Wednesday, January 29, 2014

నకిలీ బిల్లు పంపితే నకిలీ రాష్ట్రమే ఇవ్వాలి!

(పక్కన ఉన్న చిత్రం ఆగష్టు,2012 నాటిది)
సీల్డ్ కవర్ ముఖ్యమంత్రిగా వచ్చి అధిష్టానం ముందు చేతులు కట్టుకున్న కిరణ్ కుమార్ రెడ్డి గురించి నేను గతంలో ఒక టపా  వేయటం జరిగింది.  అధిష్టానం ముందు చేతులు కట్టుకున్న అదే కిరణ్ కుమార్ రెడ్డి నేడు ఎందుకు తిరగబడ్డారు? ఎందుకంటే తలుపులు మూసి కొడితే పిల్లి అయినా తిరగబడుతుందని తెలిసిందే ! అసలు తెలంగాణా తేనె తుట్టెని కదిపిన 2009 డిసెంబర్ 9 నాడు కేంద్ర హొమ్ మంత్రి ప్రకటనలో ఏం ఉంది? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకి ప్రక్రియని ఆంద్ర ప్రదేశ్ శాసన సభ తీర్మానం ద్వారా  ప్రారంభింప చేస్తామని  సాక్షాత్తు కేంద్ర హొమ్ మంత్రి ఆనాడు ప్రకటించారు.  అంటే రాష్ట్ర విభజన ప్రక్రియ అన్నది రాష్ట్రం లోనే ప్రారంభం కావాలన్న విషయం కేంద్రానికి తెలుసు.   కానీ ఇప్పుడెం జరిగింది? రాష్ట్రంలో ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వం ఉందన్న స్పృహే లేకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో మెజారిటీ ప్రజల అభిప్రాయానికి విలువ లేకుండా సర్వాధికారాలు కేంద్రం చేతులోకి తీసుకొని - రాజ్యాంగం లోని  ఆర్టికిల్ 3 లో రాసి వుంది కదా అన్న అహంకారంతో కేంద్రం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటానికి పూనుకుంది. లక్ష్యాలు, ఆర్ధిక పత్రం వంటివి ఏమీ లేకుండా తప్పుల తడకలతో కూడిన చిత్తు కాగితాల వంటి బిల్లు (?) ని రాష్ట్ర శాసన సభ మొహాన కొట్టి అభిప్రాయం చెప్పమంది.  అదే ఆర్టికిల్ 3 లో రాసి వుంది కాబట్టి రాష్ట్రానికి పంపారు కానీ లేని పక్షంలో ఈ పాటికి కేంద్రమే రాష్ట్ర ప్రమేయం లేకుండా అడ్డగోలు విభజన పూర్తి చేసి పారేసి ఉండేది! అసలు బిల్లా లేక ముసాయిదా బిల్లా అన్నది స్పష్టత లేకుండా ఏదో ఒకటి రాష్ట్రానికి పంపేసి అభిప్రాయం చెప్పమంటే ఎలా కుదురుతుంది?  ఈ విషయాన్నే ముఖ్యమంత్రి సూటిగా ప్రశ్నించారు.   ముఖ్యమంత్రి ప్రశ్నకి స్పందించాల్సిన కేంద్ర హొమ్  శాఖ ఏమీ మాట్లాడక పోయినా కేంద్ర మంత్రి జై రామ్ రమేష్ మాత్రం బుజాలు తడుముకున్నారు.  ముఖ్య మంత్రి నోటీసు పై అసహనం వెళ్లగక్కారు!  అసలీ జై రామ్ రమేష్ ఎవరు?  ఆయన స్వంత రాష్ట్రమైన కర్ణాటకలో ఠికానా లేకపోతె పాముకి పాలు పోసినట్లు రెండు సార్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్య సభకి పంపితే నేడు కేంద్ర మంత్రి హోదా వెలగబెడుతున్నారు.  పాలు తాగి రొమ్ము గుద్దిన రీతిగా తనను ఎన్నుకున్న రాష్ట్రాన్నే ముక్కలు చేయటానికి అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.  మంత్రుల కూటమిలో ఉండి  తప్పుల తడకల బిల్లు తయారీలో ఆయనదే ముఖ్యమైన పాత్ర!  అందుకే ముఖ్యమంత్రి నోటీసు పై కేంద్ర హొమ్ శాఖ కి బదులుగా ఆయనే  బదులిస్తున్నారు.  నకిలీ నోట్ల లాగా నకిలీ బిల్లులు వుండవు అంటూ జైరామ్ రమేష్  చేసిన ప్రకటన వ్యక్తిగత హోదాలో చేసారా లేదా కేంద్రం తరపున చేసారా అన్న ముఖ్యమంత్రి ప్రశ్నకి కూడా సమాధానం లేదు! పైగా ప్రతి వారు రాజ్యాంగ నిపుణులు అవుతున్నారని దుగ్దని వెలిబుచ్చుతున్నారు.  రాష్ట్రపతి పంపిన బిల్లు అంటూ రోజుకి వంద సార్లు నొక్కి వక్కాణించే వేర్పాటు వాదులు కూడా గమనించాల్సిన విషయం ఒకటే!  అన్ని వివరాలతో కూడిన - పార్లమెంటులో ప్రవేశ పెట్టబోయే  సమగ్రమైన బిల్లునె రాష్ట్ర శాసన సభ అభిప్రాయానికి పంపాలి తప్ప లక్ష్య నిర్వచనం లేకుండా,  శాసనాధికారాల బదలాయింపు వివరాలు లేకుండా, ద్రవ్య వ్యవహారాల మోమోరాండం లేకుండా  కొన్ని చిత్తు కాగితాలు పంపి దానినే బిల్లు అనుకోమంటే  ఎలా కుదురుతుంది?  ఆ చిత్తు కాగితాలని చించి వేసిన, తగల పెట్టిన కొంత మంది శాసన సభ్యుల చర్య సరైనదే!    

Sunday, January 26, 2014

కేంద్ర హొమ్ శాఖ ద్వంద్వ ప్రమాణాలు !

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో ఆర్టికిల్ 371 (D) విషయమై అటార్నీ జనరల్ సలహాని కేంద్రం కోరిన విషయం తెలిసిందే.  ఈ విషయంలో అటార్నీ జనరల్ అభిప్రాయం ఏమిటి అన్నది ప్రజానీకానికి  వెల్లడించకుండా కేంద్రం హడావిడిగా బిల్లు తయారు చేసేసి రాష్ట్ర శాసన సభకి పంపేసింది.  ఇదే విషయంలో సమాచార హక్కు చట్టం కింద కేంద్ర హొమ్ శాఖని 2013 డిసెంబర్ 7 వ తేదిన నేను అడిగిన ప్రశ్నలు  ఇవి:   

1.Whether any report has been submitted by the Attorney General of India to the Group of Ministers (GoM) constituted for bifurcation of Andhra Pradesh regarding dealing with status of Article 371 (D) of Constitution of India for bifurcation of the Andhra Pradesh .. 

2.If submitted, what is the report submitted by the Attorney General in this regard and whether GoM has incorporated the suggestion given by the Attorney General in their report ..

49 రోజుల తరువాత నిన్ననే అందిన, కేంద్ర హొమ్ శాఖ తాపీగా ఇచ్చిన సమాధానం ఇది ! 

I am directed to refer to your RTI appiication No....dated 07.12.2013 (received by the undersigned on 10.12.2013) . 

Point no. 1 & 2 : No information is available with the CPIO. 

If you are not satisfied with the reply, you may make an appeal to the First Appellate Authority viz., Shri S. Suresh Kumar, J.S.(CS), Ministry of Home Affairs, NDCC II Bldg., Jaisingh Road, New Delhi. 


అయితే నిన్ననే శాసన సభలో ముఖ్య మంత్రి ప్రసంగిస్తూ ఇదే సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితె - అది privileged information, ఇవ్వటం కుదరదు అని కేంద్రం బదులిచ్చినట్లు సభా ముఖంగా తెలియజెసారు. అంటే ఏదో ఒక విధమైన సమాచారం వారి వద్ద ఉన్నట్లే కదా ! ఒక సామాన్య పౌరుడిగా నేను అడిగితె ఏ విధమైన సమాచారం లేదని బదులిచ్చిన కేంద్ర హొమ్ శాఖ ముఖ్య మంత్రికి వేరే విధంగా సమాధానం చెప్తోందని తేట తెల్లమై పోతోంది. అసలు రాష్ట్ర విభజనకి ఎటువంటి ప్రాతిపదిక లేదని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో విభజనకి సంబంధించిన సమస్త సమాచారం ప్రజలకి తెలియజెప్పి కేంద్రం ముందుకి సాగాలి. రాష్ట్ర విభజన విషయమై వున్న ఒక న్యాయపరమైన చిక్కుముడి విషయంలో ముఖ్యమంత్రికే సమాచారం ఇవ్వటానికి నిరాకరించటం రాష్ట్రాల అధికారాలని కేంద్రం కబ్జా చేయటమే అవుతుంది. అలాగే సామాన్య పౌరులకి సమాచారాన్ని తెలుసుకొనే హక్కుని నిరాకరించటమే అవుతుంది. 

(ఈ విషయంలో కేంద్ర హొమ్ శాఖ నుండి సమాధానం రాకముందే 30 రోజుల మొదటి గడువు ముగిసాక మొదటి అప్పీలు వేయటం జరిగింది. అప్పీలుకి సమాధానం వచ్చాక బ్లాగులో పొందుపరుస్తాను.)

Wednesday, January 22, 2014

హైదరాబాద్ సిర్ఫ్ హమారా!


"1956 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సమయంలో - విశాఖ పట్నంలో రెండు లారీలు ఎదురెదురుగా రాగలిగిన రోడ్లు లెవు..కర్నూలులో సౌకర్యాలు లెవు.. కాకినాడలో భవనాలు లెవు..విజయవాడ, రాజమండ్రి కూడా అంతే!  అందుకే రాజధానిగా హైదరాబాదుని నిర్ణయించారు."  

శాసన సభలో ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన ముసాయిదా బిల్లు పై చర్చ సందర్భంగా పిల్ల వేర్పాటువాద నాయకుడు వాక్రుచ్చిన పలుకులివి! 

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక హైదరాబాదు సంస్థానాన్ని భారత్ లో  విలీనానికి నిరాకరించి, మన దేశానికి వ్యతిరేకంగా ఐక్య రాజ్య సమితికి వెళ్ళిన ఘన చరిత్ర గలవారు నిజాములు! అటువంటి నిజాములని కేవలం  కొన్ని భవనాలని నిర్మించినందుకే  అభివృద్ది చేశారంటూ  వేర్పాటు వాదులు కీర్తిస్తున్నారు. ఆ భవనాల కోసమే ఆంధ్ర ప్రదేశ్ ని ఏర్పాటు చేసారంటూ చరిత్ర ని వక్రీకరిస్తున్నారు.   అలాగయితే ప్రస్తుతం భారత దేశం పరిపాలన సాగిస్తున్న పార్లమెంటు భవనం, రాష్ట్రపతి భవనం, సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ వంటి ఎన్నో భవనాలు బ్రిటిష్ వాడు కట్టి ఇచ్చాడు.  అందుకని వారిని కీర్తించి వారిని నెత్తిన పెట్టుకుంటామా ?    మొదటి ఎస్ఆర్సి సూచనల మేరకు ఒక భాషాప్రయుక్త రాష్ట్రంగా తెలుగు వారి కోసం  ఆంధ్ర ప్రదేశ్ రాష్టం ఏర్పడింది.  అంతే తప్ప నిజాము అభివృద్ది చేసిన హైదరాబాదు కోసం రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదు.  ఇది చరిత్ర !  ఆ తరువాత ఏం జరిగింది ?  రాష్ట్రంలోని 23 జిల్లాల ప్రజలు తమ రాజధాని అన్న అభిమానంతో 50 సంవత్సరాలకు పైగా అనుబంధం పెంచుకోవటమే గాక తమ ఆర్ధిక వనరులు సమీకరించి, రక్తం చెమట చిందించి, మేధస్సులు రంగరించి సర్వతోముఖంగా హైదరాబాదు నగరాన్ని అభివృద్ది చేసిన విషయం అక్షర సత్యం.   పరిశ్రమలైన, వ్యాపారాలైనా, విద్యా సంస్థలైనా, ఇతరత్రా అన్ని రంగాల్లోనూ ఇన్నేళ్ళలో రాష్ట్రంలో అభివృద్ది అంతా హైదరాబాదు చుట్టూ కేంద్రీకృతమై వున్నది అన్నది వాస్తవం.    అవుటర్ రింగు రోడ్డైనా, అన్ని హంగులతో వున్న అంతర్జాతీయ విమానాశ్రయమైన, ఇంకా మెట్రో రైల్ పదకమైనా ఆంధ్ర ప్రదేశ్ లో మరెక్కడా కాక ఇక్కడే ఎందుకు అమలు పరచారు? ఎందుకంటే ఈ వసతులన్నీ 23 జిల్లాల వారికీ పనికి వస్తాయని,ఉపయోగపడతాయని!  అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువకాలం సీమాంధ్రులే ముఖ్య మంత్రులుగా ఉన్నా, వారి ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురి అయినా,  రాజధాని అభివృద్ది మాత్రం  ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగింది.  రాష్ట్రంనుండి అయ్యే సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో 98 శాతం కేవలం హైదరాబాదు నగరం నుండే జరుగుతున్నాయని శ్రీకృష్ణ కమిటీ నివేదించటం దీనికి తార్కాణం.  ఇంత వరకు కూడా చరిత్రే!  కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది?  భారత దేశంలో ఇంతవరకు ఎప్పుడూ జరగని రీతిలో-  అభివృద్ది చెందిన రాజధానిని కబ్జా చేస్తూ రాష్ట్రంగా విడిపోవటానికి ఉద్యమాలు చేస్తే -  ఆ  వేర్పాటు వాదులతో కుమ్మక్కు అయి, ఆర్టికిల్ 3 ని దుర్వినియోగం చేస్తూ కేంద్రం రాష్ట్ర విభజనకి హడావిడిగా పరుగులు పెట్టటం జరుగుతోంది.   హైదరాబాదు నగరానికి సరైన ప్రత్యామ్నాయం చూపకుండా, కనీసం అవశిష్ట రాష్ట్రానికి  రాజధాని ఎక్కడ అన్నది కూడా నిర్ణయించకుండా - సీమాంధ్ర ప్రయోజనాలని పూర్తిగా విస్మరిస్తూ కేంద్రం వ్యవహరిస్తోంది.  కెవలం  భౌగోళికంగా తెలంగాణా ప్రాంతంలో ఉన్నంత మాత్రాన  ఉమ్మడిగా అభివృద్ది చెందిన  హైదరాబాదుని తెలంగాణాకి కట్టబెడతామంటే సీమాంధ్ర సహించదు.  హైదరాబాద్ సిర్ఫ్ హమారా!  హైదరాబాద్ మీది, మాది, మనందరిది.. మన తెలుగు వారందరిది..  

Wednesday, January 1, 2014

ఎందుకంత కాకి గోల ?

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే దేశంలో ఉన్న అనేక సంస్థానాలని భారత యూనియన్ లో కలిపే క్రమంలో,  మన దేశంలో కలవటానికి మొరాయిస్తున్న సంస్థానాలని దారికి తేవటానికి రాజ్యాంగంలో ఆర్టికిల్ 3 అన్నది ప్రవేశ పెట్టబడింది.   బలమైన ఆ అధికరణ ఆనాడు ఉండబట్టే సంస్థానాల విలీనం అన్న ప్రక్రియ సజావుగా జరిగింది. అయితే ఇప్పుడు మన రాజ్యాంగంలో ఆర్టికిల్ 3 ఎందుకు చేర్చారో, ఆ అధికరణ ఏ పరిస్థితిలో చేర్చవలసి వచ్చిందో అన్న చారిత్రిక ప్రాతిపదిక తో నిమిత్తం లేకుండా,  రాజ్యాంగంలో రాసి వుంది కదా అన్న ధీమాతో -  రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న  ప్రభుత్వమే అన్నది లేనట్లుగా కేంద్రమే సర్వాదికారాలని చేతిలోకి తీసుకొని తమ ఇష్టానుసారం విభజన ప్రతిపాదిస్తే రాష్ట్రం/రాష్ట్ర ప్రజలు ఆమోదించాలా ? పైగా శాసన సభ ఆమోదించినా లేక పోయినా కూడా తాము అనుకున్నట్లు విభజించి తీరుతాం అని కేంద్రం మొండికేస్తే ఇక ఫెడరల్ స్ఫూర్తి ఎక్కడ ఉన్నట్లు?  ఒక ప్రాంతంలో విభజన లేదా విలీనం వంటి చర్యలు తీసుకోవాలంటే ఆ ప్రాంతం/రాష్ట్ర శాసన సభ నుండి ప్రతిపాదన వస్తే అప్పుడు కేంద్రం ఆర్టికిల్ 3 కింద తనకి వున్న అధికారంతో విభజన/విలీనం ప్రక్రియని మొదలు పెట్టాలి. అంతే కాదు,  అటువంటి ప్రక్రియ మొదలు పెట్టే ముందు  ఆయా ప్రాంతాల సంపూర్ణ అంగీకారం ఉందా లేదా అన్న విషయం ద్రువీకరించుకొనే కేంద్రం అడుగు ముందుకు వెయ్యాలి.  కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలన్నీ ఆ పద్ధతిలోనే  ఏర్పడ్డాయి.  అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా  - రాష్ట్ర శాసన సభ ప్రమేయమే లేకుండా కేంద్ర నిరంకుశ నిర్ణయాన్ని రుద్దే రీతిన కొనసాగుతోంది.  విచిత్రం ఏమిటంటే విభజన వాదులకి ఈ తతంగం అంతా అప్రజాస్వామికం అని అస్సలు అనిపించదు. కానీ తన మంత్రివర్గంలోని మంత్రుల శాఖలను పునర్వ్యవస్థీకరించె అధికారం ముఖ్యమంత్రికి ఉన్నా కూడా, శ్రీధర్ బాబు శాఖను మార్చటం ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసేసినట్లు తెలంగాణా నాయకులు నానా యాగీ చేయటం  అర్ధ రహితం. ముఖ్య మంత్రి అధిష్టానాన్ని దిక్కరించటం అన్నది  వేర్పాటు వాదుల దృష్టిలో ఎంత పెద్ద నేరమో - ముఖ్యమంత్రి అభీష్టానికి విరుద్ధంగా శ్రీధర్ బాబు వ్యవహరించటం కూడా అంతే  పెద్ద నేరం! ముఖ్య మంత్రి గారు సరైన సమయంలో సరైన నిర్ణయమే తీసుకున్నారు!