మన ప్రజాస్వామ్య దేశంలో కార్య నిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు వేటికవే స్వతంత్రంగా పని చేయటం అత్యావశ్యకమే. అయితే కొన్ని సందర్భాల్లో కార్యనిర్వాహక వ్యవస్థలు దారి తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు జోక్యం చేసుకొని సరి దిద్ద వలసిన బాధ్యత న్యాయ వ్యవస్థకి ఉంటుంది. అయితే దురదృష్ట వశాత్తు తొలి దశ నుండి అత్యంత అప్రజాస్వామికంగా, ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా సాగుతున్న ఆంధ్ర ప్రదేశ్ విభజన ప్రక్రియ పై దాఖలైన వ్యాజ్యాలని - పార్లమెంటు ముంగిటకి బిల్లు వచ్చిన దశలో కూడా - సరైన సమయం కాదు అని పేర్కొంటూ సుప్రీం కోర్టు తిరస్కరించటం శోచనీయం. రాజ్యాంగంలోని ఆర్టికిల్ 3 ని ఎంత దారుణంగా దుర్వినియోగం చేస్తూ ఒక రాష్ట్ర విభజన ప్రతిపాదించ వచ్చు అన్నది ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం విషయంలో కేంద్రం నిరూపించి చూపింది. ఒక రాష్ట్ర విభజన ప్రక్రియలో ఆ రాష్ట్ర ప్రజానీకానికి గానీ లేదా ఆ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి గానీ ప్రమేయం అన్నదే లేకుండా సర్వాధికారాలు కేంద్రం గుప్పిట్లోకి తీసుకొని నిరంకుశంగా, ఏక పక్షంగా విభజన ప్రక్రియ సాగిస్తున్నప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించటం తప్ప చేయ గలిగింది ఏమీ లెదు. నవంబరు 2013 నాటికి రాష్ట్ర విభజనకి సంబంధించిన ముసాయిదా బిల్లు తయారు కాలెదు. అప్పటికి దాఖలైన వ్యాజ్యాలని అపరిపక్వ దశ అని పేర్కొంటూ కొట్టి వేయటంలో అర్ధం ఉంది. కానీ ఈ రోజు పరిస్థితి ఏమిటి? అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనల తో కూడిన - కారణాలు, లక్ష్యాలు అన్నవి చూపకుండా, ఆర్ధిక పత్రాలు జత చేయకుండా చిత్తు కాగితాల వంటి బిల్లు రాష్ట్ర శాసన సభ మొఖాన కొట్టి కేంద్రం అభిప్రాయం చెప్పమనటం ఏ విధంగా ప్రజాస్వామికం అవుతుంది? కేంద్రం వల్లె వేస్తున్న ఆర్టికిల్ 3 లోనే పార్లమెంటులో పెట్టబోయే బిల్లునే రాష్ట్ర శాసన సభ అభిప్రాయానికి పంపాలని ఉన్నప్పుడు చిత్తు ప్రతిని పంపటం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? బిల్లు పై రాష్ట్ర శాసన సభ అందజేసిన 9000 పైగా సవరణల గురించి ఏ మాత్రం పట్టించుకోక పోవటమె గాక - రాష్ట్ర శాసన సభ, శాసన మండలి తిరస్కరించి పంపిన బిల్లుని ఏ ప్రాతిపదిక మీద పార్లమెంటుకి సమర్పిస్తారు అన్నది స్పష్టం చేయకుండా మొండి గా ముందుకి వెళ్ళటం అప్రజాస్వామికం. ఈ
బిల్లులో అనేక లోపాలు ఉన్నట్లు న్యాయ నిపుణులు తెలియ జేస్తున్నా ఏ మాత్రం ఖాతరు చేయకుండా తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తోందన్నది స్పష్టం. ఈ దశలో కూడా పార్లమెంటు వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమంటూ న్యాయస్థానం చేతులెత్తేస్తే బాధిత రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు దిక్కేమిటి? ఒక వేళ కేంద్రంలో అధికార, ప్రతి పక్షాలు చేతులు కలిపి, బిల్లుని చట్టంగా మార్చినప్పుడు న్యాయస్థానం ఆ చర్యని వెనుకకి తీసుకు రాగలదా? ఇది అపరిపక్వ దశ అని న్యాయస్థానం నిర్ణయించినప్పుడు, సరైన సమయం ఏది అన్నది కూడా తీర్పులో వెలువరిస్తే బాగుండేది.
ముందు తన్నుకుచావండి ఆతరువాత కోర్టుకు రండి ముందుగా మేము ఏమిచేయలేము అంటున్నాయి
ReplyDelete