ప్రపంచం మొత్తంలోనే అతి సంపన్నమైన దేవాలయం మన తిరుమల తిరుపతి దేవస్థానం! కోట్లాది భక్తులు కానుకలుగా, ముడుపులుగా సమర్పించే ధనాన్ని, బంగారం ఇతర విలువైన వస్తువుల సంరక్షణ, నిర్వహణల బాధ్యతలని ఆ భక్తుల తరపున నిర్వర్తించాల్సిన దేవస్థానం ధర్మ కర్తల మండలి ఆ బాధ్యతలని సక్రమంగా నిర్వహిస్తోందా?? లేనే లేదు. అసలు దేవాలయాల ధర్మ కర్తల మండలిలో రాజకీయ నాయకులు ప్రవేశించిన నాడే నిబద్ధత అన్నది అడుగంటి స్వార్ధ ప్రయోజనాలకి పెద్ద పీట వేసుకోవటం మొదలైంది. తెలుగు దేశం నుంచి కాంగ్రెసులోకి ఫిరాయించి దానికి ప్రతిఫలంగా టి.టి.డీ. అద్యక్ష పదవిని పొందిన ఆదికేశవులు నాయుడు చేస్తున్న పని అదే. ఆనంద నిలయం అనంత స్వర్ణ మయం పేరుతొ కేవలం ఏక వ్యక్తి ఎజెండాగా సాగుతున్న ఈ కార్యక్రమం ఎ మాత్రం కొనసాగటానికి వీల్లేదు.బోర్డు సభ్యులు అబ్యంతరాలు చెప్పినా,ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా,కోర్టు కేసులు వేస్తున్నా కూడా ఈ పధకం అమలుకి ఆయన పట్టు పడుతున్నారంటే దీని వెనుక స్వార్ధ ప్రయోజనాలు లేవని ఎలా అనుకోగలం? విజయ్ మాల్యా వంటి వారిని రప్పించి ఈ పధకానికి బంగారం ఇప్పించి అందుకు ప్రతిగా వారికి ప్రత్యెక సౌకర్యాలు కలుగ చేయటం కేవలం తన వ్యాపార ప్రయోజనం కోసం కాదా? అయినా టే.టే.డీ. ఇతర ధార్మిక కార్యక్రమాలన్నిటికీ ఇచ్చే చందాల పై వున్న ఆదాయ పన్ను మినహాయింపు ఈ అనంత బంగారం పధకానికి లేదు. దీన్ని బట్టే ఇది స్వంత ఎజెండా అని నిరూపితమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంలో కలుగ జేసుకుని అశేష భక్త జనుల అభీష్టానికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రాజెక్టులు అమలు జరగకుండా చూడాలి. పాలక మండలి చైర్మన్లుగా రాజకీయ నాయకుల బదులు పీ.వీ.ఆర్.కే.ప్రసాద్ లాంటి నిబద్ధత గల మాజీ అధికారులని నియమిస్తే భక్తుల సౌకర్యాలకు పెద్ద పీట వేసినట్లవుతుంది.
Tuesday, March 30, 2010
Monday, March 29, 2010
పదవిని వదలని కే.సి.ఆర్.!
తెలంగాణా జైత్ర యాత్ర లేదా కే.సి.ఆర్. అంతిమ యాత్ర ఏదో ఒకటి తప్పదని ఆర్భాటం చేసి నిరాహార దీక్ష మొదలు పెట్టిన కే.సి.ఆర్. ఆ రెండింటిలో ఏదీ సాధించలేక పోయినా రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులకి మాత్రం పాడె కట్టి ఊరేగించారు. పాల పొంగులాగ వచ్చిన ఉద్యమ వేడిలో పార్టీ శాసన సభ్యులని బలి పశువులని చేసి రాజీనామాలు చేయించి.. తానూ, తన చెల్లి మాత్రం పదవులని అంటి పెట్టుకొని వున్నారు. పదవినే త్యాగం చేయలేని మనిషి ప్రాణ త్యాగం చేసేసి తెలంగాణా తెచ్చేస్తాడని నమ్మడం తెలివి తక్కువ పని. పైగా శ్రీ కృష్ణ కమిటీని ఫాల్తూ కమిటీ అని, గడ్డి పీకుతుందా అంటూ అపహాస్యం చేసిన ఆయన ఈ రోజు అదే కమిటీకి రిపోర్టు ఇవ్వడానికి తన పార్టీలో పది సబ్ కమిటీలు వేసారు. దీనర్ధం... అసలు తెలంగాణా విషయమై ఆయనకు ఎ మాత్రం అవగాహన లేదు. కేవలం ఉనికిని కాపాడుకోవటానికే ఉద్యమాల పేరున ప్రజలని రెచ్చ గొట్టారు. విద్యార్ధుల ప్రాణాలు బలి తీసుకున్నారు. తీరా సమగ్రమైన నివేదిక ఇవ్వాల్సిన సమయం వచ్చేసరికి కమిటీలు ఏర్పాటు చేసి కసరత్తులు మొదలు పెట్టారు. అయినా తెలంగాణా ప్రాంతంలోనే ఉన్న హైదరాబాదు నగర పాలక సంస్థ ఎన్నికల్లో కనీసం పోటీ చేయడానికి మొహం చెల్లని వారు ఎ ముఖం పెట్టుకొని తెలంగాణా సాధిస్తామని జనాల్ని మోసం చేస్తున్నారు?
Sunday, March 21, 2010
కోదండ రాం నాన్ స్టాప్ కామెడీ!
వెర్రి కుదిరింది..రోకలి తలకు చుట్టమన్నట్లు తయారయింది కోదండ రాం గారి పరిస్థితి. జాయింట్లు అన్నీ ఒక్కటొక్కటిగా ఊడి పోయేసరికి జే.ఎ.సి. చైర్మన్ గారికి మతి చెడిందన్న విధంగా ఆయన మాట్లాడుతున్నారు. తాజాగా సినీ పరిశ్రమలో తెలంగాణా వారికి నలభై శాతం రిజర్వేషన్ కావాలని డిమాండు చేసారు. కళ అన్నది సృజనాత్మకతకి సంబంధించిన అంశం. ఎవరికీ టాలెంటు వుంటే వారు ఆ రంగంలో పైకి వస్తారు గాని రిజర్వేషన్లు ఇవ్వడం వల్లనో, లేదా వారసత్వం వల్లనో ఎవరూ పైకి రారు. ఉదాహరణకి ఈ మధ్యనే వచ్చిన సుమన్(బాబు) నాన్ స్టాప్ కామెడీ ప్రజల్ని ఎంత నాన్ స్టాప్ గా హింసిన్చిందో చూసాం. సొంత మీడియాలో విపరీత ప్రచారం, బహుమతుల ఆశలు చూపినా ఆ కామెడీ జనం భరించలేక పోయారు. ఇక రిజర్వేషన్ ఇచ్చినా పరిస్థితి అంతే. అసలు సినీ రంగంలో ఒక ప్రాంతం వారికి రిజర్వేషన్ అన్నది ప్రాక్టికల్ గా సాధ్యం కానే కాదు. కేవలం సినీ రంగాన్ని దెబ్బ తీయాలన్న దురుద్దేశ్యం తోనే ఈ విధమైన ప్రకటనలు చేస్తున్నారేమో అనిపిస్తోంది.
Tuesday, March 16, 2010
తెలంగాణా వస్తే కోస్తా ఎడారే!
కృష్ణా, గోదావరి జలాల వినియోగం పై మనకి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర లతో ఇప్పటికీ వివాదాలు నడుస్తున్నాయి. అయితే అవి పద్దతిగా కోర్టుల్లోనూ, ట్రిబ్యునల్స్ లోనూ సాగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణా అనే ప్రత్యెక రాష్ట్రం వచ్చిన పక్షంలో, భౌగోళికంగా రెండు నదుల పరీ వాహక ప్రాంతాలూ తెలంగాణాని దాటి కోస్తాకి రావాల్సి వుంటుంది. అయితే రాష్ట్రం రాక ముందే రోడ్ల మీద గోడలు కట్టేసిన మహానుభావులు నదులకి అడ్డంగా డ్యాములు కట్టేయరని గ్యారంటీ ఏమిటి? అన్ని ప్రాంతాల వారి సమిష్టి కృషితో అభివృద్ది చెందిన హైదరాబాదుని అనాయాసంగా గుంజుకుందామని చూస్తున్న వారు అప్పనంగా వచ్చే నదీ జలాలు వదులుతారా? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితుల అధ్యయనానికి ఏర్పాటైన శ్రీ కృష్ణ కమిటీ ఒక వేళ ప్రత్యెక రాష్ట్రం గురించి ప్రస్తావించ దల్చుకుంటే తద్వారా ఏర్పడ బోయే నదీ జలాల వివాదాల గురించి కూడా ఆలోచించాలి.
Saturday, March 13, 2010
ఇంకొక్క జాయింటు మిగిలింది..
ఏక పక్షంగా రాజీనామాల హుకుం జారీ చేయటంతో తెలంగాణా జే.ఎ.సి. నుంచి కాంగ్రెస్ వెళ్లి పోయింది. తమ ఆజ్ఞను పాటించలేదని తెలుగు దేశం పార్టీని జే.ఎ.సి.నించి కోదండరాం గారు బహిష్కరించారు. ఇక జాయింట్ల యాక్షన్ కమిటీలో మిగిలిన ముక్క టీ. ఆర్.ఎస్. మాత్రమె. ఇంకా టీ.ఆర్.ఎస్. లో కూడా కే.సి.ఆర్., విజయ శాంతి రాజీనామాలు చెయ్యలేదు. వారినికూడా బహిష్కరించేస్తే కోదండ రాం గారు ప్రశాంతంగా ఉండచ్చు. అయితే అది జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే తోలు బొమ్మలాటలో కంట్రోల్ అనేది వెనుకనుంచి ఆడించే వాడికి వుంటుంది కానీ తెర మీద ఆడే బొమ్మకి కాదు కదా!
Friday, March 12, 2010
సమైక్యాంధ్ర ప్రదేశ్ తరపున పది వేల కృతఙ్ఞతలు!
కేవలం 76 రోజుల్లో పది వేల హిట్స్ వస్తాయని నేను ఈ బ్లాగు మొదలు పెట్టిన రోజు ఊహించలేదు. ఒక్కటిగా ఉన్నతెలుగు వారి రాష్ట్రాన్ని వుట్టి పుణ్యానికి ముక్కలు చేసేస్తారేమోనన్న ఆందోళన డిసెంబరు 2009 నాటికి వుండేది. ఆ సమయంలో రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని జరుగుతున్న డ్రామాలని చూస్తుంటే, వేర్పాటువాదుల పిడి వాదాల్ని వింటుంటే వచ్చిన వుక్రోషాన్ని వెళ్ళ గక్కటానికి ఈ బ్లాగు మొదలు పెట్టాను. ఇందులో రాసినవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమె. అవి అందరికీ నచ్చాలని రూలేమీ లేదు. అందుకే వచ్చిన పది వేల హిట్లలో సమర్ధించిన సమైక్యవాదులున్నారు. విమర్శించిన వేర్పాటు వాదులున్నారు. అలాగే పచ్చి బూతులు తిట్టిన తెలబాన్లు కూడా వున్నారు. (వారి సంస్కారం ఇంతే అని తెలియ చేయటానికి వారి కామెంట్లని డిలిట్ చేయకుండా యధాతధంగా బ్లాగులో ఉంచాను). అయితే డిసెంబరు నాటికీ, ఇప్పటికీ పరిస్థితిలో మార్పు వచ్చింది. రాష్ట్రం ముక్కలవదన్న భరోసా వచ్చింది. అందుకే అందరికీ కూడా సమైక్యాంధ్ర ప్రదేశ్ తరపున పదివేల కృతఙ్ఞతలు.
కోదండ రాం రాజీనామా చెయ్యాలి!
రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల నుండి వసూలైన పన్నులనుండి జీతం తీసుకుంటున్న కోదండ రాం కి ఒక ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడే నైతిక హక్కు లేదు. ఆయనకే గనుక నైతిక బాధ్యత వుండే పక్షంలో...తాను వేర్పాటు వాదానికే కట్టుబడేటట్లయితే ప్రొఫెసర్ పదవికీ, లేదా ప్రభుత్వ వుద్యోగం కావాలనుకుంటే జే.ఎ.సి. కన్వీనర్ పదవికీ తక్షణం రాజీనామా చెయ్యాలి.
గవర్నరుని చూసి నేర్చుకోండి..
తిరుమల ఆలయంలో మహా ద్వార ప్రవేశార్హత ఉన్నాకూడా సాధారణ భక్తుని వలె వైకున్థం క్యూ కాంప్లెక్సు ద్వారా దర్శనానికి వెళ్ళిన గవర్నరు ఎంతైనా అభినందనీయుడు. సాధారణ భక్తుల అవస్తల్ని పట్టించుకోకుండా, అసలు తమకి మహా ద్వార ప్రవేశ అర్హత వుందో లేదో కూడా తెలియకుండా..అధికారాన్ని ఉపయోగించో, సిఫారసుల ద్వారానో మహా ద్వార ప్రవేశం చేస్తున్న రాజకీయులకు, వారి అనుచరులకు ఇది కనువిప్పు కావాలి. రాష్ట్రానికి ప్రధమ పౌరునిగా గవర్నరు చూపిన ఆదర్శం అందరికీ ఆచరణీయం అవ్వాలి.
రాయల తెలంగాణా పై అంత ఉలుకెందుకు?
జే.సి.దివాకర రెడ్డి చేసిన రాయల తెలంగాణా వ్యాఖ్య పై తెలంగాణా నాయకులందరూ ఎందుకు గోల చేస్తారో అర్ధం కాదు. జే.సి. అన్నది రాష్ట్రం విడి పోయిన సందర్భంలో మాత్రమె అన్న మాట మరచి పోయి దుమ్మెత్తి పోయటం మొదలు పెట్టేసారు. అయినా సాక్షాత్తూ ప్రధాన మంత్రి సైతం ఏకాభిప్రాయ సాధన లేనిదే రాష్ట్ర విభజన సాధ్యం కాదని తేల్చేసాక ఇక తెలంగాణా రావడమన్నది కల్ల. అందుకే అందరూ ప్రశాంతంగా వుండండి.
Tuesday, March 9, 2010
పదే పదే.. అదే పొరపాటు!
కేంద్రంలో వున్న యు.పీ.ఎ. ప్రభుత్వం లోని కాంగ్రేసు పార్టీ, తమది సంకీర్ణ ప్రభుత్వం అన్న సంగతి మరచి పోయి తమ అధినేత్రి పుట్టిన రోజు సందర్భంగానూ, మహిళా దినోత్సవ సందర్భంగానూ దేశ ప్రజలకు కానుకలు ఇవ్వబోయి భంగ పడటం మనం చూస్తున్నాం. ఉదాహరణకి మహిళా రిజర్వేషన్ల బిల్లు సంగతే తీసుకుంటే..ఉద్దేశం మంచిదే అయినాకూడా బిల్లు ప్రవేశ పెట్ట బోయే ముందు భాగస్వామ్య పక్షాలతో చర్చించి వారిని సంతృప్తి పరచిన తరువాత బిల్లు ప్రవేశ పెడితే బాగుండేది. ఇప్పుడు పెద్దల సభలో ఆ ఎం.పీ. ల ప్రవర్తన వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇండియా పరువు పోయింది. అలాగే మూడు నెలల క్రితం తెలంగాణా పై ఒక విధాయక నిర్ణయం భాగస్వామ్య పక్షాలకు కనీసం తెలియ జేయకుండా అర్ధ రాత్రి ప్రకటించేశారు. ఆ తరువాత అడుసు తొక్కనేల..కాలు కడగనేల అన్న చందంగా కేంద్రం వ్యవహరించిన సంగతి మనం చూసాం. కనుక ఇకనైనా యు.పీ.ఎ. ప్రభుత్వం సంకీర్ణ ధర్మాన్ని గుర్తెరిగి మసలుకుంటే బాగుంటుంది.
Monday, March 8, 2010
గతమెంతో ఘనం! ఇప్పుడో??
2009 వ సంవత్సరానికి జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ కి అవార్డు వచ్చింది.ఇది గత సంవత్సరం మాట. మరి ఈనాడు మన రాష్ట్రానికి టూరిస్టు అన్న వాడు రావడానికి ధైర్యం చేస్తున్నాడా? ఈ సంవత్సరం టూరిజం అవార్డుల్లో మన స్థానం ఎక్కడ వుంటుంది? ఈ పరిస్థితికి కారకులెవ్వరు?
Saturday, March 6, 2010
అర్ధం పర్ధం లేని లాయర్ల ఆందోళన!
లాయర్లు తమ వాదనా పటిమని కోర్టుల్లో చూపించి కేసులు గెలిపిస్తే అర్ధవంతంగా వుంటుంది కానీ వుట్టి పుణ్యానికి రోడ్ల మీద చేరి పిడి వాదాలు చేస్తుంటే అసంబద్ధంగా వుంటుంది. అధిక ధరలకు నిరసనగా చంద్ర బాబు నాయుడు ఈ రోజు ఇందిరా పార్కు దగ్గర మీటింగు పెట్టి ప్రసంగిస్తుంటే అక్కడికి చేరిన కొంత మంది లాయర్లు అడ్డుకొని తెలంగాణా పై వైఖరి చెప్పమని అల్లరి పెట్టారట! ఎంత హాస్యాస్పదం? తెలంగాణా పై వైఖరి చెప్పాలా వొద్దా, ఎప్పుడు చెప్పాలి అన్నది చంద్ర బాబు ఇష్టం. ఆ విషయమై వొత్తిడి తెచ్చే హక్కు ఎవరికీ లేదు. అలా వొత్తిడి తెస్తున్న సమయంలో కార్య కర్తలకు, లాయర్లకి మధ్య ఘర్షణ అనివార్యం. అయితే దాన్ని కారణంగా చూపి ఇక చంద్ర బాబుని టార్గెట్ చేసేస్తున్నారు. అటువంటప్పుడు ఆ లాయర్ల వెనుక ఏదో ఒక రాజకీయ పార్టీ వుందని చంద్రబాబు అనుమాన పడటంలో అసహజం ఏముంది?
ప్రధాని మాట - చూపాలి బాట !
ఆంధ్ర ప్రదేశ్ ని విడదీయాలంటే ఏకాభిప్రాయం అవసరమని రాజ్య సభలో ప్రధాని మన్మోహన్ చేసిన ప్రకటన ఎంతైనా సమర్ధనీయం. బీ.జే.పీ. హయాంలో మూడు రాష్ట్రాలు ఎటువంటి సమస్యలు లేకుండా ఇచ్చామని వారు గొప్పలు చెప్పుకున్నారంటే అప్పుడు ఆయా రాష్ట్రాల విభజనకి ఎటువంటి అభ్యంతరాలూ ఎవరినించి రాలేదు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. విభజన అన్న మాట వినబడితేనే రాష్ట్రం అగ్ని గుండమై పోతోంది. ఇటువంటప్పుడు కావలసింది ప్రధాని చెప్పినట్లు ఎకాభిప్రాయమే గాని ఏక వ్యక్తి అభిప్రాయమో, ఎజెండానో రాష్ట్రం పై రుద్దరాదు.
Thursday, March 4, 2010
బావిలో దూకే ముందు తెలీదా?
కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల వారు తె.రా.స. ని బాయిలో నూకి గడ్డ మీద వున్నాయని కే.సి.ఆర్. వాపోయారు. అసలు తెరాస శాసన సభ్యులని బావిలోకి ఎవరు తోసారు? జే.ఎ.సి.లో ప్రతిపాదన పెట్టేసి దానికి మిగతా పార్టీల అంగీకారం వుందో లేదో తెలుసుకోకుండానే ప్రజల్లో క్రెడిట్ కొట్టేద్దామన్న అత్యుత్సాహంతో పది మంది శాసన సభ్యుల్నీ బావిలోకి తోసింది కే.సి.ఆర్. కాదా? రాజీనామా అస్త్రం ఎప్పుడూ పని చేయదన్న సంగతి ఇప్పుడు తెలిసాక మిగతా పార్టీలని తూర్పార పడితే ఉపయోగం ఏమిటి? (అయినా ప్రస్తుతానికి కే.సి.ఆర్., విజయ శాంతి ఇంకా బావిలోకి దూకలేదు. గట్టు మీదే ఉండి వారి శాసన సభ్యులు మునుగుతారా, తేల్తారా అని అంచనాలు వేస్తున్నారు.) తాము ఆశించినట్లుగా రాజ్యాంగ సంక్షోభం రాకుండా పరిస్థితి ఉప ఎన్నికల వైపు తిరిగేసరికి దిక్కు తోచక..ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయం ఆయా పార్టీల విజ్ఞతకి వదిలేస్తున్నామని బుకాయిస్తున్నారు. విజ్ఞత గల పార్టీలు కాబట్టే అనవసరంగా ఉప ఎన్నికల ఖర్చు ప్రజల పై రుద్దకుండా చేసాయి. మరి మళ్ళీ వీళ్ళని గెలిపిస్తే ఆరు నెలలకల్లా ఏదో కారణం చెప్పి ఉప ఎన్నికలు తేరని గ్యారంటీ ఏముంది? (రాజీనామాల్లో ప్రపంచ రికార్డు వారిది!) అయినా ..తెలంగాణా కోసం రాజీనామాలు చేస్తున్నామని చెప్పి మళ్ళీ ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక అయి వచ్చేస్తే ఇక వారు చేసిన త్యాగం ఏమిటి?? నిజంగా త్యాగధనులే అయితే ఓ.యు. విద్యార్ధులు కోరినట్లుగా ఆత్మార్పణ చేసిన విద్యార్ధుల బంధువులని వారి నియోజక వర్గాల్లో నిలబెట్టి గెలిపించుకోవాలి. అప్పుడే విద్యార్ధుల బలి దానానికి కొంతయినా సఫలత చేకూరుతుంది.
Wednesday, March 3, 2010
వెర్రి తలలు వేస్తున్న వేర్పాటు వాదం!
రాష్ట్రంలో సినిమా, పరిశ్రమలు, పర్యాటకం, సాఫ్టువేర్, రవాణా ఇత్యాది అన్ని రంగాల్ని తగలబెట్టేసిన తరువాత వేర్పాటు వాదుల దృష్టి విద్యా రంగం పై పడింది. ఇంటర్ పరీక్ష పేపర్లని ఎ ప్రాంతం పేపర్లు అక్కడే దిద్దాలన్న డిమాండుతో ఈసారి వారు తెర మీదకి వచ్చారు. ప్రత్యెక రాష్ట్రం కోసం నానా యాగీ చేసిన తరువాత కేంద్రం అధికారికంగా కమిటీ వేసి డిమాండ్లని చెప్పమని ముందుకు వస్తే పత్తా లేకుండా తెర మరుగై పోయిన వారందరూ ఈ రోజు విద్యార్ధుల జీవితాలతో ఆడుకోవటానికి మళ్ళీ కలిసి కట్టుగా ముందుకు వచ్చారు. స్వయంగా ప్రొఫెసర్ ఐన జే.ఎ.సి. కన్వీనరుకి జంబ్లింగు పద్ధతి ఎందుకు పెట్టారో, బార్ కోడింగ్ పద్ధతిలో అది సక్రమంగా జరుగుతోందో లేదో తెలియదనుకోవాలా? ఐనా రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్ పరీక్ష కాబట్టి లోకువ గట్టి ఇటువంటి అర్ధ రహిత డిమాండు చేసారు. మరి జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరిక్షలు, సివిల్ సర్వీసు పరీక్షల పేపర్ల సంగతేమిటి? వాటిని కూడా తెలంగాణాలోనే దిద్దాలా? మరింకెందుకు...అక్కడే పరీక్షలు పెట్టి, అక్కడే ఫుల్ మార్కులు ఇచ్చేసుకొని, అక్కడే ఉద్యోగాలు ఇచ్చేసుకుంటే ఎ బాధ వుండదు కదా?
Subscribe to:
Posts (Atom)