పచ్చగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం భగ్గుమనటం మొదలై నేటికి రెండేళ్ళు! కేంద్రం లోని యూపీఏ ప్రభుత్వానికి ఆక్సిజన్ లాగా 32 మంది ఎమ్పీలని అందించిన ఆంధ్ర రాష్ట్రానికి మేడం జన్మ దిన కానుకగా ఇచ్చిన మర్చి పోలేని కానుక ఇది....దొంగ దీక్షలకి మోస పోయి, తెలుగు వారిని విడ దీద్దామని ప్రకటించి భంగ పడిన రోజు ఇది....నాడు రగిలించిన రావణ కాష్టం నేటికి కూడా ఆరకుండా తెలుగు జాతి పరువు ప్రతిష్టలను నడి బజారున పడేస్తుండటం మిక్కిలి బాధాకరం. తాజాగా శాసన సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా మజ్లిస్ నాయకుడు ఒవైసీ ప్రసంగం ఇక్కడ గమనార్హం. తమది సమైక్య వాదమే అని కుండ బద్దలు కొట్టిన మజ్లిస్ నేత, గత రెండేళ్లుగా వచ్చిన 30 వేల కోట్ల రూపాయల నష్టానికి బాధ్యులెవరని నిలదీశారు. (30 వేలన్నది మజ్లిస్ లెక్క. వాస్తవానికి మనం నష్ట పోయింది ఇంకా ఎక్కువ.) అలాగే హైదరాబాద్ బ్రాండ్ నేం ఏమయి పోయిందని ఆవేదన వెళ్లగక్కారు. నిజమే.. రెండేళ్ళ క్రితం వరకు మన హైదరాబాదు నగరం అభివృద్ది విషయంలో దేశంలో ఐదవ స్థానం.. మరి ఇప్పుడు? చెప్పుకుంటే సిగ్గు చేటు. దీనికి బాధ్యులెవరు? ఇంకెవరు? పర్యవసానాలు ఆలోచించకుండా తెలుగు జాతిని ముక్కలు చేసే ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీదే ఈ బాధ్యత. అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్న చందంగా తొందర పాటు ప్రకటన చేసేసి..ఆనక వెనక్కి తీసుకొని తద్వారా రాష్ట్రాన్ని ఉద్యమాల ఊబిలోకి దించి..తెలుగు ప్రజలందరికీ కష్ట నష్టాలని కలుగ జేసిన కాంగ్రెస్ పార్టీని తెలుగు జాతి ఎన్నటికీ క్షమించదు.