Wednesday, July 31, 2013

తెలుగు వారందరికీ ఈ రోజు బ్లాక్ డే !

సీమాంధ్ర ప్రాంతీయుల మనో భావాలకి ఏ మాత్రం విలువనివ్వకుండా తెలంగాణా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తీరు అత్యంత ఆక్షేపణీయం ... శ్రీ కృష్ణ కమిటీ నివేదికని తుంగలో తొక్కి ఏక పక్ష నిర్ణయంతో తెలంగాణా రాష్ట్రాన్ని తెలుగు వారి నెత్తిన రుద్దే సాహసం కాంగ్రెస్ పార్టీ చేసిందంటే అందుకు వేరే బయట వారిని ఎవరిని నిందించనవసరం లెదు. ప్రత్యెక రాష్ట్రం సంగతి ఎలా వున్నా తెలుగు వారి పరువు-ప్రతిష్ట, హస్తినా పుర వీధుల్లో దిగ జారి పోయింది అన్నది కఠోర వాస్తవం. మధ్య ప్రదేశ్ కి చెందిన దిగ్విజయ్ సింగ్, కాశ్మీరు కి చెందిన ఆజాద్, కర్నాటక నుంచి వీరప్ప మొయిలీ , కేరళ నుండి వాయలార్ రవి...వీళ్ళా మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించేది ? తెలుగు వారిని ఎంత లోకువ కట్టక పొతె..కనీసం తదుపరి రాజధాని ఏమిటి అన్న ప్రత్యామ్నాయం చూపకుండా రాష్ట్రాని విభజించెసి... మళ్ళీ ఆ రాజధాని కోసం సీమాన్ధ్ర నాయకులని తమ చుట్టూ తిప్పుకోవాలన్న కుతంత్రంతో కాంగ్రెస్ ఆదిస్థానం వ్యవహరిస్తుంది? తెలంగాణా లాగే దేశంలో ఇతర ప్రాంతాల్లో వున్న విభజన వాద ఉద్యమాల విషయంలో కాంగ్రెస్ ఇలాగే ప్రవర్తించే సాహసం చేస్తుందా? ఆయా రాష్ట్రాలు తమ వ్యవహారాల్లో వేలు పెట్టనిస్తాయా? 

మహానుభావుడు ఎన్టీఆర్ ఏనాడో చాటారు..
"ఇంటిలోన అరమరికలు వుంటే ఇల్లెక్కి చాటాలా , కంటిలో నలుసు తీయాలంటే కను గుడ్డు పెరికి వెయాలా.. పాలు పొంగు మన తెలుగు గడ్డను పగల కొట్టవద్దు.... నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చెయద్దు.." 

ఇప్పటికే నవ్వుల పాలు అయి పొయాము.. శాస్త్రీయం గా సర్వే చేసి ఇచ్చిన శ్రీ కృష్ణ కమిటీ నివేదికని చేతిలో వుంచుకొని కూడా దాన్ని పార్లమెంటులో చర్చకు పెట్టే ప్రయత్నం చెయ్యకుండా, హస్తినా పురిలో ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం గా ప్రదక్షిణాలు చేసి పనికిమాలిన స్వంత నివేదికలు అధిష్టానానికి సమర్పించి కాలక్షేపం చేసిన కాంగ్రెస్ నాయకులు, అలాగే క్షంతవ్యం కాని మౌనం వహించి విభజనని అడ్డుకోలేక పోయిన ప్రతిపక్ష నాయకులు కూడా చరిత్ర హీనులుగా మిగిలిపోవటం ఖాయం.