Monday, October 21, 2013

లెస్స పలికిన జెపీ !


సూటిగా, నిక్కచ్చిగా మాట్లాడతారని పేరున్న లోక్ సత్తా నాయకుడు జయ ప్రకాష్ నారాయణ రాష్ట్ర విభజన ప్రక్రియ  పై చేసిన వ్యాఖ్యలు గమనించ తగ్గవి. సీమాంధ్ర ప్రజల, నాయకులని విశ్వాసంలోకి తీసుకోకుండా ఏక పక్షంగా సాగిస్తున్న విభజన ప్రక్రియ  భవిష్యత్తులో ఎన్నో విపరిణామాలకి దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు.  నిజమే మరి ! ఓ పక్క లక్షలాది ప్రజలు గత 82 రోజులుగా  రాష్ట్ర విభజన ప్రతిపాదనకి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి వుద్యమిస్తుంటే కేంద్రానికి కనపడలెదు.  కానీ మంత్రుల కమిటీ కి రెండు వేల ఈ మెయిళ్ళు వచ్చాయిట ! ఏపీ లో అందరూ విభజననే కోరుకుంటున్నారని షిండే గారు సెలవిచ్చారు ! ఇంతకన్నా మూర్ఖత్వం ఎక్కడైనా ఉందా ? అసలు ఆ ఈ మెయిల్స్ ఎవరు  ఇచ్చారు? అందులో ఏముంది ఎవరు చూసారు ?  విభజన విషయంలో మొదటినుండీ తొండి  ఆడుతున్న కేంద్రం పారదర్శకంగా వ్యవహరించట్లేదు.  ప్రజల సొమ్ము వెచ్చించి నియమించిన శ్రీ కృష్ణ కమిషన్ 8 వ అధ్యాయంలో ఏమి వుందో ఈ రోజుకి ప్రజల కి తెలియదు.  రాష్ట్ర విభజన అంశం పై నియమించిన కమిషన్ నివేదిక లో ఒక భాగం రాష్ట్ర ప్రజలకి తెలియక పోవటం విచిత్రం....అంతే కాదు. శాసన సభ తీర్మానం అవసరం లేదంటూ ప్రకటనలు చేయటం కూడా అహంకారమే !  మొదటి ఎస్ఆర్సీ ద్వారా రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో ఆనాడు ఆంధ్ర, - హైదరాబాద్ రాష్ట్ర విలీనాల కోసం ఆయా  రాష్ట్ర శాసన సభల్లో తీర్మానాలు జరిగాయి.  మరి విడి పోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు కూడా ప్రస్తుత రాష్ట్ర శాసన సభలో తీర్మానం జరిగి తీరాలి.  రెండో ఎస్ ఆర్ సి అన్నది ఎలాగో లెదు. కేంద్రం తన విచక్షణాదికారాల తోనే రాష్ట్ర విభజన కై ముందుకు వెళుతోంది. అటువంటప్పుడు రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల వారి అభిప్రాయాలకి విలువనిస్తూ, శాసన సభ తీర్మానం లేకుండా ముందుకు సాగటం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమే!         

No comments:

Post a Comment