Monday, December 31, 2012

"అమానత్" వివరాలు వెదకకండి !

2012  సంవత్సరం అత్యంత విషాదకర సంఘటన తో ముగుస్తోంది.. 13 రోజుల పోరాటం అనంతరం ఢిల్లీ అత్యాచార బాధితురాలు కన్ను మూసింది... ఆమె కుటుంబానికే గాకే యావత్ దేశానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అసలు విషాద సంఘటన కన్నా మీడియా వాళ్ళు వచ్చి కాకుల్లా పొడుచుకు తినే ప్రశ్నలకి సమాధానాలు చెప్పటమే ఆయా కుటుంబ సభ్యులకి వేదన గా సంభవిస్తుంది. ఇక్కడ గుడ్డిలో మెల్ల లాంటి విషయమేమిటంటే-- ప్రభుత్వ ఆంక్షల వల్ల కావచ్చు, లేదా స్వయం నియంత్రణ కావచ్చు..వారి వ్యక్తిగత వివరాల జోలికి ఏ మీడియా కూడా తొంగి చూడలేదు.  అమానత్, నిర్భయ, దామిని వంటి మారు పేర్లతోనే సమాచారం అందించారు తప్ప వారి వ్యక్తిగత వివరాలు గోప్యంగా వుంచటం హర్షణీయం ఇంకా అభిలషణీయం కూడా.
జరిగిన దారుణానికి పరిహారంగా లక్షల రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగాలని డిల్లీ, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి కానీ అదే సమయంలో వారి గోప్యత కి భంగం వాటిల్లకుండా కూడా సరైన చర్యలు తీసుకోవటం అత్యంత ఆవశ్యకం.   అలాగే నిందితులకి విధించాల్సిన శిక్ష విషయంలో కూడా ఫేస్ బుక్ లో నేను చూసిన ఒక సూచన..
"If Government can send the victim to Singapore for better treatment, I strongly suggest they should send the accused to Saudi Arabia for better justice !!"
నిజమే కదా! మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని సింగపూర్ తరలించిన ప్రభుత్వం..మెరుగైన న్యాయం కోసం నిందితులని సౌదీ అరేబియా కి అప్పగిస్తే బాగుంటుంది..


Sunday, December 9, 2012

ఆంధ్రావనికి నేడు విద్రోహ దినం..


పచ్చగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం భగ్గుమనటం మొదలై నేటికి మూడేళ్ళు! కేంద్రం లోని యూపీఏ ప్రభుత్వానికి ఆక్సిజన్ లాగా 32 మంది ఎమ్పీలని అందించిన ఆంధ్ర రాష్ట్రానికి మేడం జన్మ దిన కానుకగా ఇచ్చిన మర్చి పోలేని కానుక ఇది....దొంగ దీక్షలకి మోస పోయి, తెలుగు వారిని విడ దీద్దామని ప్రకటించి భంగ పడిన రోజు ఇది.... పర్యవసానాలు ఆలోచించకుండా తెలుగు జాతిని ముక్కలు చేసే ప్రకటన చేసి, ఆనక వెనక్కి తీసుకొని తద్వారా రాష్ట్రాన్ని ఉద్యమాల ఊబిలోకి దించి..తెలుగు ప్రజలందరికీ కష్ట నష్టాలని కలుగ జేసిన కాంగ్రెస్ పార్టీ నేడు మళ్ళీ అఖిల పక్షం అన్న నాటకానికి తెర లేపింది. ఎఫ్ డీ ఐ బిల్లు ఆమోదం పొందటంలో ఎటువంటి ఆటంకం రాకుండా ఉండటానికే తెలంగాణా ఎంపీ లని బుజ్జగించటం కోసం, రాష్ట్రంలో చల్లారిన వేర్పాటు వాదాన్ని మళ్ళీ రగిలించటానికి అఖిల పక్షం డ్రామాని మొదలు పెట్టింది. అసలు రాష్ట్రాన్ని విడ గొట్టాలా ఒద్డా అన్నది నిర్ణయించటానికి రాజకీయ పార్టీలకి వున్న హక్కు ఏమిటి? రాష్ట్రమంటే కేవలం రాజకీయులే కాదు...అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాల్ని పరిగణన లోకి తీసుకోవాలి. రాష్ట్రంలోని అన్ని వర్గాలతో విస్తృతంగా చర్చలు జరిపి, కూలంకషంగా పరిశోధించి ఇచ్చిన శ్రీ కృష్ణ కమిషన్ నివేదిక ఏమైంది? శ్రీకృష్ణుడు నివేదించిన నివేదికలోని ఆరో అత్యుత్తమ పరిష్కారాన్ని అమలు చేయటానికి రాజకీయ పార్టీలకి అభ్యంతరాలేమిటి?  కేవలం వోటు బ్యాంకు రాజకీయాలు తప్ప మరేమీ కాదు. 2014 లో తాము  ఎలాగు అధికారంలోకి రామని నిర్ణయించేసుకున్న కాంగ్రెస్ పార్టీ, ఈలోగా రాష్ట్రాన్ని వీలైనంతగా తగల పెట్టి వెళ్ళాలనే కుట్రని అమలు జరుపుతోంది. రాష్ట్రంలోని ప్రతి పధకానికి ఇందిరా, రాజీవ్ పేర్లని మోస్తున్న తెలుగు ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న కానుక ఇది. కనీసం ఒక్క పధకానికైనా లేదా పర్యాటక ప్రాంతానికైనా మన తెలుగు ప్రధాని పీవీ పేరు ఉందా? ప్రాంతాలకి అతీతంగా ఈ కుట్రని ఎదుర్కోవాల్సిన అవసరం తెలుగు వారందిరికీ ఇప్పుడు వుంది...కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమె కాదు..విభజన వాదం పేరుతొ రాజకీయాలు చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్న రాజకీయులందరినీ తరిమి కొట్టి తెలుగు వారు తామంతా ఒక్కటే అని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఇప్పుడు వుంది.
లేని పక్షంలో బ్రిటిష్ వారికన్నా అధ్వాన్నంగా డివైడ్ అండ్ రూల్ పాలసీ ని అమలు పరుస్తున్న కాంగ్రెస్ రాజకీయాలకు బలైన చరిత్ర హీనులుగా మనం మిగిలి పోతాం. 


Sunday, November 11, 2012

ముదురుతున్న తెలబాన్ పైత్యం..

ఒక విశ్వ విద్యాలయానికి ఉప కులపతిని ఎలా నియమిస్తారు...? 
  విద్యార్హతలు, అనుభవం, సీనియారిటీ తదితర అంశాలు చూసి నియమిస్తారు --  కానీ ఏ ప్రాంతానికి చెందిన వాడు అని కాదు.
            బుర్రలో గుజ్జు వున్న ఎవరికైనా ఈ విషయంలో సందేహం అనేది రాదు.   కానీ తెలబాన్ల రూటే వేరు!  భౌగోళికంగా తెలంగాణా ప్రాంతంలో వున్న ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయానికి తెలంగాణా ప్రాంతీయుడే ఉప కులపతిగా రావాలట!  
 
           ఇప్పటికే  ఉస్మానియా విశ్వ విద్యాలయాన్ని బ్రష్టు పట్టించిన తెలబాన్ల కన్ను ప్రస్తుతం ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం మీద పడింది.   తమ ప్రాంతాల్లో ఉద్యోగాలు ఎవరు చేయాలో, ఏ సినిమాలు ఆడాలో లేదా అసలు  ఎవరు నివసించాలో లేదా వలస పోవాలో తెలబాన్లు నిర్దేసిస్తున్నప్పుడు ఇంకా రాష్ట్రంలో ప్రభుత్వం ఎందుకు?   రద్దు చేసి గవర్నర్ పాలన పెడితే బాగుంటుంది కదా! 

Sunday, October 28, 2012

బ్రాహ్మణులని అపహాస్యం చేయటానికి "దేనికైనా రెడీ"

ఉత్తర భారత దేశంలో సర్దార్జీ ల పై ఎన్ని జోకులు, సెటైర్లూ వున్నాయో, దక్షిణ భారతంలో బ్రాహ్మణుల పై  అన్నే వున్నాయి. అయితే హాస్యం హద్దులు దాటనంత వరకు ఆస్వాదించి ఆనందించ వచ్చు కానీ అప హాస్యం స్థాయికి చేరితే వికటిస్తుంది.  వరుస ఫ్లాపులతో కొట్టు మిట్టాడుతున్న తన కొడుకు విష్ణు తో మోహన్ బాబు తీసిన "దేనికైనా రెడీ" సినిమా విషయంలో ఇదే జరిగింది..అసలు ఈ సినిమా దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి గతంలో తీసిన "సీమ శాస్త్రి"  కూడా బ్రాహ్మణ వర్గం పై పైత్యం వెళ్ల గక్కినా, ప్రేక్షకులు ఆదరించారు. దాంతో ఆ పైత్యం ఇంకా ముదిరి మోహన్ బాబు తో కలిసి దేనికైనా రెడీ అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.  ఇటువంటి వికృత హాస్యం తో కూడిన సినిమాకి సెన్సార్ సమస్య రావటంలో ఆశ్చర్యమేమీ లేదు! ఇంకా సెన్సార్ అధికారిణి దయతో చేసిన కటింగుల వల్ల ఆ వికృత హాస్యానికి కొంతైనా బ్రేక్ పడింది.. కానీ సెన్సార్ బోర్డు పై నానా రభస చేసి, సెన్సారు అధికారిణి ధనలక్ష్మి ని నానా దుర్భాషలాడి, సెన్సారు సర్టిఫికేట్ మోహన్ బాబు పొందటం చూస్తె నోరు గల వాడిదే రాజ్యం అని తేలుతోంది..సెన్సారు బోర్డు ఆమోదించి సర్టిఫికేట్ ఇచ్చాక, కెమెరామన్ గంగ తో రాంబాబు చిత్రం విషయంలో తెలబాన్లు ప్రతిపాదించిన అర్ధం పర్ధం లేని కటింగులని చిత్రం నుండి తొలగించటం కూడా వారి నోటికి జడిసే అన్నది సత్యం...అయినా ఏనాడో తన అసెంబ్లీ రౌడీ చిత్రం లోనే పంతులూ పంతులూ పావు శేరు మెంతులూ అంటూ బ్రాహ్మణులని వెటకారం చేసే పాట పెట్టిన మోహన్ బాబు నించి ఇంతకంటే గొప్ప కళా ఖండం ఆశించటం అవివేకం... "వినాశ కాలే విపరీత బుధ్ధి"....

Friday, October 19, 2012

తెలబాన్ ఆగడాలు ఇంకెన్నాళ్ళు?

తెలంగాణా మార్చ్ హంగామా ఘోరంగా విఫలమయ్యాక తెలబాన్ల కన్ను ప్రస్తుతం పూరీ జగన్నాధ్ సినిమా పై పడింది.  తాజాగా విడుదలైన "కెమరామన్ గంగ తో రాంబాబు" చిత్రం  లో  తెలంగాణా వ్యతిరేక సన్నివేశాలు వున్నాయంటూ దర్శకుని కార్యాలయం ద్వంసం చేసారు. ఆ సినిమా తెలంగాణలో ఆడనివ్వమని హెచ్చరికలు చేసారు.  ఇంకా దర్శకుడు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసారు.   ఇక్కడ ఒక విషయం గమనించాలి. అసలు చలన చిత్రాలకి ప్రభుత్వం నియమించిన సెన్సార్ బోర్డు ఎందుకు వుంది? ఒక చిత్రాన్ని విడుదలకి ముందే బోర్డు నిర్ణయించిన సభ్యుల బృందం నిశితంగా పరిశీలించి ఆ చిత్రం లో అశ్లీలకర, అభ్యంతరకర సన్నివేశాలు లేవని సంతృప్తి చెందాకే సర్టిఫికేట్ జారీ చేస్తారు. సెన్సార్ స్వయంగా సర్టిఫికేట్ ఇచ్చాక మళ్ళీ ఈ తెలబాన్ల సెన్సారింగ్ ఏమిటి?   గతం లో కూడా తెలబాన్లు చాల చిత్రాల పై అనవసర హంగామా చేసి అడ్డుకున్న చరిత్ర వుంది. వారి వసూళ్ళ కోసమే ఈ హంగామాలు అన్నది బహిరంగ రహస్యం. తెలుగు సినిమాల పాలిట శాపంగా ఈ తెలబాన్ ఉద్యమం పరిణమించింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. సీమాంధ్రులని దుమ్మెత్తి పోస్తూ "జై బోలో తెలంగాణా" వంటి చిత్రాన్ని తీసినా... ఇంకా ఆ వేర్పాటు వాద చిత్రానికి "జాతీయ సమైక్యతా" బహుమతి ఇచ్చినా కూడా సీమాంధ్రులు నోరు మెదపకుండా విజ్ఞత చూపించారు.  ఇక ఈ సినిమాలో తెలబాన్లు చెప్పిన దృశ్యాలు తొలగించినా లేదా తెలబాన్లకి భయ పడి దర్శక నిర్మాతలు క్షమాపణలు చెప్పినా అది ప్రభుత్వానికే అవమానం.  ఇకనుండైనా తెలుగు సినిమాలు తెలబాన్ల బారిన పడకుండా రక్షించాలంటే ప్రభుత్వం ముందున్నవి రెండే మార్గాలు-- ఒకటి..సెన్సారు క్లియరేన్సు సర్టిఫికేట్ ఇచ్చాక కూడా కావాలని చేసే ఇటువంటి ఆగడాలని పోలీసు చర్యల ద్వారా సమర్ధవంతంగా అణచి వేయటం....లేదా..రెండు...అంత చేవ లేకపోతె, తెలబాన్ల తో ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి, ప్రతి సినిమా ముందు వాళ్లకి చూపించి, వాళ్ళు సరే అన్నాక విడుదలకి అనుమతించటం...

Wednesday, October 17, 2012

ప్రధాని తెలబాన్లకి భయపడ్డారా?

జీవ వైవిధ్య సదస్సుకి హాజరైన ప్రధాని మన్మోహన్ సింగ్ బేగం పేట విమానాశ్రయం నుండి వాయు మార్గంలో సదస్సుకి చేరి తిరిగి వాయు మార్గంలో నే తిరిగి వెళ్ళటం తమకి భయపడే అని తెలబాన్లు జబ్బలు చరుచుకుంటున్నారు.   భారత ప్రధాన మంత్రి హోదాలో ఒక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకి హాజరయ్యే సమయంలో ఆశుద్దం మీద రాయి వేసినట్లు తెలబాన్లతో బురద జల్లించుకుంటారా?   తన హోదాకి తగ్గట్లే భద్రతా ఏర్పాట్లు చేయించుకున్నారు. రాజ మార్గంలో వచ్చి వెళ్లారు. అయినా తమని సదస్సు వద్దకి రానీయలేదనీ, తమ మీడియాని అడ్డుకున్నారనీ ఒక కంటితో వల వలా ఏడుస్తూనే మరో పక్క ప్రధాని తమకి భయ పడి పారి పోయారని బీరాలు పలకటం తెలబాన్లకే చెల్లింది!

Sunday, October 14, 2012

నందులు నవ్వి పోతున్నాయి!

 మన రాష్ట ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులకి ప్రాధాన్యత, పవిత్రత ఏనాడో గంగలో కలిసాయి. రాజకీయ కారణాల వల్లో లేదా సిఫార్సుల వల్ల మాత్రమె ఈ అవార్డులు ఇస్తున్నారన్నది నిష్టుర సత్యం.   తాజాగా 2011 సంవత్సరానికి నంది అవార్డులు ప్రకటించారు.  బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీ రామ రాజ్యం ఉత్తమ చిత్రం గా ఎంపిక గావటంలో ఎటువంటి సందేహాలకి ఆస్కారం లేదు. అయితే ఆ ఉత్తమ చిత్రానికి పనిచేసిన దర్శకుడు ఉత్తమ దర్శకుడు కాక పోవటమే వింత!    హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే.... పచ్చగా, సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని ఉత్తి పుణ్యానికి ముక్కలు చేయమనే తెలంగాణా ఉద్యమం ఆధారంగా తీసిన "జై బోలో తెలంగాణా" ఉత్తమ జాతీయ "సమైక్యతా" వాద చిత్రమట! ఆ సినిమా దర్శకుడు ఉత్తమ దర్శకుడట!  
 ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో తెలంగాణా మూలాలు కలిగిన సినిమాలకి అవార్డులు కట్టబెట్టటం వెనుక ఉన్న ఆంతర్యం చిన్న పిల్ల వాడిని అడిగినా చెప్పేస్తాడు.   జ్యూరీ సభ్యులు ఎవరి మెప్పును పొంద గోరి ఈ అవార్డులు ప్రకటించారో లేదా ఎవరి చెవుల్లో పూలు పెట్టాలనుకున్నారో అర్ధం కాదు.   ప్రైవేటు సంస్థలు ఇంకా చాలా అవార్డులు ప్రకటిస్తూ, ఇస్తూ వుంటాయి. అవి ఎవరికి, ఎందుకు ఇచ్చారన్నది మనకి అనవసరం. కానీ ప్రభుత్వ పరంగా ఇస్తున్న అవార్డుల విషయంలో వివాదాలకి తావు లేకుండా వ్యవహరించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వం విస్మరించటం శోచనీయం.  

Sunday, October 7, 2012

దసరా పండక్కి తెలంగాణా ! తెలబాన్లూ పండగ చేసుకోండి.....

మిలియన్ మార్చ్ సందర్భంగా ధ్వంసమైన విగ్రహాల స్థానంలో టాంకు బండ్ మీద తెలంగాణా వారి విగ్రహాలే పెట్టాలని తెలబాన్ బిడ్డ కవిత ఆందోళన చేసింది. మంచిదే. కానీ ఒక్క విషయం తెలబాన్ల పీత బుర్రలకి ఏ మాత్రం అర్ధం కావటంలేదు. హైదరాబాదు అన్నది సమైక్యాన్ధ్రకి రాజధాని. ఇక్కడ అన్ని ప్రాంతాల వారికీ సమాన హక్కులు వుంటాయి. భౌగోళికంగా తెలంగాణా ప్రాంతంలో ఉన్నంత మాత్రాన వారి పంతమే చెల్లాలనుకోవటం మూర్ఖత్వం.
 అలాగే మధు యాష్కీ కూడా అంతే ! దమ్ముంటే సమైఖ్య ఆంధ్ర కోసమే సీమాంధ్ర ఎంపీ లు రాజీనామా చేయాలని సవాల్ విసురుతున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రం సమైక్యంగానే వుంది.  ఉంటుంది........ఉత్తి పుణ్యానికి రాజీనామాల డ్రామాలాడేసి, మళ్ళీ వాళ్ళే అక్కడే గేలిచేసి,  ప్రజా ధనాన్ని వృధా చేసి పదవులు పట్టుకుని వేళ్ళాడే కుసంస్కారం తెలబాన్లదే !
 
కొస మెరుపు:
హస్తినా పురి కలుగులోంచి నెల తర్వాత బైటకి వచ్చిన పిట్టల దొర దసరాకే తెలంగాణా అని ప్రకటించేసాడు. సీమాన్ధ్రులు రాజధాని కోసం కూడా వెతుకుతున్నారుట !
 
  ఇంత హంగామా జరుగుతుంటే వాయలార్ రవి వేరీజ్ తెలంగాణా అని అడుగుతాడా?   అయినా కచరా స్వయంగా ప్రకటించేసాక ఇంక ఈ వాయలార్ రవి వంటి వాళ్ళూ, కేంద్రం ఏమనుకున్నా లెక్క లేదు. తెలబాన్లూ దసరా సంబరాలు మొదలు పెట్టుకోండి...

Monday, October 1, 2012

తొండ ముదిరిన తెలబాన్ తీవ్ర వాదం..


అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం మరొక్క రోజులో వుండగా తెలంగాణా మార్చ్ కి అనుమతి ఇవ్వటం ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు. తెలంగాణా ప్రాంత మంత్రుల ఒత్తిడికి తలొగ్గి తాను చేసిన తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం భారీ మూల్యాన్నే చెల్లించుకోవలసి వచ్చింది. అంతే కాదు, అంతర్జాతీయ ప్రతినిధుల ముందు మొహం చెల్లని పరిస్థితి కూడా దాపురించింది.  చిత్తు కాగితాల్లాంటి హామీ పత్రాల్ని తీసుకుని మార్చ్ కి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, ఈ రోజు జరిగిన విధ్వంసానికి బాధ్యత ఎవరి మీద వేస్తుంది? నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్, జల విహార్ ప్రాంతాల్లో జరిగిన ఆస్తి నష్టం ఎవరి జీతాల్లోంచి వసూలు  చేస్తుంది?   అనుమతి కోసం దేబిరించిన తెలంగాణా మంత్రుల జీతాలనుండా లేక అప్పనంగా జీతం తీసుకుంటూ ఉద్యమం లో తిరుగుతున్న కోదండ రాం నుంచా?  
వెన్నెముక లేని ప్రభుత్వం కవాతు కి అనుమతి ఇవ్వటంతోనే తమ అసలు రంగుని తెలబాన్లు బయట పెట్టారు. తెలంగాణకి రోడ్ మాప్ ఇవ్వందే కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్న తెలబాన్ గుంపులని ప్రభుత్వం తరిమి కొట్టలేక పోయినా, వరుణ దేవుడు తరిమి కొట్టాడు.  అనుమతించిన సమయం దాటినా కూడా తెలబాన్ గుంపులు కదలక పోవటంతోనే సీమాంధ్ర ప్రాంతాల్లో అలజడులు మొదలై పోయాయి. మానవ హారాలు, పోటీ కవాతులు జరిగాయి. రాష్ట్రం మళ్ళీ కల్లోలం దిశగా పయనిస్తోంది. ఇంక ఎంత మాత్రం ఉపేక్షించటానికి వీల్లేదు. తెలంగాణా ఉద్యమం అన్నది ఉన్మాద స్థాయిని దాటింది.... వేర్పాటు వాదం తీవ్ర వాద హద్దులు చేరింది.... మరో బ్లూ స్టార్ ఆపరేషన్ వంటిది నిర్వహించి వేర్పాటు (తీవ్ర) వాదాన్ని ఉక్కు పాదంతో అణచి వేయందే మన రాష్ట్రానికి ప్రశాంతత వుండదు...అభివృద్ది అన్నది దరి చేరదు. అంత వరకూ ఎటువంటి అంతర్జాతీయ సదస్సులూ, సమ్మేళనాలూ నెత్తినెత్తుకోకుండా వుంటే మన పరువు కొంతైనా నిలబడుతుంది...

Saturday, September 29, 2012

తెలంగాణా మార్చ్..ఓ కోతి కొమ్మచ్చి..!



మిలియన్ మార్చ్ పేరుతొ తెలబాన్ మూకలు సాగించిన విధ్వంసం ఇంకా మన స్మృతి పధం నుండి చెరిగి పోక ముందే తెలంగాణా మార్చ్ పేరుతొ తెర లేపనున్న మరో ఉన్మాదానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వటం అభ్యంతరకరం.  దయ్యాలు వేదాలు వల్లించిన చందంగా తెలబాన్ నేతలు ఇచ్చిన హామీ పత్రాలని నమ్మి ఈ కవాతుకి అనుమతి ఇవ్వటం అర్ధం లేని పని.
  గతంలో మిలియన్ మార్చ్ సందర్భంగా జరిగిన విధ్వంస కాండకి సీమాంధ్రుల మనసులు గాయ పడ్డా, విశాలాంధ్ర హితాన్ని దృష్టిలో వుంచుకొని సరి పెట్టుకొన్నారు. ఇక ఇప్పుడు కవాతు పేరుతొ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే, రాబోయే పరిణామాలకి ప్రభుత్వమే నేరుగా బాధ్యత వహించాలి.  తెలంగాణా ప్రాంత మంత్రులు కూడా తాము 23 జిల్లాలతో కూడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మంత్రులమన్న సంగతి మరిచి సంకుచిత భావాలతో ప్రాంతీయ  విద్వేషాలకి  ఆజ్యం పోయటం సహించరానిది.   తెలబాన్ గుంపులు కూడా ఎంత సేపూ 800 మంది తెలంగాణా కోసం (?) ఆత్మ హత్యలు చేసుకున్నా రాష్ట్రం ఇవ్వటం లేదని ఆక్రోశిస్తాయే తప్ప, ఆ మరణించిన వారిలో కనీసం మధ్య తరగతి రాజకీయ నాయకుడొక్కడైనా ఉన్నాడా అని ఆలోచించరు.  ఇక, కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆంధ్ర ప్రదేశ్ పట్ల ఎప్పుడూ సవతి తల్లి ప్రేమే.....అందుకే కాంగ్రేసు నాయకత్వం తప్పుడు సమాచారంతో ముందు వెనుకలు ఆలోచించకుండా ముందు డిసెంబర్ 9 ప్రకటన చేసేసి, ఆనక అడుసు తొక్కనేల అన్న చందంగా డిసెంబర్ 23  ప్రకటన కూడా చేసేసి, రాష్ట్రాన్ని రావణ కాష్టం లోకి నెట్టింది.  కేంద్రం ఆడించే తోలు బొమ్మలే కాంగ్రెస్ హయాంలో ఇక్కడ పరిపాలన సాగిస్తాయన్నది జగమెరిగిన సత్యం. అటువంటప్పుడు సాక్షాత్తూ కేంద్ర కాంగ్రెస్ ప్రతినిధి వాయలార్ రవి "వేరీజ్ తెలంగాణా?" అన్నప్పుడే కేంద్ర కాంగ్రెస్ ఆంతర్యం అవగతమై పోతుంది.   మరి ఇంకెందుకీ కవాతులూ..కోతి కొమ్మచ్చులూ?

Tuesday, September 18, 2012

భావ దాస్యం - భారతీయ మీడియా జన్మ హక్కు!

ఏనాడో అమెరికాలో వాటర్ గేట్ కుంభ కోణం జరిగింది. దాన్ని అమెరికన్లు మర్చి పోయి కూడా వుంటారు. కానీ మన భారతీయ మీడియా మాత్రం మర్చి పోదు.   తాజాగా మన దేశంలో జరిగిన బొగ్గు గనుల కుంభ కోణానికి 'కోల్ గేట్" అని పేరు పెట్టి నిత్యం మన మీడియా జపిస్తోంది.  అలాగే సినిమా రంగానికి సంబంధించి కూడా అదే వరుస! సినిమా రంగానికి హాలీవుడ్ ప్రసిద్ది చెంది ఉండ వచ్చు.. అంత మాత్రాన మన హిందీ చలన చిత్ర రంగాన్ని "బాలీవుడ్" అని ఉటంకించక పొతే ఉనికి ఉండదా?   పోనీ ఈ పైత్యం అక్కడితో ఆగిందా అంటే అదీ లేదు. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ అంటూ అన్ని భాషలకీ విస్తరించేసింది! ఇంతగా ఐడేన్టిటీ క్రిసిస్ లో కొట్టు మిట్టాడటం అవసరమా?  పాశ్చాత్య    నాగరికతలు కళ్ళు కూడా తెరవని దశలో, ఉజ్వలమైన ఆర్య నాగరికత పరిఢవిల్లిన దేశమేనా మనది?

Saturday, August 25, 2012

తెలుగు వాడి పౌరుషం ఎప్పుడో చచ్చి పోయింది!

కేంద్రం లో యూ పీ ఏ ప్రభుత్వానికి ఆక్సిజన్ లాగా 33 మంది ఎమ్పీలని అందించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి కేంద్ర మంత్రి ముందు ఏ భంగిమలో ఉన్నాడో చూడండి...ఒక పక్క రైల్వే సౌకర్యాలన్నీ ఇతర రాష్ట్రాల వాళ్ళు తన్నుకు పోతూ మనకి ముష్టి విదిలిస్తున్నా అడిగే దిక్కు లేదు...అలాగే కనీసం మన సొంత గ్యాస్ కూడా మనం వాడుకునే స్వాతంత్ర్యం లేదు.. (మన గ్యాస్ ని గద్దలా తన్నుకు పోదామని ప్రయత్నించినపుడు  పెట్రోలియం శాఖ  మంత్రి  మన  వాడే!)  ప్రజల బాగోగులు చూడటం ఏనాడో మరచి పోయి, అధికారం కాపాడుకోవటం కోసం అధిష్టానం ముందు సాగిల పడటమే ఇప్పుడు తెలుగు వాడికి తెలిసింది... కేంద్రం మిధ్య అంటూ డిల్లీ దాష్టీకానికి ఎదురొడ్డి నిలిచిన ఎన్ టీ ఆర్ తోనే తెలుగు వాడి పౌరుషం కూడా చచ్చి పోయింది.  కేవలం రాజకీయ నాయకుల పదవులు పెంచుకోవటం కోసం ప్రత్యెక రాష్ట్రం కావాలంటూ అర్ధం పర్ధం లేని ఆందోళనలు చేస్తూ మన అనైక్యతని పొరుగు రాష్ట్రాల వారికి, కేంద్రానికి చాటి చెప్పాం.  దాని ఫలితం గానే ఇంత లోకువ అయ్యాము.  భారత దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో చూసినా, అక్కడి రాజకీయ నాయకులు అధికారంలో వున్నా, ప్రతి పక్షంలో వున్నా కూడా తమ సొంత రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకున్నాకే తమ స్వార్ధం చూసుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. ఒక పక్క ప్రజలు కరెంటు లేక, నీళ్ళు లేక, ఇతర సౌకర్యాలు లేక అలమటిస్తుంటే..కేవలం అధికారం కాపాడుకోవటం కోసం దేశ రాజధాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న ఘనులు మన తెలుగు వారు!  మనలో ఈ అనైక్యత కొన సాగినంత కాలం రాష్ట్ర అభివృద్ది సున్నా అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.. 

Monday, January 2, 2012

శభాష్ టీటీడీ..!

నూతన సంవత్సరం మొదటి రోజున తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుందామని భక్త జనులందరూ తహ తహ లాడటం సహజమే.. అయితే ప్రతి సంవత్సరం వీఐపీ ల సేవతో తరిస్తూ సామాన్య భక్తులకి నరకం చూపించటమే ఆనవాయితీ గా పెట్టుకున్న టీ టీ డీ పాలక వర్గం ఈ నూతన సంవత్సర ప్రారంభాన కొద్దిగా ఆ పద్ధతిని మార్చటం హర్షణీయం.   వీఐపీ పాసులు ఉన్న వారికి కూడా లఘు దర్శనం అమలు చేసి, వీఐపీ దర్శన ప్రహసనాన్ని గంటలోనే ముగించి, ఆ సమయాన్ని క్యూ లైన్ల లో ఉన్న భక్తులకి కేటాయించటం అభినందనీయం. అసలు భగవంతుని ముందు అందరూ సమానులే అన్న ప్రాధమిక సూత్రం విస్మరించి కొంత మందిని వీఐపీ లంటూ వర్గీకరణ చేయటమే అర్ధ రహితం. ఇంక నూతన సంవత్సరాది వంటి ముఖ్యమైన రోజుల్లో కూడా తమ ప్రాపకం వుపయోగించి, పాసు సంపాదించి, వేలాది ఇతర భక్తుల్ని ఇబ్బంది పెట్టి భగవంతుణ్ణి ముందుగా దర్శిస్తే వచ్చే పుణ్య మేమిటో ఆయా వీ ఐ పీ లకే తెలియాలి...పైగా    వీఐపీ పాసు ఉన్న తమకి లఘు దర్శనం చేయించారని ఎంపీ రాయపాటి హుంకరించటం మూర్ఖత్వం.   ఇటువంటి వారు కొద్ది రోజుల క్రితమే తిరుమల సందర్శించి వెళ్ళిన రిజర్వ్ బ్యాంకు గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారిని ఆదర్శంగా తీసుకోవాలి. అసలు తాను  వస్తున్నట్లు సమాచారమే ఇవ్వకుండా నడక దారిలో కొండనెక్కిన దువ్వూరి ని ఆలయం వద్ద గుర్తు పట్టి, టీ టీ డీ యాజమాన్యం ప్రోటోకాల్ ప్రకారం ఆలయ మర్యాదలు చేయ బోయినా సున్నితంగా తిరస్కరించారాయన! ఆయన సంస్కారం ముందు రాయపాటి అధికారం ఏ పాటిది?  ఒక మంచి కార్యానికి శ్రీకారం చుట్టిన టీటీడీ భవిష్యత్తులో కూడా రాజకీయుల, వీఐపీ ల తాకిడినుంచి భక్తులని, భగవంతుడినీ కూడా కాపాడే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.