2000 సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం 3 కొత్త రాష్ట్రాలని ఎటువంటి అలజడి లేకుండా ఏర్పరచింది. దానికి కారణం మూడు చోట్లా కూడా ఆయా ప్రాంతాల వారి సమ్మతితో కేవలం పరిపాలన సౌలభ్యం కోసం విభజన ప్రతిపాదించటం. అంతే గాక అప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలే మరో చోట రాజదానులని ఏర్పాటు చేసుకున్నాయి. కానీ ఈ రోజు మన దగ్గర ఎం జరుగుతోంది? పరిపూర్ణంగా అభివృద్ది చెందిన రాజధానిని హైజాక్ చేస్తూ తల్లి రాష్ట్రాన్నే తన్ని తగలేసే పోకడకి కాంగ్రెస్ పార్టీ తెగబడింది. రాష్ట్ర విభజన వంటి సున్నితమైన వ్యవహారం పరిష్కరించే సమయంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారి అభిప్రాయాలకి తగిన విలువనిస్తూ-సమ న్యాయం పాటిస్తూ అదే సమయంలో నదీ జలాలు/ఆదాయ వనరుల పంపిణీ, కొత్త రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటు వంటివి ముందుగా నిర్ణయించి అప్పుడు విభజన తలపెట్టాలి. కానీ ఆఖరి నిముషం వరకు - అన్ని ప్రాంతాలకి అనుకూలంగా సమస్య పరిష్కరిస్తాం అని మాయ మాటలు చెప్తూ సీమాంధ్ర ప్రాంతీయుల అభిప్రాయాలకి లేశ మాత్రం విలువనివ్వకుండా కేవలం రాజకీయ సమీకరణాలు దృష్టిలో వుంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన విభజన రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసింది. స్పష్టంగా తమ ప్రయోజనాలకి వ్యతిరేకంగా వ్యవహరించిన అధిష్టానం మీద తిరగబడ వలసిన మన సీమాంధ్ర నాయకులు అధిష్టానం మనసు మార్చే ప్రయత్నం చేస్తామంటూ సన్నాయి నొక్కులు వినిపించటం ఘోరం. అధిష్టానం చేసిన ప్రలోభాలకో లేదా బెదిరింపులకో లొంగి పోయిన సీమాంధ్ర రాజకీయ నాయకులు కిమ్మనక పోయినా, ప్రజల్లోంచి వచ్చిన ఆగ్రహ జ్వాలలకి వెరచి ఆలస్యంగానైనా అయిష్టంగా రాజీనామాల బాట పట్టారు. దానితో అధిష్టానం కొత్త నాటకానికి తెర లేపింది. సీమాంధ్ర నాయకులు రాజీనామాలు చేస్తే చట్ట సభల్లో తమ వాణి వినిపించే అవకాశం కోల్పోతారట! సీమాంధ్ర నాయకుల సమస్యలు పరిష్కరించటానికి ఆంటోనీ కమిటీ వేసాం - అన్నీ చెప్పుకోండి అంటూ మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే సమస్యలు సీమాంధ్ర నాయకులకే ఉన్నాయా? ప్రజలకి లేవా? వారు కొత్తగా చెప్ప బోయేదేమిటి? అసలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారి సమస్యలు/అభిప్రాయాలు కూలంకషంగా సేకరించి, క్రోడీకరించి, విశ్లేషించి సమగ్రమైన నివేదిక ఇచ్చిన శ్రీ కృష్ణ కమిటీ నివేదిక చేతిలో వుండగా మళ్ళీ ఈ అంటోనీ కమిటీ ఉద్ధరించ బోయేదేమిటి? ఈ కమిటీలు, రోడ్ మ్యాపుల నాటకాలతో ప్రజలు విసుగెత్తి పోయి వున్నారు. కేంద్ర ప్రభుత్వం పంతాలకి పోకుండా తక్షణం శ్రీ కృష్ణ కమిటీ నివేదిక బూజు దులిపి పార్లమెంటులో చర్చకు ప్రవేశ పెట్టాలి. అర్ధవంతమైన చర్చల ద్వారా శ్రీకృష్ణుడు చూపిన ఆరు పరిష్కారాలలో ఒక దానిని ఎన్నుకొని ఈ సమస్యకి మంగళం పాడాలి. లేని పక్షంలో ఈ అడ్డగోలు విభజన ప్రతిపాదనతో కేవలం ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమె గాక దేశ వ్యాప్తంగా ఎగసిన వేర్పాటు వాద ఉద్యమ జ్వాలలలో కాంగ్రెస్ పార్టీ మసి కావటం ఖాయం.
Saturday, August 3, 2013
Thursday, August 1, 2013
సీమాంధ్రుల గుండె మంట!
ఉరి తీయబోయే ఖైదీని సైతం నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడగటం సంస్కారం, సాంప్రదాయం. (ఆ కోరిక తీరుస్తారా లేదా అన్నది వేరే సంగతి) కనీసం ఆ సంస్కారం కూడా లేకుండా సీమాంధ్రుల భవిష్యత్తు ఏమై పోతుందో అన్న ఆలోచన చేయకుండా అడ్డగోలు విభజనతో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రుల పై భస్మాసుర 'హస్తం' పెట్టింది. 50 సంవత్సరాలకు పైగా అనుబంధం పెంచుకోవటమే గాక తమ ఆర్ధిక వనరులు సమీకరించి, రక్తం చెమట చిందించి, మేధస్సులు రంగరించి సర్వతోముఖంగా అభివృద్ది చేసిన హైదరాబాదు నగరాన్ని అప్పనంగా తెలంగాణ కి ధారపొయమంటే సీమాంధ్రుల గుండె మండదా? పరిశ్రమలైన, వ్యాపారాలైనా, విద్యా సంస్థలైనా, ఇతరత్రా అన్ని రంగాల్లోనూ ఇన్నేళ్ళలో రాష్ట్రంలో అభివృద్ది అంతా హైదరాబాదు చుట్టూ కేంద్రీకృతమై వున్నది అన్నది వాస్తవం. అవుటర్ రింగు రోడ్డైనా, అన్ని హంగులతో వున్న అంతర్జాతీయ విమానాశ్రయమైన, ఇంకా మెట్రో రైల్ పదకమైనా ఆంధ్ర ప్రదేశ్ లో మరెక్కడా కాక ఇక్కడే ఎందుకు అమలు పరచారు? ఎందుకంటే ఈ వసతులన్నీ 23 జిల్లాల వారికీ పనికి వస్తాయని,ఉపయోగపడతాయని! అటువంటి హైదరాబాదు నగరానికి సరైన ప్రత్యామ్నాయం చూపకుండా విభజించేయటం దారుణం. ఇదే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నిర్ణయించిన పక్షంలో తెలంగాణా ప్రాంతానికి పెద్ద "ప్యాకేజీ" ఇవ్వకుండా వుండే వారా? కనీసం అటువంటి ప్యాకేజీ సైతం ప్రస్తావించకుండా తన్ని తగలేసిన చందంగా విభజన చేయటం అమానుషం. విభజన తప్పని సరి అని నిర్ణయించినప్పుడు రెండు ప్రాంతాల వారికీ సమ న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిది. కానీ కేవలం రాజకీయ కారణాలతో, సీమాన్ధ్రలో తమకు ఠికానా లేదని గ్రహించి, సవతి తల్లి ప్రేమ చూపిన కాంగ్రెస్ అధిష్టానం వైఖరి అత్యంత గర్హనీయం.
నిబద్ధత కరవై నిండా మునిగాం!
కేంద్ర ప్రభుత్వం తెలంగాణాకి పచ్చ జెండా ఊపగానే దేశంలో నిద్రాణంగా వున్న వేర్పాటు వాద ఉద్యమాలు సందడి మొదలు పెట్టేశాయి. వాటిలో పశ్చిమ బెంగాల్ లో గోర్ఖాలాండ్ ఒకటి. తెలంగాణా ప్రకటించిన నేపధ్యంలో 72 గంటల బంద్ ప్రారంభమైన వెంటనే ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి మమతా బెనర్జీ స్పందన ఇక్కడ చదవండి:
http://in.news.yahoo.com/mamata-rules-bengals-division-darjeeling-boil-164608312.html
రాష్ట్రాన్ని విభజించనీయమని తెగేసి చెపుతూనే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కేంద్రం నిర్ణయం తీసుకోజాలదని కుండ బద్దలు కొట్టారు మమతా బెనర్జీ!
"A union territory bypassing the state, is it so easy? Is it a lollypop in a child's hand? I will remind the central government that it has a responsibility to not disturb peace in Darjeeling," said Banerjee.
కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయం ఎలా వున్నా సరే పార్లమెంటులో బిల్లు పెట్టి రాష్ట్రాన్ని విభజించి తీరుతామని కేంద్రం తొడలు చరుస్తున్నా, చేవ చచ్చిన మన రాష్ట్ర నాయకులు స్వంత వ్యాపార/రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో వుంచుకొని నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తున్నారు. ఇటువంటి నిబద్ధత లేని నాయకులు ఉండ బట్టే కేంద్రం తెలుగు వారిని లోకువ గట్టి 13 జిల్లాల వారి ఆలోచనలకి, అభిప్రాయాలకి వీసమెత్తు విలువ ఇవ్వకుండా - కేవలం రాజకీయ ప్రయోజనాలు దృష్టి లో వుంచుకొని అడ్డగోలు విభజనకి పూనుకుంది. ఇదంతా తెలుగు వాళ్ళ ప్రారబ్ధం/స్వయంకృతం ...
Wednesday, July 31, 2013
తెలుగు వారందరికీ ఈ రోజు బ్లాక్ డే !
సీమాంధ్ర ప్రాంతీయుల మనో భావాలకి ఏ మాత్రం విలువనివ్వకుండా తెలంగాణా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తీరు అత్యంత ఆక్షేపణీయం ... శ్రీ కృష్ణ కమిటీ నివేదికని తుంగలో తొక్కి ఏక పక్ష నిర్ణయంతో తెలంగాణా రాష్ట్రాన్ని తెలుగు వారి నెత్తిన రుద్దే సాహసం కాంగ్రెస్ పార్టీ చేసిందంటే అందుకు వేరే బయట వారిని ఎవరిని నిందించనవసరం లెదు. ప్రత్యెక రాష్ట్రం సంగతి ఎలా వున్నా తెలుగు వారి పరువు-ప్రతిష్ట, హస్తినా పుర వీధుల్లో దిగ జారి పోయింది అన్నది కఠోర వాస్తవం. మధ్య ప్రదేశ్ కి చెందిన దిగ్విజయ్ సింగ్, కాశ్మీరు కి చెందిన ఆజాద్, కర్నాటక నుంచి వీరప్ప మొయిలీ , కేరళ నుండి వాయలార్ రవి...వీళ్ళా మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించేది ? తెలుగు వారిని ఎంత లోకువ కట్టక పొతె..కనీసం తదుపరి రాజధాని ఏమిటి అన్న ప్రత్యామ్నాయం చూపకుండా రాష్ట్రాని విభజించెసి... మళ్ళీ ఆ రాజధాని కోసం సీమాన్ధ్ర నాయకులని తమ చుట్టూ తిప్పుకోవాలన్న కుతంత్రంతో కాంగ్రెస్ ఆదిస్థానం వ్యవహరిస్తుంది? తెలంగాణా లాగే దేశంలో ఇతర ప్రాంతాల్లో వున్న విభజన వాద ఉద్యమాల విషయంలో కాంగ్రెస్ ఇలాగే ప్రవర్తించే సాహసం చేస్తుందా? ఆయా రాష్ట్రాలు తమ వ్యవహారాల్లో వేలు పెట్టనిస్తాయా?
మహానుభావుడు ఎన్టీఆర్ ఏనాడో చాటారు..
"ఇంటిలోన అరమరికలు వుంటే ఇల్లెక్కి చాటాలా , కంటిలో నలుసు తీయాలంటే కను గుడ్డు పెరికి వెయాలా.. పాలు పొంగు మన తెలుగు గడ్డను పగల కొట్టవద్దు.... నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చెయద్దు.."
ఇప్పటికే నవ్వుల పాలు అయి పొయాము.. శాస్త్రీయం గా సర్వే చేసి ఇచ్చిన శ్రీ కృష్ణ కమిటీ నివేదికని చేతిలో వుంచుకొని కూడా దాన్ని పార్లమెంటులో చర్చకు పెట్టే ప్రయత్నం చెయ్యకుండా, హస్తినా పురిలో ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం గా ప్రదక్షిణాలు చేసి పనికిమాలిన స్వంత నివేదికలు అధిష్టానానికి సమర్పించి కాలక్షేపం చేసిన కాంగ్రెస్ నాయకులు, అలాగే క్షంతవ్యం కాని మౌనం వహించి విభజనని అడ్డుకోలేక పోయిన ప్రతిపక్ష నాయకులు కూడా చరిత్ర హీనులుగా మిగిలిపోవటం ఖాయం.
Thursday, May 16, 2013
దీదీ మాట ... చూపాలి బాట !
పశ్చిమ బెంగాల్ నుండి డార్జిలింగ్ విభజన పై ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి మమతా బెనర్జీ
వ్యాఖ్యలు నేటి ఈనాడు పత్రికలో ఇక్కడ చూడండి ....
వేర్పాటు వాద నాయకుని సమక్షంలో సైతం నిర్మొహమాటంగా తన వైఖరి బైట పెట్ట గలిగిన
ధైర్యం, దమ్ము మన రాష్ట్ర నాయకులలో ఎవరికైనా ఉందా? రెండు ప్రాంతాల నాయకుల వాదనలతో అధికార పక్షం, రెండు కళ్ళ సిద్ధాంతం తో ప్రధాన ప్రతి
పక్షం సమస్యని మరింత జటిలం చేసాయే కానీ పరిష్కారం దిశగా ఒక్క అడుగు కూడా
వెయ్యలెదు. ఇంక సమస్య పరిష్కారం కోసం ఏర్పరచిన శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ఏమయ్యిందో ఆ
భగవంతుడికే ఎరుక... రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలు పర్యటించి, రాష్ట్రంలోని అన్ని
వర్గాల వారినుంచి సమాచారం సేకరించి-విశ్లేషించి-క్రోడీకరించి ఇచ్చిన కమిటీ
నివేదిక ఏ చెత్త బుట్ట దాఖలయ్యిందో? సమస్య పరిష్కారానికి ఆరు సూచనలు ఇచ్చి, అందులోనూ ఆరో సూచన అత్యుత్తమ పరిష్కారమని
శ్రీ కృష్ణ కమిటీ నిగ్గు తేల్చింది.
ఆ సూచనని సత్వరం అమలు పరచి వుంటే మన రాష్ట్రం ఈ పాటికి గుజరాత్ తో పోటీ పడ గల స్థితిలో వుండేది. ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం కళ్ళు తెరిచి, మమతా బెనర్జీ ని ఆదర్శంగా తీసుకొని,
రాష్ట్ర విశాల ప్రయోజనాలు నెరవేర్చే దిశగా పయనిస్తే మంచిది...
Tuesday, April 30, 2013
శభాష్ సీ ఎం !
ఎట్టకేలకు ముఖ్య మంత్రి గారు చేవ చూపించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి బయ్యారం
గనుల కేటాయింపు పై మడమ తిప్పేది లేదని కుండ బద్దలు కొట్టారు. తెలబాన్ నాయకుని
తాటాకు చప్పుళ్ళకు బెదిరేది లేదని తేల్చి చెప్పారు!
విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ కేంద్రంతో పోరాడి సాధించిన విశాఖ ఉక్కు
కర్మాగారం కేవలం విశాఖ ప్రాంతానికో లేదా సీమాంధ్రులకో మాత్రమె చెందదు. ఆంధ్ర
ప్రదేశ్ రాష్ట్రం మొత్తానికీ చెందుతుంది. ఆ మాటకొస్తే దాని ఉత్పాదనా ఫలాలను దేశం
మొత్తం అనుభవిస్తోంది. ఈ పాటి ఇంగిత జ్ఞానం లోపించి -- భౌగోళికంగా తెలంగాణా ప్రాంతంలో వున్న బయ్యారం
గనులను విశాఖ ఉక్కు కి కేటాయించడం అడ్డుకుంటామంటూ రంకెలేస్తున్న తెలబాన్ నాయకుడిని
ఖాతరు చేసేది లేదని ముఖ్య మంత్రి తేల్చి చెప్పటం ముదావహం.
ఇటువంటి కఠిన వైఖరినే - సీమాంధ్రులని తరిమి కొడతాం .. నాలుకలు కోస్తాం అని తెలబాన్లు అన్న రోజునించి అవలంబించి ఉండి
వుంటే ... ఉద్యమం అనేది ఉన్మాద స్థాయికి చేరేది కాదు. మన రాష్ట్రం అభివృద్ధిలో
దశాబ్దాల వెనక్కి వెళ్లేదీ కాదు...
Saturday, April 27, 2013
రమణాచారి గారు! మీ నిర్ణయం అసమంజసం !!
Thursday, January 24, 2013
మైనారిటీలే మనుషులు..వారికే మనో భావాలు!
ముస్లిం ల మనోభావాలు దెబ్బ తింటాయన్న "అంచనా" తో తమిళనాడు ప్రభుత్వం కమల హాసన్
విశ్వరూపం సినిమాని విడుదలకి ముందే నిషేధించింది.
మరి బ్రాహ్మణులని అవమానకరంగా చిత్రీకరించి, విడుదల అయ్యాక కోర్టు కేసుల వరకు వెళ్ళినా కూడా ఆ చిత్రం పై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు.
ఏ ప్రభుత్వమైనా కూడా మైనారిటీలకే కొమ్ము కాస్తుంది అనటానికి ఇంతకన్నా తార్కాణం కావాలా?
మరి బ్రాహ్మణులని అవమానకరంగా చిత్రీకరించి, విడుదల అయ్యాక కోర్టు కేసుల వరకు వెళ్ళినా కూడా ఆ చిత్రం పై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు.
ఏ ప్రభుత్వమైనా కూడా మైనారిటీలకే కొమ్ము కాస్తుంది అనటానికి ఇంతకన్నా తార్కాణం కావాలా?
Friday, January 18, 2013
చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా !
మన రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం వుంది అంటే,
అది కేవలం డిల్లీకి బ్రాంచి ఆఫీసుగా మాత్రమె నడుస్తుంది అన్న విషయం మనకి తెలియంది
కాదు. ఇప్పటికీ భారత దేశంలో ఏ రాష్ట్రం కూడా మోయనంతగా గాంధీ, నెహ్రు వంశీకుల
పేర్లని మన ప్రభుత్వ పధకాలకీ, విమానాశ్రాయాలకీ, యాత్రా స్థలాలకీ మనం మోస్తున్నాం.
మన తెలుగు ప్రధాని పీ వీ పేరుని మనమే మర్చి పోయి మరీ,
గాంధీ-నెహ్రు వంశీకుల భజన చేసి తరించాం.
ఇంత చేసిన మనకి కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది? ఇవ్వ బోతోంది?
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే ఎన్ని సీట్లు వస్తాయి -
విడ దీస్తే ఎన్ని సీట్లు వస్తాయి అన్న లేక్కలేసుకుంటోంది తప్ప
సగటు తెలుగు వాడి మనసులో ఏముందో ఒక్కసారి తొంగి చూసే ప్రయత్నం చేసిందా? మన తెలుగు
వారి ఆత్మ గౌరవమే నినాదంగా రాజకీయాల్లో ప్రవేశించి, గాంధీ-నెహ్రూ వంశీకుల భజనలో
తరిస్తున్న కాంగ్రెస్ రాజ్యాన్ని అంతమొందించి తెలుగు వారి సత్తా ఏమిటో ప్రపంచానికి
చాటి చెప్పిన ఎన్ టీ ఆర్ వంటి నాయకుడు కనీసం ప్రతిపక్షంలో ఐన నేడు లేకపోవటం మన
దురదృష్టం. కేవలం రాబోయే ఎన్నికల్లో వచ్చే సీట్ల ప్రాతిపదికగా రాష్ట్ర విభజన
అంశాన్ని కాంగ్రెస్ తేల్చ బూనటం దారుణం.
కాంగ్రెస్ మనసులో ఏముందో అన్నది సీమాంధ్ర
ప్రతినిధులతో వాయలార్ రవి అన్న మాటల్లోనే తెలిసి పోయింది.
ఒక రాష్ట్ర భవిష్యత్తుని ఒక రాజకీయ పార్టీ వ్యుహాలకి అనుగుణంగా నిర్ణయించటం ఏ
మాత్రం క్షంతవ్యం కాదు.
ప్రాంతాలకి అతీతంగా తెలుగు వారందరూ రాష్ట్ర విభజనకి జరుగుతున్న కుట్రకి తెర
దించాలి. ఒక్కటిగా ఉన్నప్పుడే మన రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకొనలేక
పోయాం. ఇక ముక్కలైతే మనని ఎవరైనా లెక్క జేస్తారా? తాను జీవించి వున్నప్పుడు జరిగిన
వెన్ను పోటు కన్నా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూసి స్వర్గంలో ఎన్.టీ.ఆర్. ఆత్మ
క్షోభిస్తుందని అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
(నేడు ఎన్.టీ.రామారావు వర్ధంతి)
Wednesday, January 2, 2013
అఖిల పక్షం మిధ్య...తెలంగాణా మిధ్య !
గత నెల 28వ తెదీన దేశ
రాజధానిలో జరిగిన అఖల పక్ష సమావేశం తర్వాత ఏదో అద్భుతం జరిగిపోతుందన్న హడావిడి రాష్ట్రంలో రాజకీయ పక్షాలు చేస్తున్నాయి.
కేవలం ఎఫ్.డీ.ఐ. బిల్లుని గట్టేక్కించుకొవటానికే, తెలంగాణా ప్రాంత ఎంపీలు జారి
పోకుండా అఖిల పక్షం ఎరని కాంగ్రెస్ అధిష్టానం వేసిందన్నది సుష్పష్టం. అయినా కేంద్రంలో హొమ్ మంత్రి మారినంత మాత్రాన రాష్ట్రంలో రాజకీయ పక్షాల
అభిప్రాయాలు తెలుసుకోవటానికి సమావేశం అవసరమా? రాష్ట్ర విభజన అన్నది కేవలం రాజకీయ
పక్షాలు మాత్రమే నిర్ణయించే విషయం కాదు. రాష్ట్రంలో రాజకీయ పక్షాలే కాక, సమాజం
లోని అన్ని వర్గాలనుంచి అభిప్రాయాలని సేకరించి-క్రోడీకరించి-విశ్లేషించి
శాస్త్రీయంగా ఇచ్చిన శ్రీ కృష్ణ కమిటీ నివేదిక చేతిలో వుండగా, హొమ్ మంత్రికి
సమావేశం అవసరమా? ఇటువంటి నాన్చుడు వ్యవహారాలతోనే రాష్ట్ర అభివృద్ధిని కాంగ్రెస్ మంట గలిపింది.
సూటిగా ఆలోచిస్తే......ఏకాభిప్రాయం అనేది లేకుండా (రాజకీయులే కాదు, సమాజంలోని అన్ని
వర్గాలలోను) రాష్ట్ర విభజన సాధ్యం కాదు.
ఇప్పుడు రాష్ట్రంలో భిన్న వర్గాల మధ్య ఏకాభిప్రాయం లేనే లేదు..రానే రాదు.
అటువంటప్పుడు ప్రత్యెక రాష్ట్రం వచ్చే ప్రసక్తే లేదు.
శ్రీకృష్ణుడు తన నివేదికలో చూపిన ఆరో అత్యుత్తమ పరిష్కారం అమలు చేయటమే కేంద్రం తక్షణ కర్తవ్యం.
Subscribe to:
Comments (Atom)













