Wednesday, August 17, 2011

నో వర్క్...నో పే.. ఇది కూడా కోర్టులే చెప్పాలా?


పని చేయని ప్రభుత్వోద్యోగులకి జీతాలివ్వాల్సిన పని లేదని హైకోర్టు తీర్పునిచ్చింది.  ప్రభుత్వం ఇచ్చిన 1617 జీవో ని కొట్టివేస్తూ జీవో 177  అమలు పరచాల్సిందే అంటూ కొరడా ఝుళిపించింది. ఏడాదికి ఉన్న 365 రోజుల్లో 52 ఆది వారాలు, 15 పండుగ సెలవులు, ఇంకా కాజువల్ లీవు, ఐచ్చిక సెలవులు, గట్రాలతో మూడో వంతు పైన రోజులు వేతనంతో కూడిన సెలవులు ప్రభుత్వోద్యోగులకి లభిస్తున్నాయి. ఇక మిగిలిన రెండు వందల రోజులైనా సక్రమంగా పని చేయకుండా బందుల పేరుతొ, సమ్మెల సాకుతో పని ఎగ్గొడుతుంటే ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోటం శోచనీయం. ఉద్యోగులకి తాము ఉద్యోగంలో చేరేనాడు తెలియదా ..తాము ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వుద్యోగులమని?  మరి ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులుగా  ఉంటూ రాని తెలంగాణా వంకతో విధులు ఎగ్గొడితే అప్పనంగా జీతాలు ఇవ్వాలా?  ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కోదండరాం రెండేళ్లుగా ఏం చేస్తున్నారు?  ఆయనకి కాన్దక్టు రూల్సు వర్తించవా?  అంతే కాదు. ఈ తీర్పు  కేవలం ఉద్యోగులకే కాక - పని చేయని మంత్రులకూ, శాసన సభ్యులకి  కూడా వర్తింప జేయాలి.  శాసన సభ్యులందరికీ తెలుసు  తాము ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో ఉన్నామని!  అలాగే మంత్రులకి కూడా తెలుసు.. తాము 23 జిల్లాలకు సేవ చేయాల్సిన బాధ్యత తమకి వుందని! అటువంటిది ఉద్యమం పేరుతొ విధులు ఎగ్గొడుతున్న మంత్రి వర్యులకి జీతాలు ఆపాలి.  సౌకర్యాలు తొలగించాలి. కోర్టు సు మోటో గా ఈ విషయంలో కలుగ జేసుకొని పని చేయని ప్రొఫెసర్లకి,రాజకీయులకి తగిన గుణ పాఠం చెప్పాలి.   

No comments:

Post a Comment