Sunday, August 10, 2014

దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి!

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమట ! సంప్రదాయాలని పాటించటం లేదట!  ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ చట్టంలోని 8వ అధికరణం ప్రకారం గవర్నరుకి విశేషాదికారాలని కట్టబెడుతూ కేంద్రం రాసిన లేఖకి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ స్పందన అది !  దయ్యాలు వేదాలు వల్లించటం అంటే సరిగ్గా ఇదే అనాలి.  ఏ సమాఖ్య స్ఫూర్తిని పాటించి, ఏ సంప్రదాయాలు పాటించి తెలంగాణా రాష్ట్రం సాధించుకున్నారో ఒకసారి వారి అంతరాత్మలని ప్రశ్నించుకోవాలి.   సంపూర్తిగా అభివృద్ది చెందిన రాజధాని ని కబ్జా చేస్తూ, తల్లి రాష్ట్రానికే రాజధాని లేకుండా తన్ని తగలేస్తూ కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయటమనే సంప్రదాయం ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా?  ఈ సరికొత్త సంప్రదాయానికి తెర తీసింది ఇప్పుడే కదా!  అలాగే ఒక రాష్ట్ర శాసన సభ అభిప్రాయం కోసం పంపిన బిల్లుని తిరస్కరించి పంపినప్పటికీ, దానిని ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్రం తాను  అనుకున్న పద్ధతిలో తెలుగు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేయటం ఏ విధమైన సమాఖ్య స్ఫూర్తి అనిపించుకుంటుందో  ఎవ్వరూ చెప్పలెరు.  అప్పుడు గుర్తుకి రాని సంప్రదాయాలు, స్పూర్తులు ఇప్పుడే వారికి జ్ఞప్తికి రావటం ఆశ్చర్యం!  అయినా కూడా, విద్వేషాల పునాదుల పై ఉద్యమం నడిపి,  ప్రత్యెక రాష్ట్రం సాధించిన తరువాత కూడా - విద్వేషాలను పెంచే రీతిలోనే పరిపాలన సాగిస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా?  చట్ట సభల్లో ఆమోదం పొందిన విభజన చట్టంలోని అంశాలని తిరస్కరించటం అంటే ఖచ్చితంగా
రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమే అవుతుంది.   ఓ పక్క పిల్ల నాయకులు భారత దేశంలో బలవంతంగా కలుపబడ్డామని వాపోతున్నారు!   ఇక స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందిన విభజన చట్టానికి వ్యతిరేకంగా ధిక్కారం చూపుతుంటే కేంద్రం చర్యలు తీసుకోక తప్పదు... 

Thursday, July 31, 2014

కిష్కింద కాండ కి కారణమెవరు?

భారత దేశపు అత్యున్నత చట్ట సభల్లో ఆమోదింపబడిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పదేళ్ళ పాటు  హైదరాబాదు పై ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కూడా సమాన హక్కులు వున్నా కూడా, ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం  చేస్తోంది ఎవరు? 




విద్యా, ఉద్యోగ విషయాల్లో  ఆర్టికిల్ 371 (డి) అన్ని ప్రాంతాల వారికి సమానంగా వర్తిస్తుందని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా కూడా,  స్థానికత పేరున వివాదం సృష్టిస్తోంది ఎవరు?  









అందుకే దేశంలో వెనుకబడ్డ  ప్రాంతాలంటూ ఏవైనా వుంటే వాటికి ప్రత్యెక ప్యాకేజీ లివ్వాలే గానీ ప్రత్యెక రాష్ట్రాలు ఇచ్చుకుంటూ పొతే - అది మొరటోడికి మొగలి పువ్వు ఇచ్చినట్లే అవుతుంది...

Wednesday, May 7, 2014

సీమాంధ్ర రాజకీయ నాయకులను/పార్టీలను నేను తిరస్కరించాను !

అత్యంత హేయమైన పధ్ధతిలో, అవమానకరమైన రీతిన తెలుగు జాతిని, తెలుగు రాష్ట్రాన్ని విడగొట్టిన దుష్ట శక్తి కాంగ్రెస్ పార్టీ! ఇక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష స్థానంలో వుండి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన పరమ లోప భూయిష్టమైన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లుని (అద్వానీ గారే సెలవిచ్చారు) - అనేక రాజ్యాంగ సవరణలు అవసరమైన పరిస్థితిలో కూడా వాటిని విస్మరించి కాంగ్రెస్ అకృత్యానికి వంత పాడిన చరిత్ర హీనమైన పార్టీ బీజేపీ ! మిగిలిన పార్టీల సంగతి చెప్పనక్కరలెదు. అవకాశ వాదమే తప్ప, అవమానానికి గురి అవుతున్న తెలుగు జాతికి అండగా నిలబడ్డ పార్టీ లేనే లెదు. అందుకే ఈ రోజు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో నేను రంగంలో నిలబడ్డ అన్ని రాజకీయ పార్టీల అభ్యర్ధులని తిరస్కరిస్తూ నా వోటు "నోటా" కి వెసాను. మనది ప్రజాస్వామ్య దేశం. మెజారిటీ ప్రజల అభిమతం ప్రకారం ఏదేని రాజకీయ పార్టీ గాని, అభ్యర్ధి కానీ నెగ్గవచ్చు గాక...నా వ్యక్తిగత హోదాలో మాత్రం అవకాశ వాద పార్టీలను, వాటి అభ్యర్ధులను తిరస్కరించి సంతృప్తి చెందాను. వోటింగ్ మెషిన్ లో నోటా బటన్ ప్రవేశ పెట్టి తిరస్కార వోటుకి అవకాశం కలిగించిన భారత ఎన్నికల కమిషన్ వారికి ధన్యవాదాలు!

Wednesday, March 19, 2014

జీఓఎం కు వచ్చిన ఈ మెయిళ్లు 13,251 మాత్రమెనట !


రాష్ట్ర విభజనకై ఏర్పాటు చేసిన జీఒఎం కి వచ్చిన ఈ మెయిల్స్ విషయమై గతంలో నేను ఒక టపా వేయటం జరిగింది.  అలాగే ఇదే విషయమై కేంద్ర హొమ్ శాఖకి సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం వివరాలు కూడా వేరొక టపా లో  తెలియజేశాను.   విజ్ఞాపన అందిన మూడు నెలల తరువాత కేంద్ర హొమ్ శాఖ తీరికగా పంపిన సమాధానం ఇక్కడ పొందుపరుస్తున్నాను.      

Kindly provide the following information at the earliest : 

1.Howmany emails were received in response to the invitation of feed back on terms of reference of Group of Ministers (GoM) constituted for bifurcation of Andhra Pradesh 

Reply: 13,251 emails were received in response to the invitation of feedback by the GoM. 

2.Howmany emails supported for bifurcation of Andhra Pradesh and howmany emails opposed the bifurcation of Andhra Pradesh 

Reply: Information not maintained by the CPIO.

3.Whether the GoM has studied all the emails received in this regard 
4.Whether the response of the public vide emails is being incorported in the report of GoM

Reply: (Point Nos 3 & 4) Do not come under the purview of the RTI Act,2005.

5.It is requested to kindly provide the soft copies of the mails received or to made them accessible for public view in any website 

Reply: Right now, it is not technically feasible to make available in soft copy or through web.  However, efforts are being made to make it feasible. 

పార్లమెంటు తలుపులు మూసి, ప్రత్యక్ష ప్రసారాలు కట్టి పెట్టి,  బాధిత ప్రాంత ప్రతినిధులని వెళ్ళగొట్టి - ఉరుకులు పరుగుల మీద అడ్డగోలు రాష్ట్ర విభజన చేసిన కేంద్రానికి ప్రజాభిప్రాయాన్ని చదివే తీరిక కూడా లేదని స్పష్టమై పోయింది.   ప్రజాభిప్రాయానికి ఎలాగూ పాతరేశారు, కనీసం రాజ్యాంగ బద్ధత పాటించారా అంటే,  అదీ లేదు.  ఆర్టికిల్ 371 (D) గురించి అటార్నీ జనరల్ అభిప్రాయం ఏమిటి అన్నది ఈ రోజుకీ బ్రహ్మ పదార్దమే ! ఇదే విషయమై సమాచార హక్కు చట్టం కింద నేను విచారిస్తే నాకు లభించిన  సమాధానం ఇది !    

1.Whether any report has been submitted by the Attorney General of India to the Group of Ministers (GoM) constituted for bifurcation of Andhra Pradesh regarding dealing with status of Article 371 (D) of Constitution of India for bifurcation of the Andhra Pradesh .. 
2.If submitted, what is the report submitted by the Attorney General in this regard and whether GoM has incorporated the suggestion given by the Attorney General in their report .. 

Reply :- Point Nos.1&2 : No information available with the CPIO

ప్రజానీకం పట్ల గానీ,  రాజ్యాంగ వ్యవస్థల పట్ల గానీ జవాబుదారీ తనం అన్నది ఏ కోశానా లేకుండా నిస్సిగ్గుగా జరిగిన రాష్ట్ర విభజన భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయం... 

Saturday, March 1, 2014

కృష్ణారావు గారి అమాయకత్వం!



రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రేతర వ్యక్తి ఉండాలంటూ ప్రస్తుత అధికారి మహంతి పదవీ కాలాన్ని పొడిగించటం తెలుగు అధికారులని అవమానించటమే అని సీనియర్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు మండి  పడ్డారు.  

కృష్ణారావు గారు సీనియర్ అధికారి.  తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణాధికారిగా  సమర్ధవంతంగా పని చేసి మంచి పేరు తెచ్చుకొన్న వ్యక్తి.  అయితే సాధారణంగా ప్రభుత్వంలో ఉన్న సీనియర్ స్థాయి అధికారులకి ప్రభుత్వ పోకడలు, సాధారణ ప్రజలకన్నా ఎక్కువగానే ఆకళింపు అవుతాయి.  అటువంటప్పుడు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో తెలుగు వారికి గానీ, తెలుగు వారి అభిప్రాయాలకి గానీ  చోటే లేదన్న విషయం సామాన్య పౌరునికి కూడా అవగతమై పోయింది.  రాష్ట్ర శాసన సభ అభిప్రాయానికే పూచిక పుల్ల విలువనివ్వని కేంద్రం, రాష్ట్ర అధికారులకి విలువనిస్తుందని ఆయన ఎలా ఆశించారో?   అంతే కాదు.. సీమాంధ్ర ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు తమ జీతాల్ని, జీవితాల్ని పణంగా పెట్టి 66 రోజుల పాటు సమ్మె చేసినా చలించని కేంద్ర ప్రభుత్వం ఆయన 10 రోజుల పాటు ఆర్జిత సెలవు పై వెళితే స్పందిస్తుందా?  గత సంవత్సరం జూలై 30 వ తేదీ తరువాత నుండి తెలుగు వారికి జరిగిన అవమానాల్లో ఇది ఎన్నోది అని లెక్క వేసుకోవటమే మనకి గానీ, కృష్ణారావు గారికి కానీ మిగిలిన కర్తవ్యం! 

Friday, February 21, 2014

తెలంగాణా వచ్చింది మాయా జూదం తోనే!


ధృతరాష్ట్రుని లాగ ప్రధాని,  భీష్మ పితామహునిలాగా అద్వానీ,  కళ్ళు-చెవులు మూసుకొని ఉండగా .. 
  

రాజ్యాంగంలోని ఆర్టికిల్స్ 3,4 అనే శక్తివంతమైన పాచికలతో శకుని పాత్ర ధరించిన కేంద్రం పార్లమెంటు సభల్లో  ఆడిన మాయాజూదం తో తెలంగాణా రాష్ట్రం వచ్చింది... . మార్గం ఏదైనా కూడా  వారనుకొన్న  గమ్యం చేరుకున్న తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు! 




ఇక సీమాంధ్ర !  మాయా జూదంలో సంక్రమించిన ఓటమి ఎప్పటికీ ఓటమి కానేరదు!  ఈ ప్రాంతపు రాజకీయ నాయకుల శల్య సారధ్యంతో దెబ్బ తిన్న సీమాంధ్ర నూతన రాష్ట్రం  - నేలకి కొట్టిన బంతి లాగ పైకి లేవాలి!  ఏ ఇతర రాష్ట్రాల వారు కుట్రలు పన్ని తెలుగు వారిని బలహీన పరచాలని చూసారో - వారందరూ ఈర్ష్య పడేలా స్వల్ప కాలంలోనే గణనీయమైన అభివృద్ది సాధించి తెలుగు వారి సత్తా  ఏమిటో చాటాలి!  ఈ గమ్యం చేరటానికి సీమాంధ్ర కి కూడా శుభ కామనలు!  

Thursday, February 20, 2014

విభజన ఇస్తున్న విష ఫలాలు !

పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని - ఒక లక్ష్యాలు, ఉద్దేశాలు లేని బిల్లుతో - కేవలం రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా అడ్డగోలు విభజనకి కాంగ్రేస్  పార్టీ తెగబడింది. 


 ఇరు పక్షాల అంగీకారం లేకుండా, కేవలం తెలంగాణా ప్రాంత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తూ సీమాంద్ర పై స్వయంగాకేంద్రమే సవతి తల్లి ప్రేమ చూపటం ఇతర రాష్ట్రాలకు కూడా అలుసై పోయింది. అందుకే అడ్డగోలు విభజన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందటం ఆలస్యం.. తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాలు తమకు ఇవ్వాలని తమిళనాడు నాయకులు డిమాండ్ చేయటం మొదలు పెట్టారు. రేపు ఒడిసా వారు సింహాచలాన్ని, కర్నాటక వారు మంత్రాలయాన్ని కూడా అడుగుతారు. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఇది బయట రాష్ట్రాల సంగతి..


ఇక మన రాష్ట్రంలోనే, ప్రస్తుత రాజధాని లోనే తెలంగాణా ప్రాంత ఉద్యోగులు దాష్టీకం మొదలు పెట్టేసారు.  విభజన జరిగే వరకు కూడా ఆగలేక పోతున్న వారు రేపు బిల్లు చట్ట బధ్ధమైతె సీమాంధ్రుల ని ప్రశాంతంగా ఉద్యోగాలు చేయనిస్తారా? కేంద్రం కందిరీగల తుట్టెని కదిపింది... ఇది రాష్ట్రంలోని రెండు ప్రాంతాలని ఏ పతనపు అంచులకి తీసుకు పోతుందో కాలమే తేల్చాలి!     

Wednesday, February 19, 2014

కాంగ్రెస్ అంటించిన కార్చిచ్చు ఆంద్ర ప్రదేశ్ తో ఆగదు !


"మా నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణా కి రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామని యూపీఏ-1 ఉన్నప్పుడే  మాట ఇచ్చారు. కనుక తెలంగాణా రాష్ట్రం ఇవ్వటం మా విధి.  దానినే మేం నిర్వర్తించాం"    

ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్ర పునర్విభజన బిల్లు లోక్ సభ ఆమోదం పొందిన వెంటనే లోక్ సభ బయట కేంద్ర హొమ్ మంత్రి షిండే ప్రకటన ఇది!  


ఆర్టికిల్ 3 ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయమే లేకుండా -  రాష్ట్రంలో అధిక శాతం ప్రజలు ముక్త కంఠంతో నిరసిస్తున్నా -  చివరికి రాష్ట్ర శాసన సభ, శాసన మండలి తిరస్కరించినా కూడా, కేంద్రమే ఒక నిర్ణయం తీసుకొని ఎంత నిరంకుశంగా, అప్రజాస్వామికంగా అమలు పరచ వచ్చో ఆంద్ర ప్రదేశ్ విషయంలో ఉదాహరణ చూపింది.  23 జిల్లాల భవితవ్యాన్ని కేవలం 23 నిమిషాల చర్చ(?) తో ఎలా నిర్దేశించ వచ్చో అన్న దానికి ఒక దారి చూపింది.  అయితే ఈ దారి ఎన్ని విపరిణామాలకి   దోవ తీస్తుంది అన్నది వెంటనే తెలిసి పోయింది.  తెలంగాణా ఏర్పాటు చేసిన విధంగానే గోర్ఖాలాండ్ ను కూడా  ఆర్టికిల్ 3 కింద వెంటనే ఏర్పాటు చేయాలని గోర్ఖా జన్ ముక్తి మోర్చా 
డిమాండ్    చేసింది.  

The Gorkha Janmukti Morcha extends heartiest congratulations to the people of Telangana as the bill for creation a separate state of Telangana has been passed in the Lok Sabha. We would now request the Centre to similarly consider the just and fair demand for separate state of Gorkhaland, which is amongst the oldest in the country.
Today's passage of the Telengana bill makes it clear that stateconsent is not necessary for its bifurcation, a fact which we have been reiterating for a long time.
Those opposing creation of smaller states have wrongly argued that such consent from state assembly is required before rearranging its boundary.
We, are, confident that the Centre will sooner than later respect the sentiments of the Gorkhaland area and will take an unilateral decision on creating Gorkhaland despite protest from the rest of Bengal. Creation of a separate state of Gorkhaland along the lines of Telengana will fulfil the long standing demand of the people of Darjeeling, Dooars and surrounding Terai regions and bring justice to the Indian Gorkhas.
Congratulations to both the Congress and the BJP for respecting sentiments of Telengana people and supporting the bill.

 రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతోనిమిత్తం లేకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయ వచ్చని స్పష్టం అయిన దరిమిలా దశాబ్దాలు గా ఉద్యమం వున్నగోర్ఖాలాండ్ కూడా వెంటనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇది ఇక్కడితో ఆగదు... రాబోయే కేంద్ర ప్రభుత్వాల్లో తమకు పరపతి ఉన్న ప్రాంతాల ప్రజలందరూ ప్రత్యెక రాష్ట్రాలు అడిగే పరిస్థితి తప్పక వచ్చి తీరుతుంది. ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విభజన వాదులు కేంద్రం తో కుమ్మక్కు అయ్యి ప్రత్యెక రాష్ట్రాన్ని సాధించిన వైనం వారికి మంచి మార్గ దర్శనమవుతుంది. చివరికి భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చే సమయానికి ఎన్ని రాజ్యాలు, సంస్థానాలు వున్నాయో అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు ఏర్పడినా ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు !

Tuesday, February 18, 2014

తెలుగు జాతి వంచింప బడింది..

కేవలం ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం తెలుగు జాతి ఘోరంగా వంచింప బడింది. హేతు బద్ధత అన్నది లేకుండా ప్రధాన పతిపక్షం కూడా కేంద్ర వంచనకి వంత పాట పాడి తెలుగు వారి గుండెల్లో విభజన కత్తి దించింది.   టేబుల్ ఐటెం గా కాబినెట్ నోట్ తయారైన నాటినుండి లోక్ సభలో బిల్లు ప్రవేశ పెట్టె సమయం వరకు అన్ని ప్రక్రియల్లోను వంచనే!  బాధిత ప్రాంతం యొక్క వాణి ని నొక్కి పెట్టి, సభలో వారికి సరైన ప్రాతినిధ్యమే అన్నది లేకుండా చేసి - జరుగుతున్న దురంతాన్ని ప్రజానీకం తిలకించకుండా ప్రత్యక్ష ప్రసారాలు కట్టి పెట్టి, లోక్ సభ తలుపులు మూసిపెట్టి చేసిన దురాగతం భారత ప్రజాస్వామ్య చరిత్రకే మాయని  మచ్చ..  తెలుగు తల్లి రక్తాశ్రువులు కారుస్తుంటే కేంద్రంతో కుమ్మక్కు అయిన వేర్పాటు వాదులు అడ్డ తోవలో రాష్ట్రం ప్రకటింప బడ్డా కూడా అఖండ విజయం సాధించినట్లు రొమ్ములు విరుచుకుంటే సిగ్గు చేటు.  విభజన కాష్టంలో పదవుల బొగ్గులు  ఏరుకుందామనే రాజకీయ నాయకులు  -  వారు ఏ పార్టీ వారైనా సరె.. ఏ ప్రాంతం వారైనా సరే .. తప్పనిసరిగా చరిత్ర హీనులే!  తెలుగు జాతికి ఈరోజు మర్చి పోలేని దుర్దినం అనటంలో ఏ మాత్రం సందేహం లెదు... 

Sunday, February 16, 2014

సీమాంధ్ర దేశం అడిగే పరిస్థితి ఎందుకు వచ్చింది?



సున్నితమైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాన్ని ఎంత అధ్వాన్నంగా యూపీఏ ప్రభుత్వం హ్యాండిల్ చేసిందో పై ప్రకటన చూస్తె అర్ధం అవుతుంది.  గతంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలన్నీ ఎస్సార్సీ ద్వారానో, కమిటీల నివేదికల ద్వారానో లేదా ఆయా రాష్ట్రాల శాసన సభల తీర్మానాలతొనొ ఏర్పడ్డాయి.  అంతే తప్ప ఆర్టికిల్ 3 కింద కేంద్ర ప్రభుత్వానికి వున్న అధికారాన్ని దుర్వినియోగ పరుస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం అన్నదే లేకుండా  జరగలేదు.   ఆర్టికిల్ 3 కింద కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగ పరంగా అధికారం వుంది అన్నది నిజమె.  అయితే ఆ  విచక్షణాధికారాన్ని వినియోగించే ముందు రాష్ట్రంలోని రెండు ప్రాంతాల వారి అంగీకారం ఉందా లేదా అన్న ఆలోచనే లేకుండా కేవలం ఒక ప్రాంత ప్రయోజనాలకే కొమ్ము కాస్తూ విభజన ప్రతిపాదించ బట్టే -  నేడు విభజన బిల్లు ని కూడా దొంగ చాటుగా,  ప్రతి పక్షాలకి సమాచారం కూడా లేకుండా లోక్ సభలో ప్రవేశ పెట్ట వలసిన దుస్థితి దాపురించింది.  రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించి పంపిన బిల్లుని కూడా నిస్సిగ్గుగా,  పార్లమెంటు సమావేశాలు వారంలో ముగుస్తాయనగా,  3 నెలలలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందనగా ప్రవేశ పెట్టటమే అప్రజాస్వామికం.  వోట్ ఆన్ అకౌంట్  బడ్జెట్ ఎందుకు ప్రవేశ పెడతారు?  రెండు నెలలలో ముగిసి పోయే కాలపరిమితిలో ఉన్న  ప్రభుత్వం  కీలక నిర్ణయాలు తీసుకుంటూ పూర్తి  స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టకూడదు కనుక!  అలాగే రాష్ట్ర విభజన వంటి కీలక నిర్ణయం కూడా 52 నెలలు నిద్ర పోయిన కేంద్రం చివరి 8 నెలలలో తీసుకొని హడావిడిగా అమలు పరచాలని చూడటం - కేవలం రాబోయే ఎన్నికలలో ప్రయోజనం పొందుదామన్న దురుద్దేశ్యం తోనే అన్నది స్పష్టం.  ఆ నిర్ణయం అమలు పరిచే విషయంలో కూడా సీమాంద్ర ప్రాంత ప్రజల, ప్రతినిధుల, మంత్రుల విన్నపాలని పూర్తిగా పెడ చెవిన పెట్టి, స్వయానా కేంద్రమే తెలంగాణా ప్రాంత ప్రతినిధిగా అవతారమెత్తి విభజన బిల్లు తయారు చేయబట్టే నేడు ఈ ఉద్రిక్త పరిస్థితులు దాపురించాయి.   పాలక పక్షం సంగతి అలా ఉంచితే ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ కూడా తాము చిన్న రాష్ట్రాలకి అనుకూలమంటూ తెలంగాణ కి మద్దతు ప్రకటించటం శోచనీయం.  తాము 3 రాష్ట్రాలు ఇచ్చామని గర్వంగా చెప్పుకొనే బీజేపీ పార్టీకి ఆ మూడు రాష్ట్రాలు ఏ పరిస్థితుల్లో ఏర్పడ్డాయో తెలియదనుకోవాలా?  బీజేపీ ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాల విషయంలో ఆయా రాష్ట్రాల శాసన సభలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపితే విభజన ప్రక్రియ సాఫీగా జరిగిందన్న సంగతి మరువకూడదు.  పైగా అప్పుడు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలే కొత్తగా రాజధానులు ఏర్పాటు చేసుకున్నాయి తప్ప, పూర్తిగా అభివృద్ది చెందిన ఉమ్మడి రాజధానిని కబ్జా చేస్తూ, తల్లి రాష్ట్రాన్నే తన్ని తగలేసే రీతిగా ఏర్పడలేదు.  ఇవేమీ ఆలోచించకుండా గుడ్డిగా తెలంగాణాకి మద్దతు అంటే సీమాంధ్ర పరిస్థితి ఏమిటి?  ఈ విధంగా పాలక పక్షం - ప్రతిపక్షం ఒక్కటై పోయి సీమాంద్ర  ప్రాంత ప్రయోజనాలకి ఇసుమంతైనా విలువనివ్వకుండా ముందుకు సాగటం ఘోరం.  దొంగ చాటుగా బిల్లుని ప్రవేశ పెట్టటానికి దిగజారిన కేంద్రం,  ఆ సమయంలో నిరసనలకి వచ్చిన సీమాంధ్ర ప్రజా ప్రతినిధులపై ఇతర ప్రాంత/ఇతర రాష్ట్ర ఎంపీలతో భౌతిక దాడులు చెయించటమే గాక విభజన బిల్లు లోక్ సభ ఆస్తి అని కేంద్ర హొమ్ మంత్రి ప్రకటించిన సమయంలో సీమాంద్ర  సభ్యులని సభనుండి  బహిష్కరించి - బాధిత ప్రాంతానికి సరైన ప్రాతినిధ్యమే సభలో లేకుండా చేసి - బిల్లుని ఆమోదింప జేసుకుందామని కుట్ర పన్నితె ఇక సీమాంధ్రకి గత్యంతరం ఏమిటి?  ప్రత్యెక దేశం వంటి  డిమాండ్లు రావటంలో ఆశ్చర్యం ఏమి ఉంటుంది? 
(ప్రత్యెక దేశం వాదాన్ని సమర్ధించటం నా ఉద్దేశ్యం కాదు.  పరిస్థితి ఇంతలా ఎందుకు దిగజారింది అన్న ఆవేదనే ఇది. )