సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమట ! సంప్రదాయాలని పాటించటం లేదట! ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ చట్టంలోని 8వ అధికరణం ప్రకారం గవర్నరుకి విశేషాదికారాలని కట్టబెడుతూ కేంద్రం రాసిన లేఖకి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ స్పందన అది ! దయ్యాలు వేదాలు వల్లించటం అంటే సరిగ్గా ఇదే అనాలి. ఏ సమాఖ్య స్ఫూర్తిని పాటించి, ఏ సంప్రదాయాలు పాటించి తెలంగాణా రాష్ట్రం సాధించుకున్నారో ఒకసారి వారి అంతరాత్మలని ప్రశ్నించుకోవాలి. సంపూర్తిగా అభివృద్ది చెందిన రాజధాని ని కబ్జా చేస్తూ, తల్లి రాష్ట్రానికే రాజధాని లేకుండా తన్ని తగలేస్తూ కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయటమనే సంప్రదాయం ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా? ఈ సరికొత్త సంప్రదాయానికి తెర తీసింది ఇప్పుడే కదా! అలాగే ఒక రాష్ట్ర శాసన సభ అభిప్రాయం కోసం పంపిన బిల్లుని తిరస్కరించి పంపినప్పటికీ, దానిని ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్రం తాను అనుకున్న పద్ధతిలో తెలుగు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేయటం ఏ విధమైన సమాఖ్య స్ఫూర్తి అనిపించుకుంటుందో ఎవ్వరూ చెప్పలెరు. అప్పుడు గుర్తుకి రాని సంప్రదాయాలు, స్పూర్తులు ఇప్పుడే వారికి జ్ఞప్తికి రావటం ఆశ్చర్యం! అయినా కూడా, విద్వేషాల పునాదుల పై ఉద్యమం నడిపి, ప్రత్యెక రాష్ట్రం సాధించిన తరువాత కూడా - విద్వేషాలను పెంచే రీతిలోనే పరిపాలన సాగిస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా? చట్ట సభల్లో ఆమోదం పొందిన విభజన చట్టంలోని అంశాలని తిరస్కరించటం అంటే ఖచ్చితంగా
రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమే అవుతుంది. ఓ పక్క పిల్ల నాయకులు భారత దేశంలో బలవంతంగా కలుపబడ్డామని వాపోతున్నారు! ఇక స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందిన విభజన చట్టానికి వ్యతిరేకంగా ధిక్కారం చూపుతుంటే కేంద్రం చర్యలు తీసుకోక తప్పదు...