్చి  వుంటే కేంద్రం  అంత దూకుడుగా ఉండ గలిగేదా ?  దొంగ దెబ్బ తీసినట్లు టేబుల్ పాయింట్ చర్చ ద్వారా   తెలంగాణా నోట్  పెట్టగలిగి ఉండేదా ?

 పొరుగు రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ కి ఉన్న జ్ఞానం కూడా మన వారికి లేక పోవటం బాధాకరం.  నిద్ర పోతున్న వారిని లేపగలం కానీ నిద్ర నటించే వారిని లేపడం కుదరని పని. హై కమాండ్ పట్ల ఎంపీలకి విశ్వాసం వుండటం తప్పు కాదు. కానీ అంతకన్నా సుప్రీం కమాండ్ అయిన - తమని ఎన్నుకొన్న ప్రజలు, ఉద్యోగులు రాజీనామాలు చేయమని శాసిస్తుంటే - పదవులు పట్టుకొని వేళ్ళాడుతూ కూడా తమది సమైక్య వాదమే అంటూ నమ్మబలుకుతున్న వారంతా తెలుగు జాతి ద్రోహులే ! చిరుద్యోగులకి  ఉన్న నిబద్ధత కూడా తమ ప్రాంతం పట్ల లేని వారందరూ తప్పని సరిగా చరిత్ర హీనులు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. 

ఒక సభకి భద్రతనీయలేని వారు సీమాంధ్రులందరికీ ఇస్తారా ?


వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 19 న తల పెట్టిన సమైక్య శంఖారావం సభకి పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతల వంక చూపి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు తెలియ చేసారు.  అలాగే సెప్టెంబర్ 7 న జరిగిన ఏపీ ఎన్జీఓ ల సభకి సైతం సవా లక్ష ఆంక్షలతో అతి తక్కువ సమయం మాత్రం అనుమతి ఇచ్చారు.  కానీ ఈ మధ్యనే జరిగిన తెలంగాణా గర్జన సభకి మాత్రం ఎటువంటి ఆంక్షలు లేకుండా ముందుగానే అనుమతులిచ్చేసి ఎంతైనా గర్జించుకోమన్నారు. ప్రస్తుతానికి సమైక్య రాష్ట్రంగా ఉన్నఆంద్ర ప్రదేశ్ రాజధాని లో తమ వాణిని వినిపించే హక్కుని అందరికీ సమానంగా కలిగించాలన్న కనీస స్పృహ ప్రభుత్వానికి లోపించింది. సమైక్య వాదుల సమావేశం అంటే చాలు - నానా విధమైన అడ్డంకులు, దాడులు  చేస్తూ  అరాచకం సృష్టిస్తున్న వేర్పాటు వాదులని కట్టడి చెయ్యకుండా - శాంతియుతంగా సభ జరుపుకుంటామనే సమైక్య వాదుల పైనే ఆంక్షలు, అనుమతి నిరాకరణలు కొన సాగించటం అసమంజసం.  ఇక్కడ ప్రభుత్వం గానీ, వేర్పాటువాదులు గానీ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే....హైదరాబాద్ అన్నది తెలుగు వారందరి రాజధాని.  అది ఏ ఒక్కరి గుత్త సొత్తు కాదు. సభలు సమావేశాలు జరుపుకునే హక్కు అన్ని ప్రాంతాల వారికి వుంటుంది.  అయితే ఈ విషయం కోర్టులు చెప్తే తప్ప వినిపించుకొనే దశలో ప్రభుత్వం కూడా వుండటం శోచనీయం. ఎన్జీఓ ల సభకు కోర్టు అనుమతి కావలిసి వచ్చింది.  వైఎస్ఆర్ కాంగ్రెస్ సభకి అనుమతి కోసం సంప్రదిస్తే కోర్టు గడువు విధిస్తే తప్ప కనీసం నిరాకరిస్తున్నామన్న సమాధానం సైతం ఇవ్వలేని చేవ లేని స్థితిలో ప్రభుత్వం వుంది.  సమైక్య వాదుల సభ అంటే చాలు,  అడ్డుకొని తీరతామన్న వేర్పాటు వాదుల ఆగడాల పై ఇలా చేతులెత్తేస్తున్న ప్రభుత్వం  - రాష్ట్రం విడిపోతే సీమాంధ్రులందరికీ భద్రత ఎలా కల్పిస్తుంది?  

Sunday, October 13, 2013

పార్టీల లేఖలే తప్ప ప్రజాభిప్రాయం పట్టదా ?

కేవలం పార్టీలు లేఖలు ఇచ్చాయన్న అంశం పట్టుకొని కేంద్రం మొండిగా  రాష్ట్ర విభజనకి అడుగులు వేస్తోంది,  రోజుకో విధంగా మారే పార్టీల అభిప్రాయం రాష్ట్ర విభజన వంటి ముఖ్యమైన విషయానికి ప్రాతిపదికగా  ఎలా తీసుకుంటారు ?   కెసిఆర్  తెలుగు దేశం మంత్రిగా వున్నప్పుడు విశాల రాష్ట్ర ప్రయోజనాలకై సాక్షాత్తూ శాసన సభలో ప్రసంగించిన విషయం తెలిసిందే.


రెండవ పర్యాయం ఆయనకి చంద్ర బాబు మంత్రి పదవి ఇచ్చి వుంటే  టీఆర్ఎస్ పార్టీ పుట్టేదీ కాదు..కోల్డ్ స్టోరేజీ లో ఉన్న విభజన వాదం బైటకి వచ్చేదీ కాదు.    అలాగే బీజెపీ తాము కేంద్రంలో అధికారంలో వున్నప్పుడు తెలంగాణా రాష్ట్రం అవసరమే లేదని సాక్షాతూ ఆనాటి కేంద్ర హొమ్ మంత్రి అద్వానీ రాత పూర్వకంగా తెలియజేసారు.


 అంతే కాదు..ప్రాంతీయ అసమానతలకి పరిష్కారం సరైన మార్గంలో వనరుల వినియోగమే తప్ప ప్రత్యెక రాష్ట్రానికి కేంద్రం ప్రతిపాదన అన్నదే లేదని కుండ బద్దలు కొట్టారు.. మరి అదే బీజెపీ నేడు ప్రతి పక్షంలో ఉండి, విభజన వాదాన్ని సమర్ధించటం అవకాశవాదమే !   ఇక మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఎన్ని యూ టర్న్ లు-పీ టర్న్ లు తీసుకున్నాయో లెక్కే లేదు..అసలు విభజన ప్రతిపాదన పట్ల కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదు.  తమ స్వంత పార్టీ ముఖ్యమంత్రినే విశ్వాసంలోకి తీసుకోలేని కాంగ్రెస్  కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లు ఇతర  పార్టీల ఉత్తరాలు పట్టుకుని రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూడటం మూర్ఖత్వం.  నేర చరిత్ర గల వ్యక్తులకి సంబంధించిన ఆర్డినెన్స్ ని వెనక్కి తీసుకున్నట్లు గానే రాష్ట్ర విభజన ప్రతిపాదన కూడా  వెనక్కి తీసుకోక పొతే కాంగ్రెస్ భూస్థాపితం అవటం ఖాయం. 

Saturday, October 5, 2013

అంపైర్ మాచ్ ఫిక్సింగ్ !


బుకీలు ఇచ్చే సొమ్ములకి ఆశ పడి మాచ్ ఫిక్సింగ్ చేసిన క్రికెటర్లని చాల మందిని చూసాం.  అయితే అంపైర్ మాచ్ ఫిక్సింగ్ చెయ్యటం అన్నది ఎక్కడైనా జరిగిందా?  ఆంధ్ర ప్రదేశ్ లో ఈ మధ్యనే జరిగింది.  ఇక్కడ రెండు జట్లు వున్నాయి. మొదటి జట్టులో స్టార్ బాట్ మాన్ వున్నారు, ఇంకా దేశంలోనే ఏ ప్రాంతానికైనా వెళ్లి ఆడి గెలవగల ఆల్ రౌండర్లు వున్నారు.  రెండవ జట్టుకి ఆడటం అసలు చేత కాదు కానీ అవతల జట్టుని ఆడి పోసుకోవటం మటుకు బాగా తెలుసు. ఈ ఆడి పోసుకోవటం అన్నది బాగా ఎక్కువ అవటంతో ఈ మధ్యనే కృష్ణ అన్న న్యూట్రల్ అంపైర్ రెండు జట్ల సామర్ధ్యాలని కూలంకషంగా పరిశీలించి,  రెండవ జట్టు ఆడి పోసుకోవటం అసంబద్ధమే అని తేల్చేసాడు.  దానితో  ఇక ఎలాగైనా గెలవాలన్న దుగ్ధతో రెండవ జట్టు ప్రస్తుత అంపైర్ తో చీకటి ఒప్పందానికి మాచ్ ప్రారంభానికి ముందే  వచ్చేసింది.   ఇక టాస్ వెయ్యటం దగ్గరనించి తొండి ఆట మొదలయ్యింది.  స్వయంగా అంపైరే మొదటి జట్టు సభ్యులని ప్రలోభ పెట్టటం, బెదిరించటం మొదలు పెట్టాడు. అంపైరే తొండి కి దిగుతాడని ఊహించని  మొదటి జట్టు ఆఖరి బంతి వరకు ఆట వుంటుంది కదా, ఎలాగైనా ఆడి గెలవచ్చని భరోసాగా వుంది.  కానీ ఆఖరి బంతి వరకు ఆడనిస్తే అంపైర్ ప్రత్యేకత ఏముంది ?  అందుకే ఆట మధ్యలోనే రెండవ జట్టుకి అనుకూలంగా తీర్పు ఇచ్చేసి మాచ్ ముగిసిందని అంపైర్ ప్రకటించేసాడు.  అడ్డ గోలుగా తీర్పు ఇస్తే చూస్తున్న ప్రేక్షకులు ఊరుకుంటారా? ఉతికి ఆరేస్తారన్న విషయం అంపైర్ మర్చిపోయాడు.  ప్రస్తుతం అంపైర్ ని ఉతికి ఆరేయ్యటం అన్న కార్యక్రమమే రాష్ట్రంలో జరుగుతోంది. 

Thursday, October 3, 2013

ఇల్లలుకగానే పండుగ కాదు ! నోట్ పెట్టగానే రాష్ట్రం రాదు!



ఒక దుష్ట సాంప్రదాయానికి తెర లేచింది. ఒక రాష్ట్ర ప్రజల సమ్మతి లేకుండా, ఆ రాష్ట్ర శాసన సభ తీర్మానం లేకుండా కేంద్రం తన చిత్తం వచ్చినట్లు తమకు నచ్చని రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నించే నికృష్ట చర్యకి కాంగ్రెస్ ఉపక్రమించింది.  రెండు సార్లు వరుసగా అధికారం లోకి రావటానికి కారణ భూతులు అయినందుకు తెలుగు వారి నెత్తిన భస్మాసుర హస్తం కాంగ్రెస్ పెట్టింది. రాష్ట్ర విభజన వంటి అతి ముఖ్యమైన అంశం టేబుల్ ఐటం గా కేబినేట్ లో చర్చించటమా?  సిగ్గు చేటు ! ముందుగా ఎజెండాలో తెలంగాణా నోట్ ని చేర్చే  ధైర్యం కూడా చెయ్యలేని కేంద్రం దొడ్డి దోవలో టేబుల్ ఐటం గా తెలంగాణా నోట్ పెట్టి హడావిడిగా ఆమోదింప జేయడం దేనికి నిదర్శనం ? 

దేశంలో అనేక చోట్ల ప్రత్యెక రాష్ట్ర ఉద్యమాలు వున్నాయి.  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం తమ రాష్ట్ర విభజన కోసం శాసన సభ తీర్మానం సైతం కేంద్రానికి పంపి వుంది.  వాటన్నిటినీ పక్కన పెట్టి కేవలం తెలుగు రాష్ట్రాన్నే విభజించాలని కేంద్రానికి ఎందుకు పంతం?  కాంగ్రెస్ కేంద్ర కమిటీ నిర్ణయమే శిలా శాసనమైతే, నేర చరిత్ర గల సభ్యులని కాపాడే ఆర్డినెన్స్  రాష్ట్రపతి దాకా వెళ్ళాక ఎలా వెనక్కి తీసుకున్నారు?  విభజన వల్ల సీమాంధ్రులకి  జరగబోయే అన్యాయం గురించి లేశ మాత్రం ఆలోచించకుండా విభజన ప్రక్రియని ముందుకు సాగించటం కాంగ్రెస్ చేస్తున్న దుస్సాహసం ! ఇందుకు ఆ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. జూలై 30 ప్రకటన ఇచ్చిన 64 రోజుల తరువాత అదే ప్రకటన నేడు కాబినెట్ నోట్ లో చేర్చడం తప్ప కాంగ్రెస్ ప్రస్తుతానికి సాధించింది ఏమీ లేదు.  ఇంక జరగాల్సింది ముందు చాలా వుంది.


 సీమాంధ్ర లో ఎగసి పడుతున్న ఉద్యమాన్ని లెక్క జేయకుండా విభజన ప్రక్రియకి ముందుకు సాగితే - ఇన్నాళ్ళూ శాంతియుతం గా నిరసనలు తెల్పిన తెలుగు జాతి తమ సత్తా ఏమిటో కేంద్రానికి తెలియ జేపుతుంది. తనకి ఉన్న విచక్షణాధికారాన్ని  దుర్వినియోగం చేసి కేంద్రం అడ్డగోలు విభజనకి తెగ బడుతున్నప్పుడు రాష్ట్రపతి, ఇంకా దేశంలో న్యాయ వ్యవస్థలు కూడా క్రియా శీలకం కావాలి. వారికి ఉన్న విచక్షణాదికారాలని వినియోగించి కేంద్రం దుర్మార్గానికి అడ్డు కట్ట వెయ్యాలి.  సాంప్రదాయ పద్ధతిలో శాసన సభ అంగీకార తీర్మానంతో బిల్లు తన ముందుకు వస్తేనే రాష్ట్రపతి ఆమోదించాలి.    సీమాంద్ర ఉద్యమకారులు కూడా శాంతియుతంగా ఉద్యమం  చేస్తూనే న్యాయ వ్యవస్థల తలుపు తట్టి కేంద్రం దురాగతాన్ని ముందుకు సాగనివ్వకుండా అడ్డు కట్ట వెయ్యాలి. ఇంత జరిగాక కూడా ఇంకా పదవుల్లో ఉన్న సీమాంధ్ర రాజకీయ నాయకులు అందరిని తెలుగు జాతి ద్రోహుల కింద జమ కట్టి సామాజిక బహిష్కరణ చెయ్యాలి. 

Wednesday, October 2, 2013

రాష్ట్ర విభజన జరిగి పోయింది అనే వారందరూ తెలుగు జాతికి ద్రోహులే !

రాష్ట్ర విభజనకి నిర్ణయం జరిగి పోయింది, ఇప్పుడేమి చెయ్యలేం, హైకమాండ్ ని వేడుకోవటం తప్ప చేసేదేమీ లేదు అంటూ బేల తనం నటిస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు అందరూ తెలుగు జాతికి తీరని ద్రోహం చేస్తున్నారు.  ఎవరిని నమ్మించటానికి ఈ కట్టు కధలు చెపుతారో అర్ధం కాదు.  ఒక కాంగ్రెస్ నాయకుడే చెప్పినట్లు  ఈ రోజుల్లో పొలం గట్టు మీద  నుంచున్న రైతుకి కూడా  అన్ని విషయాలు తెలిసి పోతున్నాయి.  నిర్ణయం జరిగింది ఒక రాజకీయ పార్టీ  కేంద్ర కమిటీ లో మాత్రమె. (ఆ కమిటీ లో తెలుగు వాళ్ళెవ్వరూ లేరు). రాష్ట్ర విభజనకి అవసరమైన చట్ట పరమైన ప్రక్రియ
అంగుళం కూడా ముందుకు జరగలేదు..జరగదు. ఈ కారణం వల్లనే రాష్ట్ర విభజన ప్రతిపాదన పై కోర్టుల్లో వేసిన రెండు కేసులని 'ప్రి మెచ్యూర్ద్ ' అని కొట్టి వేయటం జరిగింది. సీమాంధ్ర ఉద్యమం దెబ్బకి విభజనకి నోట్ పెట్టటానికి సైతం కేంద్రానికి ధైర్యం చాలట్లేదు. ఈ పరిస్థితిలో నోట్ పై వెనుకడుగు తమ ప్రతాపమే అని ఎంపీలు ప్రగల్భాలు పలికితే నమ్మే వారు ఎవరూ లేరు.  వారికి తమ హైకమాండ్ పట్ల విశ్వాసం వుంటే తప్పు కాదు. అయితే అంతకన్నా సుప్రీం కమాండ్ అయిన ప్రజలు వారిని రాజీనామాలు చేయమని శాసిస్తున్నప్పుడు తమ పదవులని జలగల్లా వదలకుండా రాజీడ్రామాలు  ఆడుతూ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న విధంగా ప్రజలు తమని గమనించట్లేదని భావించటం మూర్ఖత్వం.  రాష్ట్ర విభజన పై  మిగతా రాజకీయ పార్టీల లాగే కాంగ్రెస్ కూడా తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ నిర్ణయానికి ఆ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదు.  అటువంటప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం శిలా శాసనం ఎలా అవుతుంది ? రాహుల్ గాంధీ అనబడే ఒక్క ఎంపీ నోరు విప్పితేనే రాష్ట్రపతి వరకు వెళ్ళిన ఒక ఆర్డినెన్స్ ని చింపి  పారేయ్యాల్సిన పరిస్థితిలో కాంగ్రెస్ వుంది. ఆయన సోనియా గాంధీ కొడుకు అన్న వ్యక్తిగత హోదా ని పక్కన పెడితే కేవలం ఒక్క ఎంపీ అభ్యంతరం తోనే ఒక నిర్ణయాన్ని వెనుకకి తీసుకున్నప్పుడు సీమాన్ధ్రకి చెందిన 25 మంది ఎంపీలు నిజాయితీ గా నిరసన తెలిపితే ఎందుకు ఫలితం వుండదు ? పోనీ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదనుకుంటే కనీసం సక్రమంగా రాజీనామాలు చేసినా ప్రభుత్వం మైనారిటీలో పడి బిల్లు వచ్చే పరిస్థితి ఉండదు..ఆ పనైనా సక్రమంగా చేయమని ప్రజలు, ఉద్యోగులు గద్దిస్తున్నా దాగుడు మూతలు ఆడుతున్న సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు  అందరు చరిత్ర హీనులు.. తెలంగాణా కి అడ్డుపడ్డ వారందరూ తెలంగాణా ద్రోహులే అని తెలబాన్ నాయకుడు ప్రకటించాడు.  సీమాంధ్ర రాజకీయ నాయకులారా! మీరు ఒక్క విషయం గమనించాలి.. మీరు  తెలంగాణా ద్రోహులు అయినా పరవాలేదు.. తదుపరి ఎన్నికల్లో ప్రజలు మీకు బ్రహ్మ రధం పడతారు.  కానీ తెలుగు జాతి ద్రోహులు అయితే మాత్రం చరిత్ర హీనులుగా కాల గర్భంలో కలిసి పోతారు... 

Tuesday, October 1, 2013

కేసిఆర్ కుసంస్కారం !


ఈ క్రింది వీడియో చూడండి.. తెలబాన్ నాయకుని దురహంకార వ్యాఖ్యల పై నిండు శాసన సభలో ఆనాటి ముఖ్య మంత్రి వైఎస్ కడిగి పారేసినప్పుడు కిక్కురుమనకుండా కుక్కిన పేనులా పడివున్న కేసిఆర్ ఈనాడు వైఎస్ ప్రమాదంలో మరణిస్తే పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోయాడని అవహేళన చెయ్యటం ఏమి సంస్కారం? చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడే పధ్ధతి ఇదేనా? 
  



 అంతే కాదు..కలిసుందామని చెప్పిన వారందరూ బేవకూఫ్ లుగా కనిపిస్తున్నారు ఆయనకి ! ఒక వేలు ఎదుటి వారికి చూపిస్తే నాలుగు వేళ్ళు తననే చూపిస్తాయన్న సంగతి ఆయన మర్చి పోతున్నారు. పచ్చ కామెర్లు ఉన్న వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు ఎదుటి వారందరూ బేవకూఫ్ లుగా కనిపిస్తే అది ఆయన లోపమే అవుతుంది.  సీమాంధ్రకి అన్యాయం చేస్తూ ఏకపక్షంగా ప్రతిపాదించిన విభజన పై తన నిరసన గళాన్ని వినిపించిన ముఖ్య మంత్రి పై వ్యక్తిగత దూషణలకి దిగటం కూడా ఆయన దిగజారుడు మనస్తత్వానికి ప్రతీక. అయినా తెలబాన్ నాయకుని నుండి సంస్కారయుతమైన ప్రసంగాలని ఆశించటం ఇసుక నుండి తైలం తీసే ప్రయత్నమే అవుతుంది.  కానీ ఎప్పుడూ ఇతర పక్ష నాయకులని, వ్యాపారస్తులని మాత్రమె దూషించే కెసీఆర్ సకల జన భేరి లో మొత్తం సీమాన్ద్రులనే దుమ్మెత్తి పోయటం రాబోయే విపరిణామాలకి సూచిక.  లంకలో పుట్టిన వారందరూ రాక్షసులే.. సీమాన్ధ్రలో పుట్టిన వారందరూ తెలంగాణా ద్రోహులే అని నోరు పారేసుకుంటే ఇక రాబోయే (?) తెలంగాణా లో సీమాంధ్రుల భద్రత కి హామీ ఎక్కడ వుంటుంది ?  తెలబాన్ నాయకుడు ఇటువంటి నోటి దురుసు చూపినంత కాలం సీమాన్ధ్రలో ఉద్యమం ఎగిసి పడుతూనే వుంటుంది..తెలంగాణకి నిలువూ అడ్డం రెండూ కెసీఆర్ మాత్రమె అవుతారు...