Sunday, February 21, 2010

పోలీసులే లోకువ..


రాష్ట్రం లో గత మూడు నెలలుగా ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో రాత్రి పగలు తేడా లేకుండా శ్రమిస్తూ శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసులను అభినందించాల్సింది పోయి ఎ చిన్న/పెద్ద సంఘటన జరిగినా వారి మీద రాళ్లేయడం వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తుంది. ధిల్లీ నుంచి గల్లీ స్థాయి నాయకుని వరకు పోలీసులకు అక్షింతలు వేయటానికి రెడీగా వుంటారు. నిషేధాజ్ఞలు అమలులో వున్నప్పుడు సామాన్య జనం మౌనంగా భరిస్తున్నారు కదా! మరి వాటిని ఉల్లంఘించినపుడు చర్యలు తీసుకుంటే తప్పేమిటి? కానీ మన సమాజంలో కొన్ని ప్రత్యెక వర్గాలు వున్నాయి. ఎటువంటి పరిస్థితిలోను వారి పై లాఠీ ఎత్తకూడదు. జర్నలిస్టుల సంగతే తీసుకుంటే, వారి వారి చానేల్సుల్లో,పేపర్లలో వారు రెచ్చగొట్టే వార్తలు, వ్యాఖ్యలు ఎన్నైనా చేయవచ్చు...కానీ వారి మీద లాఠీ ఝుళిపిస్తే అదో పెద్ద నేరం. రాజకీయ నాయకులైనా అంతే. వారిని అరెస్టు చేసినా కూడా వారిని పొలిసు స్టేషన్లలో అత్తారింట్లో అల్లుడి లాగ చూసుకోవాలి. లేక పొతే ఇంతే సంగతి. లగడపాటి వంటి ఎం.పీ. స్థాయి నాయకుడు సినిమాటిక్ గా ప్లాన్ చేసి తప్పించుకుంటే కాపలాగా ఉన్న కొద్ది మంది సిబ్బంది ఏమి చేయగలరు? ఎక్కడో ఉన్న పోలీసు కమిషనర్ ఏమి చేయ గలడు? ఇక విద్యార్ధులున్నారు. వారిని చదువుకొని బాగు పడమని విద్యాలయాలకు పంపిస్తే, తిన్నది అరక్క ఉద్యమాలు, ఆత్మహత్యలు చేసుకుంటే పోలీసులదా బాధ్యత? పోలీసులలో లోపాలు లేవని కాదు. కాని ప్రతి విషయానికీ వారిని తప్పు పట్టడం మంచి పద్ధతి కాదు.

కే.సి.ఆర్. రాజీనా "మాయ"!



పుట్టి బుద్ధెరిగాక రాజీనామాయే తన ప్రవృత్తిగా పెట్టుకున్న కే.సి.ఆర్.కి రాజీనామా సరైన ఫార్మాట్ లో ఇవ్వటం తెలియదంటే నమ్మాలా? తోటి శాసన సభ్యులందరినీ ముంచేసి తానూ,తన చెల్లి మాత్రం రాజీనామాలు తిరస్కరణకు గురి అయ్యేలా జాగ్రత్త పడ్డాడు. ఇక తరువాత డ్రామా ఏమిటో వెండితెర పై చూద్దాం.

Saturday, February 20, 2010

టీ.ఆర్.ఎస్. కారు ఇక "బేకార్"!




గత ఎన్నికల్లో కేవలం పది మంది శాసన సభ్యులు, రెండే రెండు మంది ఎం.పీ. ల తో చావు తప్పి కన్ను లొట్ట బోయినట్లుగా బైట పడ్డ కే.సి.ఆర్..... రాష్ట్రంలో గట్టి నాయకత్వం లేని సమయం చూసి, విద్వేషాగ్నుల్నిరెచ్చగొట్టి, తెలంగాణకి దొర అయి పోదామని కల గన్నాడు. ఆయన అలా తన సామ్రాజ్యాన్ని స్థాపించేస్తే తమ స్థావరాలకి ఎక్కడ ముప్పు వస్తుందో అని కంగారు పడి పోయిన తెలంగాణకి చెందిన ప్రధాన పార్టీల నాయకులు కే.సి.ఆర్. పెట్టిన జే.ఎ.సి. అన్న బోనులో ఎలకల్లా పడ్డారు. పడ్డాక తెలిసింది దొర పెత్తనం తెలంగాణా మీద మాత్రమె కాదు తమ మీద కూడా అని! కేంద్రం కూడా కే.సి.ఆర్. పెట్టిన గాండ్రింపులని సరిగ్గా అంచనా వేయలేక డిసెంబరు 9 వ తేదీన ఒక పొరపాటు ప్రకటన చేసింది. తరవాత జరిగిన పరిణామాలతో నిజం తెలుసుకున్న కేంద్రం దిద్దు బాటు చర్యలు ప్రారంభించింది. (నా ముందరి టపా పొరపాటుని సరిదిద్దండి..చదవండి. http://andhraaakasaramanna.blogspot.com/2010/02/blog-post_17.html ) . ఏమైనా, కే.సి.ఆర్. కర్ర పెత్తనం ఎక్కువగా చేయటమే కాక, మొదటినించీ తమకు అలవాటు ఐన రాజీనామా డ్రామాలు ఆడి తాను తీసుకున్న గోతిలో తామే పడ్దారు. ప్రజలందరికీ కూడా ఆయన చర్యలన్నీ ఉనికి కోసం ఆరాటమే తప్ప తెలంగాణా కోసం నిజమైన పోరాటం కాదని తెలిసి పోయింది. మళ్ళీ జరిగే ఉప ఎన్నికల్లో రాజీనామా చేసిన సీట్లు కూడా వస్తాయన్న నమ్మకం ఎ మాత్రం లేదు. కనుక టీ.ఆర్.ఎస్. కారు ఇంక షెడ్డు కే!

Friday, February 19, 2010

జాయింటు ఊడిన కమిటీ!




అంతా ఊహించినట్లే జరిగింది. తెలంగాణా జే.ఎ.సి. లోంచి ముక్క ఊడింది. (జనవరి 21 వ తేదీనాటి నా ముందరి టపా చదవండి. http://andhraaakasaramanna.blogspot.com/2010/01/blog-post_21.html ) . రాజీనామాలకే కాంగ్రెసుతో లింకు పెట్టిన తెలుగు దేశం ఇంకా జే.ఎ.సి. లో కొనసాగుతుందని భావించలేం. ఒంటెత్తు పోకడలతో ప్రధాన పార్టీలను దూరం చేసుకుని ఏమి సాధిస్తారో తెలీదు. ఇంకా ఈ రోజు మజ్లిస్ పార్టీకి చెందిన శాసన సభ్యుడు అక్బరుద్దీన్-- హైదరాబాదు ఎ ఒక్కరి సొత్తు కాదు అని ప్రకటించటమే కాక చిన్న రాష్ట్రాలుగా విభజనకు తాము వ్యతిరేకమని విష్పష్టంగా ప్రకటించారు. మరి సమైక్య వాదాన్ని బలపరచిన చిరంజీవి, మోహన్ బాబు, రోజా, లగడపాటి..చివరికి కంచి స్వామిని కూడా విడువకుండా దుర్భాషలాడిన తెలబాన్లు మజ్లిస్ ని పల్లెత్తు మాట అన గలరా? అలా అనాలని నా ఉద్దేశ్యం కాదు. హైదరాబాదులో గట్టి పట్టు ఉన్న పార్టీ తమ వైఖరి స్పష్టం చేసాక...ఈ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికే మొహం చెల్లని వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ఇక ఎంత మాత్రం లేదు. తక్కిన విషయాలు తేల్చటానికి శ్రీ కృష్ణ కమిషన్ ఎటూ ఉంది. కనుక ఇప్పటికైనా విద్యార్ధులే కాక అన్ని వర్గాల వారూ ఆందోళన లు విరమించి కాగల కార్యం శ్రీకృష్ణునికి వదిలి రాష్ట్రంలో మునుపటి ప్రశాంతత తెస్తే బాగుంటుంది.

Thursday, February 18, 2010

ఇప్పటికి గ్రహింపు కి వచ్చిందా?




అసెంబ్లీని ముట్టదిన్చాలన్న ప్రయత్నం మానుకోవాలని మంత్రులు శ్రీధర్ బాబు, అరుణ విద్యార్ధులకు విజ్ఞప్తి చేసారట. చాలా సంతోషించాల్సిన విషయం. ఉద్యమంలో అసాంఘిక శక్తులు ప్రవేశించే అవకాశం వుందని వారు తెలియచేసారు. ఆ సంగతి వారికి ఇప్పుడు తెలిసిందేమో కానీ, నాగం జనార్ధన్ రెడ్డిని యూనివర్సిటీలో చితక్కొట్టినప్పుడే రాష్ట్ర ప్రజలకు తెలిసింది. విద్యా సంవత్సరం కోల్పోతే ఉద్యోగాలు సంపాదించటానికి నానా కష్టాలు పడాలని హెచ్చరించారు. మరి విద్యార్ధులని రెచ్చగొట్టి వారిని వుద్యమంలోనికి లాగినపుడు ఈ గ్రహింపు ఏమయింది? మరీ విచిత్రం ఏమిటంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా ఉంటూ....తెలంగాణా వారిపై తెలంగాణా వారే దాడులు చేసుకోవడం ద్వారా ఏమి సందేశం ఇస్తారని విద్యార్ధులని ప్రశ్నించారు. అదే ప్రశ్న ఇప్పుడు ఆంధ్ర ప్రజానీకం వేస్తోంది. తెలుగు వారే తోటి తెలుగు వారి గురించి దుర్భాషలాడి, వారి పై దాడులు చేసి ఇన్నాళ్ళు ఏమి సాధించారు? ప్రపంచానికి ఏమి సంకేతం ఇచ్చారు?

కీలెరిగి వాత పెట్టిన స్పీకర్!




కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు మరోసారి చాణక్య నీతిని ప్రదర్శించాయి. శ్రీ కృష్ణ కమిటీ ని ఏర్పాటు చేసాక కూడా తెలంగాణా ఉద్యమాన్ని తామే హైజాక్ చేసేద్దామన్న అత్యుత్సాహంతో రాజీనామాల డ్రామా ఆడిన టీ.ఆర్.ఎస్. కి స్పీకర్ తగిన బుద్ది చెప్పారు. ప్రతిభావంతుడు, అత్యంత వివాదరహితుడుగా పేరున్న జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ గురించి..దిక్కు మాలిన కమిటీ, గడ్డి పీకుతుందా లాంటి పరుష వ్యాఖ్యలు చేయటమే కాక, తమ చేతిలోని కీలు బొమ్మ ఐన జే.ఎ.సి. కన్వీనర్ చేత రాజీనామాల హుకుం జారీ చేయించటం టీ.ఆర్.ఎస్. నియంతృత్వ పోకడలకు నిదర్శనం. పైగా రాజీనామా చేయని వారిని తెలంగాణా ద్రోహులుగా వర్ణిస్తూ వారి ఇళ్ళ పై పేడ,పిడకలు కొట్టించటం జే.ఎ.సి. సమిష్టి ధర్మానికే విరుద్ధం. అందుకే రాజీనామాలు చేయకుండా కాంగ్రేసు వారు, కాంగ్రెసుతో లింకు పెట్టి కోదండరాం కి లేఖలు ఇచ్చి తెలుగు దేశం వారు చాణక్య నీతిని చూపారు. స్పీకర్ కూడా ఈసారి ఏ మాత్రం ఆలస్యం లేకుండా టీ.ఆర్.ఎస్. వారి పది రాజీనామాలూ ఆమోదించేసి వారికి ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో తమ వాణిని వినిపించే అవకాశం లేకుండా చేసారు. ఐదేళ్ళ పాటు తమ బాగోగులు చూడమని ప్రజలు అసెంబ్లీకి పంపితే...పదవులు మాకు తృణప్రాయం అంటూ స్వంత ఎజెండాలతో ఏడాది కూడా తిరక్క ముందే రాజీనామా చేసి పారేశారు. అటువంటిది వాళ్ళు రేపు మళ్ళీ ఉప ఎన్నికల్లో నిలబడితే...మీరందరూ మాకు తృణప్రాయం అని ప్రజలు వారిని తిరస్కరించే రోజు దగ్గరలోనే ఉంది.

Wednesday, February 17, 2010

తెలంగాణా రాజకీయుల సొత్తా?




కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతి సమైక్యంగా వుంటే మంచిదని సలహా ఇచ్చారు. అంతే....తెలంగాణా (తీవ్ర) వాదులు ఆయన పై దుర్భాషలు మొదలు పెట్టేసారు. కంచి పీఠంలో కూర్చుని పూజలు చేసుకునే ఆయనకి తెలంగాణా పై మాట్లాడే హక్కు లేదట! ఇంకా ఆయన దిష్టి బొమ్మలు తగలపెట్టతాలూ, తెలంగాణలో తిరగనివ్వమని బెదిరింపులూ, స్కందగిరి ఆలయంలో కార్య కలాపాలు స్తంభింప చేస్తామన్న హెచ్చరికలూ షరా మామూలుగా ఫాలో అయ్యాయి. అసలు ఒక విషయం అర్ధం కాదు. ఈ దేశం లో భావ ప్రకటన స్వేచ్చ అనేది అందరికీ సమానమే. చిరంజీవికి కానీ,మోహన్ బాబుకి కానీ, కంచి స్వామివారికి కానీ తమ ఆభిప్రాయాలు చెప్పే హక్కు వుంది. అలా చెప్పినంత మాత్రం చేత వారిని నానా దుర్భాషలాడటం, వారికి తెలంగాణా రాజ్య బహిష్కరణ విధించడం వంటివి సహించరాదు. ప్రత్యెక రాష్ట్రం రాక ముందే ఇలా పెట్రేగుతున్న వారు, ఒక వేళ తెలంగాణా వస్తే..గిస్తే.. ఇతర ప్రాంతాల వారిని ఎలా కాల్చుకు తింటారో చెప్పకనే చెపుతున్నారు. అయినా కంచిలో పూజలు చేసుకొనే స్వామికి తెలంగాణా పై మాట్లాడే హక్కు లేనపుడు....యూనివర్సిటీల్లో చదువుకొనే విద్యార్దులకీ, అక్కడ పాఠాలు చెప్పుకొనే ప్రోఫెసర్లకీ కూడా వుండకూడదు. కానీ జరుగుతున్నదేమిటి? తెలంగాణా కేవలం రాజకీయ సమస్య కాదు. సామాజిక సమస్య కూడా. సమాజం లో అన్ని వర్గాల వారికి తమ అభిప్రాయం చెప్పుకొనే హక్కు ఉందన్న ఇంగిత జ్ఞానం కూడా ఈ రాజకీయులకు లేదా?

పొరపాటుని సరి దిద్దండి..


అర్ధ శతాబ్దం పైన సాగుతున్న తెలంగాణా ఉద్యమం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న స్థితిలో వుంది. అలాంటిది ఇప్పుడు కనీసం పరిస్థితుల అంచనాల కోసం అధికారికంగా ఒక కమిటీ వచ్చిందని సంతోషించక తెలంగాణా భీభత్స వాదులు ఎంత సేపూ చిదంబరం గారి డిసెంబర్ 9 ప్రకటన పట్టుకొని వేళ్లాడుతూ నానా యాగీ చేస్తున్నారు. అసలు తెలంగాణా ప్రక్రియ మొదలు పెడతామని చిదంబరం ప్రకటన చేయటమే పొరపాటు. తెలంగాణా ప్రక్రియ అనకుండా రాష్ట్ర విభజన కోసం ప్రక్రియ మొదలు పెడతాం అని వుంటే గొడవ వుండేది కాదు. ఎవరి సెంటి మెంట్లు హర్ట్ అయ్యేవి కాదు. రాత్రికి రాత్రి తెలంగాణా అనేసరికి ఇతర ప్రాంతాలవారు సహజంగానే హర్ట్ అయ్యారు. రాష్ట్రం తగలబడటం మొదలైంది. పొరపాటు జరిగింది సరే, ఏ పరిస్థితిలో జరిగింది ఆలోచించాలి. ఆ సమయంలో కేంద్రానికి రెండు కళ్ళుగా ఉండి, సరైన సమాచారం అందించాల్సిన వారు ఎం చేస్తున్నారు? ముఖ్య మంత్రి రోశయ్య నాకేం బాధ్యత లేదు అంతా హై కమాండు దే అని నెత్తిన తడి గుడ్డ వేసుకొని కూర్చున్నాడు. రెండో కన్నుగా చూడాల్సిన గవర్నర్ తివారీ రాస లీలలలో మునిగి తేల్తున్నాడు. విధి లేని పరిస్థితిలో కేంద్రం తన దగ్గరున్న సమాచారంతో (కాంగ్రెస్స్ ఓకే అంటే మేమూ ఓకే అని ప్రతి పక్షాలు ఇచ్చిన లేఖలు) ఒక ప్రకటన చేసింది. అది నిస్సందేహంగా ఒత్తిడుల మధ్య, సరైన సమాచారం లేని పరిస్థితుల్లో ఇచ్చిన పొరపాటు ప్రకటన. ఆ విషయం తదనంతరం జరిగిన పరిణామాలే రుజువు చేసాయి. ఇప్పటికైనా మించి పోయింది లేదు. కేంద్రం భేషజాలకు పోకుండా డిసెంబరు 9 వ తేదీ ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. శ్రీ కృష్ణ కమిటీ రిపోర్టు వచ్చాక పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని నిర్ద్వందంగా ప్రకటించాలి. రాష్ట్రం లో సత్వరం రాష్ట్రపతి పాలన విధించాలి. అప్పుడే మన రాష్ట్రం లో ప్రశాంతత నెలకొంటుంది.

Sunday, February 14, 2010

వై.ఎస్.రాజ శేఖర రెడ్డి జీవించి వుంటే??




వై.ఎస్.రాజ శేఖర రెడ్డి ఈ రోజు కనుక జీవించి వుంటే పరిస్థితి ఎలా ఉండేదో అని చిన్న ఊహ....
కే. సి. ఆర్. అసలు దీక్షకి కూర్చునే ఆలోచనే చేసేవాడు కాదు. ఒక వేళ నిరాహార దీక్షకి దిగితే..ఇప్పటి ప్రభుత్వంలా ఆ దీక్షని భగ్నం చేయాలని వై.ఎస్.ఆర్ ప్రయత్నించే వాడు కాదు. పైగా దీక్షకి కూర్చున్న మరు క్షణం నుంచి ఆయనకి పచ్చి మంచి నీళ్ళు కూడా అందకుండా పకడ్బందీ ఏర్పాట్లు వై.ఎస్.ఆర్. చేసేవాడు. ఆ విధంగా టీ.పీ.ఎస్. తీసుకుంటూ దొంగ దీక్ష చేయటం కాకుండా అసలు సిసలు నిరాహార దీక్ష చేసే మహద్భాగ్యం కే.సి.ఆర్. కి కలిగి వుండేది. ఓ పది రోజుల తరువాత......డాక్టర్లు ఆరోగ్య పరిస్థితి పై బూటకపు నివేదికలు ఇచ్చినట్లు కాక....కే.సి.ఆర్. నిజంగానే కోమా లోకి వెళ్లి పోయే వాడు. అప్పటి వరకు మూలన కూర్చున్న తెలంగాణా కాంగ్రెస్ సీనియర్లు మేడం కి పరిస్థితి నివేదిస్తారు. మేడం వై.ఎస్.ఆర్. ని ఆరా తీస్తుంది. ఒక్క మనిషి దీక్షకి లొంగి ఇప్పుడు తెలంగాణా ఇచ్చేస్తే దేశంలో మరో 22 రాష్ట్రాలకి డిమాండ్లు వస్తాయని ఆయన వివరించి చెప్పే వాడు. (అంతే కానీ ఇప్పటి రోశయ్య ప్రభుత్వంలా... అక్కడ మనిషి చచ్చి పోతున్నాడు, ఏదో ఒకటి తేల్చండి అని కేంద్రం పీక మీద కత్తి పెట్టే వాడు కాదు.) . ఈ లోపల కే.సి.ఆర్. ప్రాణాలు చాలా విలువైనవి..తెలంగాణా ఉద్యమం బతికి ఉండాలంటే ఆయన బతికి వుండాలని తెలంగాణా ప్రజలు తీర్మానించడంతో కే.సి.ఆర్. వారి కోరిక మేరకు దీక్ష విరమించేస్తాడు. ఇంక వై.ఎస్.ఆర్. ముఖ్య మంత్రిగా వుండగా నిరాహార దీక్ష చేయనని ముక్కు నేలకి రాసి శపధం చేస్తాడు.
శుభం. వూహ సమాప్తం.

Saturday, February 13, 2010

సమైక్యాంధ్రకు నాయకత్వ లోపం!




1) సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారి నాలుకలు తెగ్గోస్తాం.
2) సమైక్యాంధ్రకు వ్యతిరేకులైన వారి ఆస్తులు లాక్కుంటాం. వారిని ఉద్యోగాలు, వ్యాపారాలు చేయనివ్వం. వారిని రాష్ట్రం అవతలికి తరిమి కొడతాం.
౩) శ్రీ కృష్ణ కమిటీ రిపోర్టు సమైక్యాంధ్రకు అనుకూలంగా రాక పొతే రాష్ట్రాన్ని అగ్ని గుండం చేస్తాం. రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తాం.
4) రాష్టం సమైక్యంగా వుండాలని చెప్పటానికి వారం రోజులు చాలు. మరి పది నెలలు ఈ కమిటీ ఏం చేస్తుంది? గడ్డి పీకుతుందా?
....ఇలా గట్టిగా వాదించే నాయకుడు ఎవరూ సమైక్యాంధ్ర ఉద్యమానికి లేక పోవటం పెద్ద లోపమే!