Friday, October 28, 2011

దళిత వర్గాలకు నరకాసురుడి అండ! - ఇదెక్కడి చోద్యం??

నేటి ఈనాడు దిన పత్రికలో వచ్చిన ఈ వార్తని చూస్తె నవ్వాలో ఏడవాలో అర్ధం కావట్లేదు.

కులాలు మతాలూ అన్నవి మానవులు ఈ కలి కాలంలో ఏర్పాటు చేసుకున్నవి. అయితే పురాణ కాలంలో దళితులెవరున్నారో? వారికి నరకాసురుడు ఏ విధంగా అండగా నిలబడ్డాడో? ఏ అగ్ర కులాల వారికి వ్యతిరేకంగా నరకాసురుడు పని చేసాడో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్ధం కావట్లేదు.  ఈ మధ్యనే భగవంతునికి ప్రాంతీయ విద్వేషాల రంగు అంట కట్టి సమ్మె పేరుతొ పూజాదికాలు మాని ఆటలాడిన పైత్యాన్ని చూసాం.
http://andhraaakasaramanna.blogspot.com/2011/09/blog-post_22.html

ఇక ఇప్పుడు కులాల కుమ్ములాటల్లోకి కూడా భగవంతుడిని తీసుకు రావటం శోచనీయం. అగ్ర వర్ణాలకి వ్యతిరేకంగా ఏదో ఒక పని చేసి వార్తల్లోకి ఎక్కాలన్న దుగ్ధ తప్ప వేరే ప్రయోజనమేమీ ఈ చర్యలో కనపడటం లేదు.  ప్రాంతీయ విద్వేషం తలకెక్కి, ఆలయాన్ని మూసేసి ఆటలాడుతూ చేసిన సకల జనుల సమ్మె షెడ్డుకి వెళ్లి పోవటం కళ్ళారా చూసాం. ఇప్పుడు రాక్షస సంహారాన్ని వర్ణ విద్వేషాలకు ఆపాదించిన ఈ విషయానికి భగవంతుడెలా స్పందిస్తాడో చూద్దాం.

ఇక్కడ నాకో సందేహం...నరకాసురుని వధించిన శ్రీ కృష్ణుడు యాదవ సంజాతుడని అందరికీ తెలుసు. అంటే వారి లెక్క ప్రకారం ద్వాపర యుగంలో యాదవులు అగ్ర వర్ణాలకి చెందిన వారన్న మాట! భేష్! వారికి డాక్టరేట్ ఇచ్చి తీర వలసిందే...

Tuesday, October 25, 2011

సమైక్యాంధ్రకి నిజమైన దీపావళి!

కేంద్రం తెలుగు జాతి మొత్తానికీ అసలైన దీపావళి జరుపుకొనే అవకాశాన్నిచ్చింది. 42 రోజుల సమ్మె ప్రహసనం ముగిసి సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. రైల్ రోకో ని సమర్ధంగా ఎదుర్కోవటం గావచ్చు. లేదా శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు లో 8 వ అధ్యాయం అమలు జరిగి ఉండవచ్చు. కారణమేమైనా గానీ తెలబాన్ నరకాసురుడు తోక ముడిచాడు. రాష్ట్రం ముక్కలు కాదన్న భరోసా ఏర్పడింది.  అయితే సమ్మె ని ఎదుర్కొన్నంత మాత్రాన తమ బాధ్యత పూర్తి అయినట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించరాదు. చింత చచ్చినా పులుపు చావనట్లు ఇంకా తెలబాన్ వీరులు నవంబరు ఒకటో తేదీని విద్రోహ దినంగా పాటించాలని రంకెలు వేస్తుండటం సహించరానిది.  ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం అన్నది అధికారిక కార్యక్రమం. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర అస్తిత్వం ఉన్నంత వరకూ రాష్ట్రం లోని 23 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరిగి తీరాల్సిందే. ఇందుకు అడ్డంకులు కల్పించిన వారిని రాజ ద్రోహం కేసు కింద అరెష్టు చేయాలి. అలాగే ఆ కార్యక్రమంలో పాల్గొనని మంత్రుల్ని మంత్రి వర్గం నుండి తొలగించాలి. ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకి ఎన్నికై రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొనకుండా ఎగ్గొట్టే శాసన సభ్యులని సభ నుండి వెలి వేయాలి.  ఇటువంటి కఠిన చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తే వేర్పాటు వాద విష సర్పం మళ్ళీ బుసలు కొట్టే ప్రమాదం ఎంతైనా వుంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు!

Tuesday, October 18, 2011

కనీ వినీ ఎరుగని పైత్యం..

తెలబాన్ సమ్మె కోడికి ఈకలన్నీ ఒక్కొక్కటిగా రాలుతున్నాయి. ఏ కారణం చెప్పి ఆర్భాటంగా సమ్మె మొదలు పెట్టారో  - ఇప్పుడు        ఎందుకు    సమ్మె                 విరమించేసుకుంటున్నారో ఆ తెలంగాణా తల్లికే తెలియాలి.  సమ్మె చేసిన ఉద్యోగులందరూ ఇప్పుడు జీతాలు, అడ్వాన్సులు, బోనస్ లు తీసుకొని సమ్మె కాలంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయులు సరే సరి..వారికి వచ్చిన నష్టమేమీ లేదు. మరి వాజమ్మలు అయింది ఎవరు? సామాన్య ప్రజలు. వారికి గత నెల రోజులుగా ఏర్పడిన కష్ట నష్టాలకి బాధ్యత ఎవరిది?  పైగా, కనీ  వినీ ఎరుగని రీతిలో జరిగిన ఈ సమ్మె విషయంలో కేంద్రం అసలు స్పందించలేదని తెలబాన్ నాయకులు ఆక్రోశించటం మరీ విడ్డూరం! ఎవరి జబ్బ వాళ్ళు గిల్లెసుకొని శోకాలు పెడితే కేంద్రం మాత్రం ఏం చేస్తుంది??  ఏడిస్తే ఏడవనీ అని వదిలేస్తుంది..ఇప్పుడు జరిగింది అదే!!

Saturday, October 15, 2011

శభాష్ డీజీపీ! - 2

 
తమ హెచ్చరికలు కేవలం తాటాకు చప్పుళ్ళు కావని నిరూపిస్తూ నేడు పట్టాలెక్కిన ప్రతివాడినీ అరెష్టు  చేసి డీజీపీ చేవ చూపించారు.  తాము మాత్రం చట్టాలని ఉల్లంఘిస్తూ,  రాజ్యాంగానికి అతీతులమన్నట్లు ప్రవర్తిస్తూ పోలీసులకి సుద్దులు చెప్పే తెలబాన్ నాయకులకి పోలీసు దెబ్బ రుచి చూపించిన పోలీసు బాసు అభినందనీయుడు.  ప్రజల ఇబ్బందుల పట్ల కొంతైనా సానుభూతి లేకుండా నెల రోజుల పైగా సకల జనుల సమ్మె పేరుతొ తెలబాన్ గణం సాగిస్తున్న అకృత్యాలకి అంతే లేదు.  ఇంక రైల్ రోకో పేరుతొ కేవలం తెలంగాణా ప్రాంతం వారినే కాక అన్ని ప్రాంతాల వారిని ఇబ్బందుల పాలు చేయాలనుకున్న కుట్ర భగ్నం కావటంతో దిక్కు తోచని తెలబాన్లు అరెష్టులు అక్రమమని రోదించటం హాస్యాస్పదం. ఇప్పటికే సమ్మె విషయంలో ఉద్యోగులని బలి పశువులని చేస్తూ రాజకీయులు తమ పబ్బం గడుపుకుంటున్నారని వారి నాయకుడు స్వామి గౌడ్ బహిరంగంగా ఆవేదన వెళ్ళ గక్కాడు.  మిగిలిన రంగాల్లోని వారుకూడా కళ్ళు తెరిచే రోజు ఎంతో దూరంలో లేదు.  ఇంత జరుగుతున్నా కేంద్రం స్పందించడం లేదని తెలబాన్ జాక్ నాయకుడు కలుగు లోంచి ఆక్రోశిస్తున్నాడు.  కేంద్రం స్పందించక పోవటమేమిటి?  కేంద్ర స్పందనకి నిదర్శనమే ఈ అరెస్టులు... ఈ మాత్రం కూడా తెలబాన్ పీత బుర్రలకి అర్ధం కాక పోవటం శోచనీయమే!

Thursday, October 13, 2011

శభాష్ డీజీపీ!

తెలబాన్లు తలబెట్టిన రైల్ రోకో కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించేది లేదని డీజీపీ దినేష్ రెడ్డి నేడు హెచ్చరించారు. అడుసు తొక్కనేల, కాలు కడగనేల అన్న రీతిగా కేంద్రం డిసెంబర్  9 మరియు 23 ప్రకటనలు చేసేసి ఇప్పుడు ఎటూ నిర్ణయించుకోలేక సతమతమవుతున్న పరిస్థితిని లోకువగా తీసుకొని, తెలబాన్లు గత నెల రోజులుగా పెచ్చరిల్లి పోయారు.  రవాణా సౌకర్యాలు స్తంభింప జేసినా, రైతులకి, ప్రజలకి విద్యుత్ కోతకి గురి జేసినా, ఉద్యోగస్తులకి జీతాలు రాక పోయినా, విద్యా సంస్థలు తెరుచుకోక విద్యార్ధులు, తల్లి తండ్రులు ఆందోళనకి గురి అయినా తెలబాన్ నాయకులకి చీమ కుట్టినట్లయినా లేదు. తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్లు మళ్ళీ రైల్ రోకోకు తెగ బడ్డారు.  ఇక్కడ ఒక విషయం గమనించాలి. గతంలో రెండు సార్లు పాకిస్తాన్ దురాక్రమణ ప్రయత్నాలని, కార్గిల్ దొంగ దాడుల్నీ తిప్పి కొట్ట గలిగిన భారత ప్రభుత్వానికి, తాటాకు చప్పుళ్ళ వంటి తెలబాన్ ఉద్యమాన్ని అణచి వేయటం పెద్ద పని కాదు. అయితే, అవినీతి ఆరోపణలని ఎదుర్కోవడంలోను, ఇంకా   పైన చెప్పినట్లు నిర్ణయ రాహిత్య స్థితిలో డోలాయమానంగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంకట పరిస్థితిని లోకువ గట్టి పౌరుల ప్రశాంత జీవనానికి నెల రోజులుగా పాతరేస్తున్న తెలబాన్ల వైఖరి గర్హనీయం.  ప్రజల్నీ, ప్రభుత్వాల్నీ ఇబ్బందులు పెట్టేస్తే ప్రత్యెక రాష్ట్రం వచ్చేస్తుందనుకోవటం పిచ్చి భ్రమ! ఎవరినీ ఏ ఇబ్బందులకీ గురి చేయకుండా కేవలం నిరాహార దీక్షతో అన్నా హజారే కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించలేదా? ఆయనకి దేశ వ్యాప్తంగా సకల జనులు మద్దతు పలకలేదా? దొంగ దీక్షతో కేంద్రాన్ని ఏమార్చి, డిసెంబరు 9 ప్రకటన రాబట్టుకున్న తెలబాన్ నాయకుడు, తన కోరిక నేర వేరక పొతే మళ్ళీ దీక్షకి కూర్చొవచ్చుగా!  ఆ పని మాత్రం చేయడు. ఎందుకంటే. మీడియా అప్రమత్తంగా ఉన్న ప్రస్తుత స్థితిలో మళ్ళీ దొంగ దీక్ష సాధ్యం కానే కాదు. ఏమైనా కనీసం నెల రోజుల తర్వాత అయినా డీజీపీ రైల్ రోకో కార్యక్రమం మీద కొరడా ఝుళిపించటం హర్షణీయం.  అడిగే వాడు, అదిలించే వాడు లేడన్నట్లుగా గత నెల రోజులుగా చిత్ర విచిత్ర విన్యాసాలతో పౌరులని ముప్పు తిప్పలు పెడుతున్న తెలబాన్ శ్రేణులకి ముకు తాడు వేసే ప్రయత్నం జరగటం సంతోషం.  డీజీపీ గారు కూడా తమ హెచ్చరిక ని పకడ్బందీగా అమలుచేసి తద్వారా కేవలం తెలంగాణా ప్రజలే కాదు....రాష్ట్రంలో మిగతా ప్రాంతాల ప్రజలు, దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా రైల్ రోకో వల్ల ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి.

Monday, October 10, 2011

తెలంగాణా వాళ్ళంతా తెలబాన్లు కాదు!

తెలంగాణా కోసం రాజీనామా చేయాలంటూ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఇంటికి చేరి దేబిరిస్తున్న తెలబాన్ గుంపుని చూడండి..రాను రాను వీరి ధోరణి వెర్రి కుదిరింది రోకలి తలకి చుట్టండి అన్నట్లు తయారవుతోంది.  కేవలం తెలంగాణా వాసి అవటమే జైపాల్ రెడ్డి చేసిన పాపం.  ఉద్యమం ఉధృతంగా వున్నా కూడా ఇన్నాళ్ళూ తటస్థంగా వున్నారంటేనే జైపాల్ అంతరంగం అర్ధమవుతోంది.  తెలంగాణా వాసి అయినంత మాత్రాన ప్రత్యెక రాష్ట్ర వాదాన్ని సమర్ధించాలన్న నిబంధన తు.చ. తప్పక పాటించే తెలబాన్లు అందరినీ అదే గాటన కట్టి ఒత్తిడి చేయబూనటం మూర్ఖత్వం.  పైగా మంత్రి చుట్టూ చేరి గలాటా చేస్తున్న తెలబాన్ గుంపు లో ఒక్కడన్నా తన పదవి వదులుకున్నాడా?  కోదండ రాం ఈ రోజుకి కూడా పైసా పని చేయకుండా నెలకి లక్ష జీతం తీసుకుంటున్నాడు.  స్వామి గౌడ్  కూడా అంతే!  అసలు వీరికి మంత్రిని రాజీనామా చేయమని అడిగే నైతిక హక్కు అనేది ఉందా?  ఇప్పటికే  సకల జనుల సమ్మె పేరుతొ నాలుగు వారాలుగా సాగుతున్న నాటకంతో దినవారీ కూలి పనులు చేసుకొనే సగటు పౌరుడు ఇబ్బందుల పాలవుతున్నాడు. బస్సులు తిరగక పండగ సమయంలో సాధారణ ప్రయాణీకులు నరకం చూసారు  కరెంటు కోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.  అంతెందుకు? సమ్మె చేసిన ఉద్యోగులు సైతం పండగ సమయానికి జీతాలు, బోనస్ లు అందక వుసూరుమన్నారు.     తాజాగా  విద్యా సంస్థలు తెరవకూడదంటూ ఆగడం చేస్తున్న తెలబాన్ గుంపుల ధోరణి శృతి మించుతోంది. విద్యార్ధుల విద్యా సంవత్సరం నష్ట పొతే గానీ తెలబాన్ నాయకుల కడుపు నిండదా?  ప్రభుత్వం తన జడత్వాన్ని వదిలి పెట్టాలి.  పౌరులకి  ప్రశాంతంగా  జీవించే హక్కుకి భంగం కలిగిస్తున్న సమ్మె నాటకానికి వెంటనే తెర దించాలి.