Wednesday, July 31, 2013

తెలుగు వారందరికీ ఈ రోజు బ్లాక్ డే !

సీమాంధ్ర ప్రాంతీయుల మనో భావాలకి ఏ మాత్రం విలువనివ్వకుండా తెలంగాణా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తీరు అత్యంత ఆక్షేపణీయం ... శ్రీ కృష్ణ కమిటీ నివేదికని తుంగలో తొక్కి ఏక పక్ష నిర్ణయంతో తెలంగాణా రాష్ట్రాన్ని తెలుగు వారి నెత్తిన రుద్దే సాహసం కాంగ్రెస్ పార్టీ చేసిందంటే అందుకు వేరే బయట వారిని ఎవరిని నిందించనవసరం లెదు. ప్రత్యెక రాష్ట్రం సంగతి ఎలా వున్నా తెలుగు వారి పరువు-ప్రతిష్ట, హస్తినా పుర వీధుల్లో దిగ జారి పోయింది అన్నది కఠోర వాస్తవం. మధ్య ప్రదేశ్ కి చెందిన దిగ్విజయ్ సింగ్, కాశ్మీరు కి చెందిన ఆజాద్, కర్నాటక నుంచి వీరప్ప మొయిలీ , కేరళ నుండి వాయలార్ రవి...వీళ్ళా మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించేది ? తెలుగు వారిని ఎంత లోకువ కట్టక పొతె..కనీసం తదుపరి రాజధాని ఏమిటి అన్న ప్రత్యామ్నాయం చూపకుండా రాష్ట్రాని విభజించెసి... మళ్ళీ ఆ రాజధాని కోసం సీమాన్ధ్ర నాయకులని తమ చుట్టూ తిప్పుకోవాలన్న కుతంత్రంతో కాంగ్రెస్ ఆదిస్థానం వ్యవహరిస్తుంది? తెలంగాణా లాగే దేశంలో ఇతర ప్రాంతాల్లో వున్న విభజన వాద ఉద్యమాల విషయంలో కాంగ్రెస్ ఇలాగే ప్రవర్తించే సాహసం చేస్తుందా? ఆయా రాష్ట్రాలు తమ వ్యవహారాల్లో వేలు పెట్టనిస్తాయా? 

మహానుభావుడు ఎన్టీఆర్ ఏనాడో చాటారు..
"ఇంటిలోన అరమరికలు వుంటే ఇల్లెక్కి చాటాలా , కంటిలో నలుసు తీయాలంటే కను గుడ్డు పెరికి వెయాలా.. పాలు పొంగు మన తెలుగు గడ్డను పగల కొట్టవద్దు.... నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చెయద్దు.." 

ఇప్పటికే నవ్వుల పాలు అయి పొయాము.. శాస్త్రీయం గా సర్వే చేసి ఇచ్చిన శ్రీ కృష్ణ కమిటీ నివేదికని చేతిలో వుంచుకొని కూడా దాన్ని పార్లమెంటులో చర్చకు పెట్టే ప్రయత్నం చెయ్యకుండా, హస్తినా పురిలో ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం గా ప్రదక్షిణాలు చేసి పనికిమాలిన స్వంత నివేదికలు అధిష్టానానికి సమర్పించి కాలక్షేపం చేసిన కాంగ్రెస్ నాయకులు, అలాగే క్షంతవ్యం కాని మౌనం వహించి విభజనని అడ్డుకోలేక పోయిన ప్రతిపక్ష నాయకులు కూడా చరిత్ర హీనులుగా మిగిలిపోవటం ఖాయం.

Thursday, May 16, 2013

దీదీ మాట ... చూపాలి బాట !

పశ్చిమ బెంగాల్ నుండి డార్జిలింగ్ విభజన పై ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలు నేటి ఈనాడు పత్రికలో ఇక్కడ చూడండి ....      
 
వేర్పాటు వాద నాయకుని సమక్షంలో సైతం నిర్మొహమాటంగా తన వైఖరి బైట పెట్ట గలిగిన ధైర్యం, దమ్ము మన రాష్ట్ర నాయకులలో ఎవరికైనా ఉందా? రెండు ప్రాంతాల  నాయకుల  వాదనలతో అధికార పక్షం, రెండు కళ్ళ సిద్ధాంతం తో ప్రధాన ప్రతి పక్షం సమస్యని మరింత జటిలం చేసాయే కానీ పరిష్కారం దిశగా ఒక్క అడుగు కూడా వెయ్యలెదు.  ఇంక సమస్య పరిష్కారం కోసం ఏర్పరచిన శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ఏమయ్యిందో ఆ భగవంతుడికే ఎరుక... రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలు పర్యటించి, రాష్ట్రంలోని అన్ని వర్గాల వారినుంచి సమాచారం సేకరించి-విశ్లేషించి-క్రోడీకరించి ఇచ్చిన కమిటీ నివేదిక ఏ చెత్త బుట్ట దాఖలయ్యిందో?  సమస్య పరిష్కారానికి ఆరు సూచనలు ఇచ్చి, అందులోనూ ఆరో సూచన అత్యుత్తమ పరిష్కారమని శ్రీ కృష్ణ కమిటీ నిగ్గు తేల్చింది. ఆ సూచనని సత్వరం అమలు పరచి వుంటే మన రాష్ట్రం ఈ పాటికి గుజరాత్ తో పోటీ పడ గల స్థితిలో వుండేది.  ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం కళ్ళు తెరిచి, మమతా బెనర్జీ ని ఆదర్శంగా తీసుకొని, రాష్ట్ర విశాల ప్రయోజనాలు నెరవేర్చే దిశగా పయనిస్తే మంచిది...  
                                                                           

Tuesday, April 30, 2013

శభాష్ సీ ఎం !

ఎట్టకేలకు ముఖ్య మంత్రి గారు చేవ చూపించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి బయ్యారం గనుల కేటాయింపు పై మడమ తిప్పేది లేదని కుండ బద్దలు కొట్టారు. తెలబాన్ నాయకుని తాటాకు చప్పుళ్ళకు బెదిరేది లేదని తేల్చి చెప్పారు!  

విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ కేంద్రంతో పోరాడి సాధించిన విశాఖ ఉక్కు కర్మాగారం కేవలం విశాఖ ప్రాంతానికో లేదా సీమాంధ్రులకో మాత్రమె చెందదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మొత్తానికీ చెందుతుంది. ఆ మాటకొస్తే దాని ఉత్పాదనా ఫలాలను దేశం మొత్తం అనుభవిస్తోంది.  ఈ పాటి ఇంగిత జ్ఞానం లోపించి -- భౌగోళికంగా తెలంగాణా ప్రాంతంలో వున్న బయ్యారం గనులను విశాఖ ఉక్కు కి కేటాయించడం అడ్డుకుంటామంటూ రంకెలేస్తున్న తెలబాన్ నాయకుడిని ఖాతరు చేసేది లేదని ముఖ్య మంత్రి  తేల్చి చెప్పటం ముదావహం. ఇటువంటి కఠిన వైఖరినే - సీమాంధ్రులని తరిమి కొడతాం .. నాలుకలు కోస్తాం అని తెలబాన్లు అన్న రోజునించి అవలంబించి ఉండి వుంటే ... ఉద్యమం అనేది ఉన్మాద స్థాయికి చేరేది కాదు. మన రాష్ట్రం అభివృద్ధిలో దశాబ్దాల వెనక్కి వెళ్లేదీ   కాదు...

Saturday, April 27, 2013

రమణాచారి గారు! మీ నిర్ణయం అసమంజసం !!


 అఖిల భారత సర్వీసుకి చెందిన ఉత్తమ అధికారి ఆయన! తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణాధికారిగా ఆయన అందించిన సేవలు తెలుగు ప్రజలు ఎప్పటికీ గుర్తు ఉంచుకుంటారు . తెలుగు భాష లో ఆయనకు వున్న పాండిత్యం కూడా మెచ్చ తగింది . ఇంతటి విద్వత్తు వున్న రమణాచారి గారు ఎత్తెత్తి పేడలో కాలు వేసిన చందంగా వేర్పాటువాద ప్రాంతీయ పార్టీ తీర్ధం పుచ్చుకోవటం బాధాకరం . వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే స్వేచ్చని ఎవరూ కాదనలేరు గానీ సమర్ధుడైన అధికారిగా పేరు గాంచిన ఆయనకి,  ఈనాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో దశాబ్దాల వెనక్కి వెళ్ళటానికి కారణమైన వేర్పాటు తీవ్ర వాదం గురించి తెలియదనుకోవాలా ?  ఆయనకి తెలంగాణా ప్రాంతం అంటే అభిమానం ఉండవచ్చు.. కానీ కుటుంబ ప్రయోజనాలే పరమావధిగా పార్టీని నడుపుతున్న నాయకుని సారధ్యంలో ఆయన తెలంగాణా ప్రాంతానికి ఏం ఒరగ బెడతారన్నది సందేహాస్పదమే!

Thursday, January 24, 2013

మైనారిటీలే మనుషులు..వారికే మనో భావాలు!

ముస్లిం ల మనోభావాలు దెబ్బ తింటాయన్న "అంచనా" తో తమిళనాడు ప్రభుత్వం కమల హాసన్ విశ్వరూపం సినిమాని విడుదలకి ముందే నిషేధించింది.

మరి బ్రాహ్మణులని అవమానకరంగా చిత్రీకరించి, విడుదల అయ్యాక కోర్టు కేసుల వరకు వెళ్ళినా కూడా ఆ చిత్రం పై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు.

ఏ ప్రభుత్వమైనా కూడా మైనారిటీలకే కొమ్ము కాస్తుంది అనటానికి ఇంతకన్నా తార్కాణం కావాలా?

Friday, January 18, 2013

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా !

 
మన రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం వుంది అంటే, అది కేవలం డిల్లీకి బ్రాంచి ఆఫీసుగా మాత్రమె నడుస్తుంది అన్న విషయం మనకి తెలియంది కాదు. ఇప్పటికీ భారత దేశంలో ఏ రాష్ట్రం కూడా మోయనంతగా గాంధీ, నెహ్రు వంశీకుల పేర్లని మన ప్రభుత్వ పధకాలకీ, విమానాశ్రాయాలకీ, యాత్రా స్థలాలకీ మనం మోస్తున్నాం. మన తెలుగు ప్రధాని పీ వీ పేరుని మనమే మర్చి పోయి మరీ, గాంధీ-నెహ్రు వంశీకుల భజన చేసి తరించాం. ఇంత చేసిన మనకి కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది? ఇవ్వ బోతోంది? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే ఎన్ని సీట్లు వస్తాయి - విడ దీస్తే ఎన్ని సీట్లు వస్తాయి అన్న లేక్కలేసుకుంటోంది తప్ప సగటు తెలుగు వాడి మనసులో ఏముందో ఒక్కసారి తొంగి చూసే ప్రయత్నం చేసిందా? మన తెలుగు వారి ఆత్మ గౌరవమే నినాదంగా రాజకీయాల్లో ప్రవేశించి, గాంధీ-నెహ్రూ వంశీకుల భజనలో తరిస్తున్న కాంగ్రెస్ రాజ్యాన్ని అంతమొందించి తెలుగు వారి సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్ టీ ఆర్ వంటి నాయకుడు కనీసం ప్రతిపక్షంలో ఐన నేడు లేకపోవటం మన దురదృష్టం. కేవలం రాబోయే ఎన్నికల్లో వచ్చే సీట్ల ప్రాతిపదికగా రాష్ట్ర విభజన అంశాన్ని కాంగ్రెస్ తేల్చ బూనటం దారుణం. కాంగ్రెస్ మనసులో ఏముందో అన్నది సీమాంధ్ర ప్రతినిధులతో వాయలార్ రవి అన్న మాటల్లోనే తెలిసి పోయింది. ఒక రాష్ట్ర భవిష్యత్తుని ఒక రాజకీయ పార్టీ వ్యుహాలకి అనుగుణంగా నిర్ణయించటం ఏ మాత్రం క్షంతవ్యం కాదు. ప్రాంతాలకి అతీతంగా తెలుగు వారందరూ రాష్ట్ర విభజనకి జరుగుతున్న కుట్రకి తెర దించాలి. ఒక్కటిగా ఉన్నప్పుడే మన రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకొనలేక పోయాం. ఇక ముక్కలైతే మనని ఎవరైనా లెక్క జేస్తారా? తాను జీవించి వున్నప్పుడు జరిగిన వెన్ను పోటు కన్నా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూసి స్వర్గంలో ఎన్.టీ.ఆర్. ఆత్మ క్షోభిస్తుందని అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
(నేడు ఎన్.టీ.రామారావు వర్ధంతి)

Wednesday, January 2, 2013

అఖిల పక్షం మిధ్య...తెలంగాణా మిధ్య !

గత నెల 28వ తెదీన దేశ రాజధానిలో జరిగిన అఖల పక్ష సమావేశం తర్వాత ఏదో అద్భుతం జరిగిపోతుందన్న హడావిడి రాష్ట్రంలో రాజకీయ పక్షాలు చేస్తున్నాయి.   కేవలం ఎఫ్.డీ.ఐ. బిల్లుని గట్టేక్కించుకొవటానికే,   తెలంగాణా ప్రాంత ఎంపీలు జారి పోకుండా అఖిల పక్షం ఎరని కాంగ్రెస్ అధిష్టానం వేసిందన్నది సుష్పష్టం.  అయినా కేంద్రంలో హొమ్ మంత్రి మారినంత మాత్రాన రాష్ట్రంలో రాజకీయ పక్షాల అభిప్రాయాలు తెలుసుకోవటానికి సమావేశం అవసరమా?   రాష్ట్ర విభజన అన్నది కేవలం రాజకీయ పక్షాలు మాత్రమే నిర్ణయించే విషయం కాదు. రాష్ట్రంలో రాజకీయ పక్షాలే కాక, సమాజం లోని అన్ని వర్గాలనుంచి అభిప్రాయాలని సేకరించి-క్రోడీకరించి-విశ్లేషించి శాస్త్రీయంగా ఇచ్చిన శ్రీ కృష్ణ కమిటీ నివేదిక చేతిలో వుండగా, హొమ్ మంత్రికి సమావేశం అవసరమా?  ఇటువంటి నాన్చుడు వ్యవహారాలతోనే రాష్ట్ర అభివృద్ధిని కాంగ్రెస్ మంట గలిపింది. సూటిగా ఆలోచిస్తే......ఏకాభిప్రాయం అనేది లేకుండా (రాజకీయులే కాదు, సమాజంలోని అన్ని వర్గాలలోను) రాష్ట్ర విభజన సాధ్యం కాదు. ఇప్పుడు రాష్ట్రంలో భిన్న వర్గాల మధ్య ఏకాభిప్రాయం లేనే లేదు..రానే రాదు. అటువంటప్పుడు ప్రత్యెక రాష్ట్రం వచ్చే ప్రసక్తే లేదు. శ్రీకృష్ణుడు తన నివేదికలో చూపిన  ఆరో అత్యుత్తమ పరిష్కారం అమలు చేయటమే కేంద్రం తక్షణ కర్తవ్యం. 

Monday, December 31, 2012

"అమానత్" వివరాలు వెదకకండి !

2012  సంవత్సరం అత్యంత విషాదకర సంఘటన తో ముగుస్తోంది.. 13 రోజుల పోరాటం అనంతరం ఢిల్లీ అత్యాచార బాధితురాలు కన్ను మూసింది... ఆమె కుటుంబానికే గాకే యావత్ దేశానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అసలు విషాద సంఘటన కన్నా మీడియా వాళ్ళు వచ్చి కాకుల్లా పొడుచుకు తినే ప్రశ్నలకి సమాధానాలు చెప్పటమే ఆయా కుటుంబ సభ్యులకి వేదన గా సంభవిస్తుంది. ఇక్కడ గుడ్డిలో మెల్ల లాంటి విషయమేమిటంటే-- ప్రభుత్వ ఆంక్షల వల్ల కావచ్చు, లేదా స్వయం నియంత్రణ కావచ్చు..వారి వ్యక్తిగత వివరాల జోలికి ఏ మీడియా కూడా తొంగి చూడలేదు.  అమానత్, నిర్భయ, దామిని వంటి మారు పేర్లతోనే సమాచారం అందించారు తప్ప వారి వ్యక్తిగత వివరాలు గోప్యంగా వుంచటం హర్షణీయం ఇంకా అభిలషణీయం కూడా.
జరిగిన దారుణానికి పరిహారంగా లక్షల రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగాలని డిల్లీ, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి కానీ అదే సమయంలో వారి గోప్యత కి భంగం వాటిల్లకుండా కూడా సరైన చర్యలు తీసుకోవటం అత్యంత ఆవశ్యకం.   అలాగే నిందితులకి విధించాల్సిన శిక్ష విషయంలో కూడా ఫేస్ బుక్ లో నేను చూసిన ఒక సూచన..
"If Government can send the victim to Singapore for better treatment, I strongly suggest they should send the accused to Saudi Arabia for better justice !!"
నిజమే కదా! మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని సింగపూర్ తరలించిన ప్రభుత్వం..మెరుగైన న్యాయం కోసం నిందితులని సౌదీ అరేబియా కి అప్పగిస్తే బాగుంటుంది..


Sunday, December 9, 2012

ఆంధ్రావనికి నేడు విద్రోహ దినం..


పచ్చగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం భగ్గుమనటం మొదలై నేటికి మూడేళ్ళు! కేంద్రం లోని యూపీఏ ప్రభుత్వానికి ఆక్సిజన్ లాగా 32 మంది ఎమ్పీలని అందించిన ఆంధ్ర రాష్ట్రానికి మేడం జన్మ దిన కానుకగా ఇచ్చిన మర్చి పోలేని కానుక ఇది....దొంగ దీక్షలకి మోస పోయి, తెలుగు వారిని విడ దీద్దామని ప్రకటించి భంగ పడిన రోజు ఇది.... పర్యవసానాలు ఆలోచించకుండా తెలుగు జాతిని ముక్కలు చేసే ప్రకటన చేసి, ఆనక వెనక్కి తీసుకొని తద్వారా రాష్ట్రాన్ని ఉద్యమాల ఊబిలోకి దించి..తెలుగు ప్రజలందరికీ కష్ట నష్టాలని కలుగ జేసిన కాంగ్రెస్ పార్టీ నేడు మళ్ళీ అఖిల పక్షం అన్న నాటకానికి తెర లేపింది. ఎఫ్ డీ ఐ బిల్లు ఆమోదం పొందటంలో ఎటువంటి ఆటంకం రాకుండా ఉండటానికే తెలంగాణా ఎంపీ లని బుజ్జగించటం కోసం, రాష్ట్రంలో చల్లారిన వేర్పాటు వాదాన్ని మళ్ళీ రగిలించటానికి అఖిల పక్షం డ్రామాని మొదలు పెట్టింది. అసలు రాష్ట్రాన్ని విడ గొట్టాలా ఒద్డా అన్నది నిర్ణయించటానికి రాజకీయ పార్టీలకి వున్న హక్కు ఏమిటి? రాష్ట్రమంటే కేవలం రాజకీయులే కాదు...అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాల్ని పరిగణన లోకి తీసుకోవాలి. రాష్ట్రంలోని అన్ని వర్గాలతో విస్తృతంగా చర్చలు జరిపి, కూలంకషంగా పరిశోధించి ఇచ్చిన శ్రీ కృష్ణ కమిషన్ నివేదిక ఏమైంది? శ్రీకృష్ణుడు నివేదించిన నివేదికలోని ఆరో అత్యుత్తమ పరిష్కారాన్ని అమలు చేయటానికి రాజకీయ పార్టీలకి అభ్యంతరాలేమిటి?  కేవలం వోటు బ్యాంకు రాజకీయాలు తప్ప మరేమీ కాదు. 2014 లో తాము  ఎలాగు అధికారంలోకి రామని నిర్ణయించేసుకున్న కాంగ్రెస్ పార్టీ, ఈలోగా రాష్ట్రాన్ని వీలైనంతగా తగల పెట్టి వెళ్ళాలనే కుట్రని అమలు జరుపుతోంది. రాష్ట్రంలోని ప్రతి పధకానికి ఇందిరా, రాజీవ్ పేర్లని మోస్తున్న తెలుగు ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న కానుక ఇది. కనీసం ఒక్క పధకానికైనా లేదా పర్యాటక ప్రాంతానికైనా మన తెలుగు ప్రధాని పీవీ పేరు ఉందా? ప్రాంతాలకి అతీతంగా ఈ కుట్రని ఎదుర్కోవాల్సిన అవసరం తెలుగు వారందిరికీ ఇప్పుడు వుంది...కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమె కాదు..విభజన వాదం పేరుతొ రాజకీయాలు చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్న రాజకీయులందరినీ తరిమి కొట్టి తెలుగు వారు తామంతా ఒక్కటే అని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఇప్పుడు వుంది.
లేని పక్షంలో బ్రిటిష్ వారికన్నా అధ్వాన్నంగా డివైడ్ అండ్ రూల్ పాలసీ ని అమలు పరుస్తున్న కాంగ్రెస్ రాజకీయాలకు బలైన చరిత్ర హీనులుగా మనం మిగిలి పోతాం. 


Sunday, November 11, 2012

ముదురుతున్న తెలబాన్ పైత్యం..

ఒక విశ్వ విద్యాలయానికి ఉప కులపతిని ఎలా నియమిస్తారు...? 
  విద్యార్హతలు, అనుభవం, సీనియారిటీ తదితర అంశాలు చూసి నియమిస్తారు --  కానీ ఏ ప్రాంతానికి చెందిన వాడు అని కాదు.
            బుర్రలో గుజ్జు వున్న ఎవరికైనా ఈ విషయంలో సందేహం అనేది రాదు.   కానీ తెలబాన్ల రూటే వేరు!  భౌగోళికంగా తెలంగాణా ప్రాంతంలో వున్న ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయానికి తెలంగాణా ప్రాంతీయుడే ఉప కులపతిగా రావాలట!  
 
           ఇప్పటికే  ఉస్మానియా విశ్వ విద్యాలయాన్ని బ్రష్టు పట్టించిన తెలబాన్ల కన్ను ప్రస్తుతం ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం మీద పడింది.   తమ ప్రాంతాల్లో ఉద్యోగాలు ఎవరు చేయాలో, ఏ సినిమాలు ఆడాలో లేదా అసలు  ఎవరు నివసించాలో లేదా వలస పోవాలో తెలబాన్లు నిర్దేసిస్తున్నప్పుడు ఇంకా రాష్ట్రంలో ప్రభుత్వం ఎందుకు?   రద్దు చేసి గవర్నర్ పాలన పెడితే బాగుంటుంది కదా!