Monday, May 23, 2011

ఎస్ ఆర్ సీ బొమ్మలాట కాదు..

తెలంగాణా చిచ్చుని రగిల్చి ఇప్పటికే రాష్ట్రాన్ని అధో గతి పాల్జేసిన కేంద్రం తాజాగా సార్వత్రిక ఎన్నికల వరకు కాల యాపన చేయటానికి వీలుగా రెండో ఎస్.ఆర్.సీ అస్త్రాన్ని బైటకి తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణా విషయమై ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్న జగన్, చంద్ర బాబు లాంటి వారిని మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టటానికి కాంగ్రేసు కి ఉన్న ఈ అవకాశం జార విడుచుకోదు.  తమ స్వార్ధ పూరిత రాజకీయాల కోసం తెలుగు వారిని చదరంగంలో పావుల్లా వాడుకోవటం, తెలుగు రాష్ట్రాన్ని ఎల్ల వేళలా వంచించటం కాంగ్రెసుకి వెన్నతో పెట్టిన విద్య.  ఇప్పుడు ఎస్.ఆర్.సీ పేరుతొ ఆడ బోయే నాటకం కూడా అదే.  అయితే ఎప్పుడో 1955లోనే ఫజల్ అలీ నేతృత్వంలో ఏర్పడిన మొదటి ఎస్సార్సీ ఇక్కడి పరిస్థితుల్ని కూలంకషంగా అధ్యయనం చేసి తద్వారా ఇచ్చిన నివేదిక ఆధారంగానే విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయ్యింది.  ప్రత్యెక తెలంగాణా, ప్రత్యెక హైదరాబాదు వాదనలు ఎంత డొల్లవో కమిషన్ ఆనాడే కుండ బద్దలు కొట్టింది. ఆ వివరాలన్నీ కమిటీ రిపోర్టు 369 నుండి 389 వరకు గల పేరాలలో వివరంగా చర్చించడం జరిగింది.
http://en.wikipedia.org/wiki/Para_369_to_389_of_SRC

పోనీ అర్ధ శతాబ్దం తరువాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందనుకున్నా..తాజాగా కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ కమిటీ కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటమే అత్యుత్తమ పరిష్కారమంటూ తేల్చి చెప్పింది.  అంతే కాదు. ఝార్ఖండ్, చత్తీస్ గడ్ వంటి చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల మావోయిష్టుల వంటి తీవ్రవాద దళాల చర్యలు పెచ్చుమీరటంతో పాటు రాజకీయ అనిశ్చితి కూడా సంభవమేనని సవివరంగా నివేదించింది. ఇప్పటికైనా కేంద్రం తెలుగు వారి భవిష్యత్తుతో, వారి అభివృద్ధితో ఆటలాడుకోవటం మానాలి.  చేతనైతే సరైన పాలకుణ్ణి పెట్టుకొని సమైక్య రాష్ట్రం అభివృధికి తోడ్పడాలి. లేదా తమ వల్ల కాదనుకుంటే రాష్ట్రపతి పాలన విధించి అభివృది నిరోధకంగా మారిన వేర్పాటు వాదాన్ని తుదముట్టించాలి. లేని పక్షంలో తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు వాడి ఆగ్రహ జ్వాలకి కాంగ్రేసు పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో తుడిచి పెట్టుకు పోవటం ఖాయం.