Monday, February 28, 2011

తెలంగాణా గోల తప్ప ప్రజల గోడు పట్టదా?

పని చేయని ప్రభుత్వోద్యోగులు + పరీక్షలు రాయని విద్యార్ధులు + స్వార్ధ రాజకీయాల కోసం దొంగ ఉద్యమాలు చేసే తెలబాన్ గుంపులు + చేత గాక చోద్యం చూసే ప్రభుత్వం ..... వీరందరి మధ్య సామాన్య మధ్య తరగతి /బడుగు జీవుల సమస్యల గురించి ఆలోచించే వాడెవడైనా వున్నాడా? అసలు ప్రత్యెక రాష్ట్రం వచ్చినంత మాత్రాన ఉద్యోగులకి, విద్యార్ధులకి ఒరిగేదేమిటి? పరీక్షలు బహిష్కరించమని రెచ్చగొడుతున్న ప్రొఫెసర్ కి జీతంలో ఒక్క రూపాయి కూడా నష్టం వుండదు. కానీ  నష్ట పోతున్న విద్యా సంవత్సరం గురించిన ఆలోచన రోడ్డెక్కుతున్న విద్యార్ధులకి ఉండద్దా?  వుద్యోగులైనా అంతే! ప్రత్యెక రాష్ట్రం వస్తే స్పెషల్ ఇంక్రిమెంట్ అని తెలబాన్ దొర చెప్పగానే పనులు మానేసి రోడ్ల మీదకి వచ్చేయటమే! డ్యూటీ చేయని ఉద్యోగుల పై శాఖా పరమైన చర్యలు ప్రభుత్వం మొదటి రోజే తీసుకొని వుంటే విషయం ఇంత ముదిరేది కాదు.  పని చేయని వారి పై చర్య తీసుకోవటం వేధింపు చర్య కానే కాదు.  ప్రభుత్వం తక్షణం అలసత్వాన్ని వీడి పాలనా యంత్రాంగాన్ని పట్టాలెక్కించాలి. అలాగే రైల్ రోకో పేరు మీద పట్టాలెక్కటానికి సిద్ధమవుతున్న వారిని అదుపు చేయాల్సింది పోయి రైల్వే శాఖ ముందుగానే రైళ్ళని రద్దు చేయటం చాల దారుణం. ఏతా వాతా తేలేదేమంటే సామాన్య ప్రజల ఇక్కట్లనేవి ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టట్లేదని.... ప్రశాంత జీవన పరిస్థితులకి  పాడె   కట్టి వూరేగిస్తున్న తెలబాన్ గుంపుల అక్రుత్యాలని అడ్డుకోలేని పక్షంలో తక్షణం ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలి. 

Saturday, February 26, 2011

ఉద్యమం కాదు..... అది వున్మాదమే!

                    ఈజిప్ట్ తరహా ఉద్యమం.......గుజ్జర్ల తరహా ఆందోళన వంటి రంగులు పూసుకొని మార్చి ఒకటో తేదీ నుండి తెలంగాణా ప్రాంతంలో విధ్వంసానికి మళ్ళీ తెలబాన్లు ముహూర్తం పెట్టారు.  ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల సహాయ నిరాకరణ, 48గంటల బందు వంటి కార్యక్రమాలతో విసుగెత్తి పోయిన సామాన్య ప్రజలకి మళ్ళీ రైల్ రోకోలు, రాస్తా రోకోలు భరించలేనివిగా తయారవుతున్నాయి. అసలు ఈజిప్టు ఉద్యమానికీ తెలబాన్ల రగడకీ ఏమైనా సంబంధం ఉందా? నియంతృత్వానికి వ్యతిరేకంగా సాగింది ఈజిప్టు ఉద్యమం...కానీ ఇక్కడో? కొద్ది మంది తెలబాన్ల రాజకీయ మనుగడ కోసం రాష్ట్ర అభివృద్ధినే పణంగా పెడుతూ చేస్తున్న విధ్వంస కాండ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల చేత కాని తనంతో నిస్సిగ్గుగా కొన సాగుతోంది.  టీవీ కెమెరాల సాక్షిగా "కొట్టండిరా వాణ్ని" అని తోటి శాసన సభ్యునికేసి వేలు చూపించి మరీ రౌడీలని ఎగదోసిన పిల్ల తెలబాన్ నాయకుడి పై ఈ రోజు వరకు పోలీసులు చర్యలు తీసుకున్న దాఖలా లేదు. పనులకి ఎగనామం పెట్టి వేర్పాటు వాదులతో చేరి ఆందోళన చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? కూర్చో పెట్టి వాళ్లకి జీతాలు ఇస్తే రాష్ట్రంలోని మిగత ప్రాంతాల్లోని ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బ తినదా? "ఎస్మా"వంటి చట్టాలు ఎందుకు వున్నట్లు? అలంకారానికా? ప్రజలు ఇక్కట్ల పాలు అవుతుంటే చోద్యం చూస్తూ కూచోవడానికా ప్రభుత్వాధినేతలు వున్నది? అలాగే దేశంలో గోర్ఖలాండ్, బోడోలాండ్ వంటి అనేక వేర్పాటు వాద ఉద్యమాలు నివురు గప్పిన నిప్పుల్లా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న వేర్పాటు వాద విధ్వంసాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోక పోవటం ఏ మాత్రం మంచిది కాదు. కొద్ది మంది రాజకీయ నిరుద్యోగులకే తప్ప సామాన్య ప్రజలకి ఏ మాత్రం సంబంధం లేని ప్రత్యెక రాష్ట్రం నినాదం మొగ్గలోనే తుంచి వేస్తె ఏ సమస్య వుండేది కాదు. కానీ మొదట్లో నిర్లక్ష్యం చేయటంతో ఇప్పుడు వేర్పాటు వాద వట వృక్షంగా ఎదిగి చివరికి విద్యార్ధుల, అమాయక ప్రజల మనసులు కూడా కలుషితం చేసే స్థితికి వచ్చిందంటే దానికి కేవలం అధికారంలో ఉన్న ప్రభుత్వాలదే బాధ్యత.  ఈ విధ్వంసాలు ఏ అడ్డు అదుపు లేకుండా కొన సాగటానికి కేంద్ర సహకారం ఉందేమో అన్న అనుమానం ఇప్పుడు అందరికీ వస్తోంది. ఎందుకంటే ఈ ఆందోళనలు చేయి దాటే పరిస్థితి వచ్చే వరకు వేచి ఉండి, ఇక తప్పని సరి పరిస్థితుల్లో తెలంగాణా ఇచ్చేస్తున్నామని ప్రకటించేసి... క్రెడిట్ తాము కొట్టేద్దామని కేంద్రం ఆలోచన కావచ్చు.  అదే కనుక కేంద్రం ఉద్దేశ్యం అయితే అది ఖచ్చితంగా ఆత్మ హత్యా సదృశమే అవుతుంది. కేంద్రం ఆ నిర్ణయం వెలువరించిన మరుక్షణం ఇప్పుడు జరుగుతున్న విధ్వంసానికి కొన్ని రెట్లు సీమ,ఆంధ్రల్లో చెలరేగటం ఖాయం.  ప్రత్యెక రాష్ట్రం కోసం ఉన్న డిమాండ్ లో ఎంత హేతు బద్ధత వుందో, సమస్య పరిష్కారానికి ఏది అత్యుత్తమ మార్గమో అన్నది కేంద్రం స్వయంగా ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ కమిటీ తేల్చేసింది. మరి ఇంకా ఆ పరిష్కారం దిశగా చర్యలు తీసుకోకుండా కేంద్రం ఎందుకు కాల యాపన చేస్తున్నట్లు?  ఒక పక్క రాష్ట్రంలో పరిపాలన స్తంభించి పోతుంటే నివారణ చర్యలు తీసుకోకుండా మీన మేషాలు ఎందుకు లెక్కిస్తున్నట్లు?

Wednesday, February 23, 2011

అరాచకత్వానికి అంతం ఎప్పుడు?





రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అసలు ఇక్కడ ప్రభుత్వం అనేది పని చేస్తోందా అని సందేహం వస్తోంది. వేర్పాటు వాదం వెర్రి తలకెక్కి ఏకంగా 48 గంటల పాటు ప్రజా జీవితాన్ని స్తంభింప జేయడాన్ని సమర్ధంగా ఎదుర్కోలేక చేష్టలుడిగి చూస్తున్న ప్రభుత్వ వైఖరి గర్హనీయం. ప్రత్యెక రాష్ట్రం కోసం దేశంలో చాల చోట్ల డిమాండ్లు వున్నాయి. కానీ ఎక్కడా కూడా ఇక్కడ ఉన్నంత అరాచకత్వం, అసమర్ధ పాలన మనం చూడలేదు. చివరికి శాసన సభ సైతం రౌడీ దర్బార్ గా మారి పోవటం బాధాకరం.  గవర్నరు కుర్చీని లాగేడొకడు! బల్లల పైకి ఎక్కి తాండవం ఆడేది మరొకడు! వీళ్ళా ప్రజా ప్రతినిధులు?? కేవలం ఐదు రోజులు సస్పెండ్ చేస్తే వారిలో మార్పు వస్తుందా? సభా మర్యాదలు పాటించని వారిని అసలు సభలోకి అనుమతించకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే జేపీ చెప్పినట్లు ఏనుగు లాంటి సమస్య ఎదురుగా వుంటే పట్టనట్లుగా పాలక పక్షం,ప్రధాన ప్రతి పక్షం కూడా వ్యవహరించటం విచిత్రం.  ఆయనే చెప్పినట్లు ఇంక ముసుగులో గుద్దులాట అనవసరం. పాలక పక్షం, ప్రతి పక్షం రెండూ కూడా తమ స్వార్ధ రాజకీయాల్ని పక్కన పెట్టి విశాలాంధ్ర హితం కోసం చిత్త శుద్ధితో పని చేయాలి. లేకపోతె  ఇది దేశంలోని మిగతా వేర్పాటు వాద ఉద్యమాల వారికి తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది.ఉద్యమం ముసుగులో తామేం చేసినా చెల్లి పోతుందన్న అభిప్రాయం దేశంలోని పలు చోట్ల విస్తరిస్తే అది మరింత ఆస్థిరతకి  దారి తీస్తుంది. కనుక కేంద్రం ఈ విషయం లో జోక్యం చేసుకొని వెంటనే ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించటమే గాక కోతి పుండు బ్రహ్మ రాక్షసి అయినట్లుగా పెచ్చు మీరిన వేర్పాటు వాదాన్ని కఠినమైన మిలటరీ చర్యతోనైనా అణచి వేయాలి.

Thursday, February 17, 2011

వేర్పాటు వాదం కాదు ఇది తీవ్ర వాదమే!

ఉద్యమం ముసుగులో తాము ఏమి చేసినా చెల్లి పోతుందన్న అహంకారంతో ఒళ్ళు మదించిన తెలబాన్ శాసన సభ్యులు నేడు నిజాయితీకి, నిక్కచ్చిగా మాట్లాడే స్వభావానికి మారు పేరైన జయ ప్రకాష్ నారాయణ పై భౌతిక దాడికి దిగటం ఘోరం.  జే.పీ ఏనాడు తాను సమైక్య వాదినని ప్రకటించుకోలేదు. తప్పు ఎవరి వైపు వున్నా సూటిగా విమర్శించటం ఆయన నైజం. ఆయన గురించి గతంలో రాసిన టపా ఇక్కడ చదవండి.
శాసన సభ్యులు గూండాల్లా, వీధి రౌడీల్లా ప్రవర్తించటం ఇంత వరకు బీహారు వంటి రాష్ట్రాల్లోనే చూసాం. ఆ జాడ్యం ఇప్పుడు మనకీ అంటుకుంది. గవర్నరు ప్రసంగాన్ని అడ్డుకోవడం సరి కాదన్నందుకే జేపీ పై దాడి చేయటం హేయమైన చర్య.  అసెంబ్లీ మీడియా పాయింట్ లో జేపీ చెప్పినవన్నీ అక్షర సత్యాలే. మంచి వాడి మౌనం చెడ్డ వాడి దుర్మార్గం కన్నా ప్రమాదకరమైనదని ధైర్యంగా ప్రకటించిన జేపీ కి అభినందనలు. ఆయన చెప్పినట్లు రాజ్యాంగ బద్దంగా ప్రభుత్వాన్ని నడపలేనపుడు ఈ చేతకాని ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించటం ప్రస్తుత  పరిస్థితులలో అత్యావశ్యకం. అలాగే తొండ ముదిరి ఊసర వెల్లి అయినట్లు తీవ్ర వాదంగా ముదిరిన వేర్పాటు వాదాన్ని ఉక్కు పాదంతో అణచి వేయటం కూడా కేంద్ర ప్రభుత్వ తక్షణ కర్తవ్యం.

తెలబాన్ అకృత్యాలకి అంతు లేదా?

రాష్ట్ర రాజధానిలో మళ్ళీ అమర జీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి అపచారం జరిగింది...కే.సి.ఆర్.ని ఒంగోలు ఎంపీ విమర్శించారని ఈ దుశ్చర్యకి పాల్పడ్డారట! ..ఇదే విషయంలో నా మునుపటి టపా చదవండి..
చాన్సు దొరికితే చాలు పొట్టి శ్రీరాములు విగ్రహాల పై దండెత్తుతున్న తెలబాన్లకి ఇంగిత జ్ఞానం అన్నది వున్నదా అని సందేహం వస్తోంది. అసలు తెలంగాణా ఉద్యమానికీ పొట్టి శ్రీరాములు గారికీ ఏమైనా సంబంధం ఉందా? పైగా తెలబాన్ నాయకుణ్ణి ఎవరో విమర్శించారని అమర జీవి విగ్రహాన్ని ధ్వంసం చేయటం మరింత అపచారం. అసలు తెలబాన్ నాయకునికి అమర జీవి తో ఏమైనా పోలిక ఉందా? తెలుగు వారికి స్వంత రాష్ట్రం కోసం నిస్వార్ధంగా ప్రాణ త్యాగం చేసింది పొట్టి శ్రీరాములు. స్వార్ధ ప్రయోజనాల కోసం దొంగ దీక్షలు చేసి పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని పాడు బెట్టిన ఘనత తెలబాన్ నాయకుడిది! తెలంగాణకి ఎవరైనా అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం అని ప్రగల్భాలు పలికే తెలబాన్లకి ఈ విగ్రహాలు అడ్డంగా కనిపించాయా?  మన జాతీయ పతాకాన్ని లేదా జాతీయ గీతాన్ని అవమానించటం ఎంత నేరమో..మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు పొట్టి శ్రీరాములు విగ్రహాలని అవమానించటం అంతే నేరం అవుతుంది. పనీ పాట లేని అల్లరి మూకలు చేసే ఇటువంటి ఉన్మాద చర్యలని ఇక ఎంత మాత్రం సహించకూడదు. ఉద్యమం పేరుతొ ఇటువంటి దుశ్చర్యలకి ప్రేరేపించే విధ్వంసకారులైన నాయకులని కూడా ప్రభుత్వం కట్టడి చేయాలి.

Monday, February 14, 2011

వాలెంటైన్స్ డే అయితే వర్రీ ఎందుకు?

ప్రేమికుల రోజు (Valentines Day) గురించి భజరంగ్ దళ కార్య కర్తల ఆగడాలు ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. కేవలం ప్రచార ఆర్భాటం కోసం సంప్రదాయ పరి రక్షకులుగా అవతారం ఎత్తి చేతికి దొరికిన జంటలకి పెళ్ళిళ్ళు చేయటం మూర్ఖత్వమే. మీడియా కూడా అటువంటి వార్తలకి ప్రాధాన్యం ఇవ్వడంతో వారు మరింత రెచ్చి పోతున్నారు.  లౌకిక రాజ్యమైన మన దేశంలో ఇటువంటి చర్యలు దేశ గౌరవానికి మచ్చ తెస్తాయి.  ప్రపంచమే కుగ్రామంగా మారిన నేటి రోజుల్లో ఒక దేశం వారి పండగలు మరో చోట జరుపుకోవటం సర్వ సాధారణం. మన దేశానికి సంబంధించిన దీపావళి, గణేష్ చతుర్ధి ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవట్లేదా? అలాగే ఇష్టమైన వారు ప్రేమికుల రోజు జరుపుకుంటే తప్పు ఎందుకు అవుతుంది? కొన్ని జంటలు ప్రేమికుల రోజు కానుకలు ఇచ్చి పుచ్చుకున్నంత మాత్రాన దేశ సంస్కృతి మంట కలిసి పోతుందా?  కొన్ని తరాల పాటు ముస్లిముల పాలనా,   ఆ తరువాత ఆంగ్లేయుల పాలన సాగినా కూడా తట్టుకొని నిలబడిన మన సంస్కృతి ఆఫ్ట్రాల్ వాలెంటైన్స్ డే సంబరంగా జరుపుకుంటే నిలబడదా?మన సాంప్రదాయాల ప్రకారం వాలంటైన్స్ డే పనికి రానపుడు జనవరి ఒకటో తేదీ ఆంగ్ల సంవత్సరాది కూడా నిషిద్ధమే అవాలి.  కానీ ఆ రోజు హేపీ న్యూ ఇయర్ చెప్పుకోని భజరంగ్ దళ సభ్యుడు ఎవరైనా ఉంటాడా?

Sunday, February 13, 2011

రాజుల సొమ్ము రాళ్ళ పాలు - దేవుని సొమ్ము రైళ్ళ పాలు !

హైదరాబాదులో పాత బస్తీ అభివృద్ది కోసం ఏదైనా ముస్లిం ధార్మిక సంస్థని ఒక్క రూపాయి అడిగే ధైర్యం ప్రభుత్వం చేస్తుందా? లేదు..కానీ తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ది కి మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు కోట్లు కుమ్మరిస్తుందట! ఎవరిచ్చారు బోర్డుకి ఆ అధికారం? 33 మంది ఎంపీలు అధికార పక్షంలో వున్నా మనకి కేంద్ర మంత్రి వర్గంలో దిక్కు మాలిన శాఖలే గతి..రైల్వే వంటి కీలక శాఖలు అన్నీ బెంగాలు, బీహారు లకే..ఆదరణ వున్నా లేక పోయినా కొత్త రైళ్ళు, ప్రాజెక్టులు ఆ రాష్ట్రాలకే....లక్షలాదిగా ప్రయాణీకులు వచ్చి పోయే తిరుపతి రైల్వే స్టేషన్ పై రైల్వే కి వచ్చే ఆదాయాన్ని బెంగాల్, బీహార్ లకి తరలిస్తుంటే అడ్డుకోవటం మాని దేవుని సొమ్ముని మళ్ళింప బూనటం ఆశ్చర్యం. గతంలో కూడా ఎన్.టీ.ఆర్. హయాంలో తిరుపతి లో డ్రైనేజీ అభివృద్ది కోసం టీ.టీ.డీ. నిధుల్ని వాడుకోవాలని చూస్తె హై కోర్టు మొట్టి కాయలు వేసింది. భక్తుల విరాళాలని నిత్యాన్న దానం వంటి సేవా కార్యక్రమాలకో లేదా ధార్మిక ప్రచారానికో వినియోగించాలి గానీ సౌకర్యాల నెపంతో ఇతర శాఖలు చేయాల్సిన కార్యక్రమాల్ని నెత్తిన వేసుకోవడం దుర్వినియోగమే అవుతుంది. టీ.టీ.డీ తక్షణం ఈ ప్రతిపాదనని విరమించుకోవాలి.

Sunday, February 6, 2011

టీ.టీ.డీ. తల తిక్క నిర్ణయం..

టీ.టీ.డీ.మంచి నిర్ణయం అని రాసిన పదహారు రోజులకే మళ్ళీ ఇలా     రాయాల్సివస్తోంది. http://andhraaakasaramanna.blogspot.com/2011/01/blog-post_21.html
తిరుమల ఆలయాన్ని పురావస్తు శాఖ కి అప్పగించాలన్న బుద్ది ఎవరి పుర్రెలో పుట్టిందో కానీ నిబద్ధత గల అధికారిగా పేరున్న కృష్ణా రావు గారి హయాంలో ఈ నిర్ణయం రావడం ఆశ్చర్యం.  అనంత స్వర్ణ మయం వంటి పధకాలు ముందు ముందు రాకుండా ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు తెలిపారు. కానీ అటువంటి పధకాలు రావటానికి గల మూల కారణం ఏమిటి? సేవా తత్పరత ఏ మాత్రం లేకుండా స్వార్ధ ప్రయోజనాలకోసం తమ అధికారాన్ని దుర్వినియోగం చేసే రాజకీయుల్ని బోర్డు సభ్యులుగానూ, చైర్మన్ లు గాను నియమించ బట్టే అటువంటి పధకాలు వస్తున్నాయి. దానికి గాను ఆలయ కార్య నిర్వహణ లో రాజకీయ ప్రమేయాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలి గానీ ఏకంగా పురా వస్తు శాఖకి ఆలయాల్ని అప్పగించటం పరిష్కారం కాదు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకి దర్శనం కల్పించే విషయంలో కొన్ని లోటు పాట్లున్నా ప్రస్తుతం సాఫీగానే సాగుతోంది. కోణార్క్, తంజావూర్ లాంటి ఆలయాలకి భక్తుల తాకిడి అంతగా ఉండదు కాబట్టి అవి ఎవరి ఆధీనంలో వున్నా సమస్య లేదు. కాని తిరుమల ఆలయాన్ని మిగతా వాటితో పోల్చటం వేవేక రహితం.  ఇప్పుడు తిరుమల ఆలయాన్ని చేజేతులా పురా వస్తు శాఖకి అప్పగిస్తే, రాబోయే నియంత్రణల వల్ల భక్తుల తాకిడి ని తట్టుకోవడం సాధ్యమా? ఇటువంటి చిన్న ఆలోచన పాలక మండలికి ఎందుకు రాలేదు? అలాగే ఏడాదికి ఒక్కసారే దర్శనానికి అనుమతించాలన్న ప్రతిపాదన కూడా అర్ధ రహితం. జీవితంలో ఒక్క సారి మక్కా సందర్శిస్తే తృప్తి పడే ముస్లిం ఉంటాడు కానీ ఏడాదికి ఒక్కసారే స్వామి వారిని చూసి తృప్తి పడమంటే ఏ హిందువు సంతృప్తి గా ఉండడు. వీ.ఐ.పీ. దర్శనాలు, ప్రోటోకాల్ మర్యాదలు తగ్గించి భగవంతుని ముందు అందరు సమానులే అన్న న్యాయాన్ని పక్కాగా అమలు చేస్తే ఎన్ని లక్షల మందికైన నిక్షేపంగా శ్రీవారి దర్శనం కలుగ జేయవచ్చు.  అలాగే ఆర్జిత సేవలు కొన్నే కాకుండా అన్ని సేవలు మూల విరాట్టు కి గాక ఉత్సవ మూర్తికే జరిపించేలా నిర్ణయం తీసుకుంటే ఆ సేవల సమయాల్ని కూడా సాధారణ భక్తుల దర్శనం కోసం కేటాయించవచ్చు.